ఓపీ సేవలకే మూణ్నాలుగు రోజుల సమయం
అప్పటిదాకా షెడ్డులోనో.. చెట్లకిందో గడపాల్సిందే
బోధనాసుపత్రుల్లో వేధిస్తున్న వైద్యులు, నర్సుల కొరత
దాదాపు 38% మంది వైద్యులు, 27% మంది నర్సుల ఖాళీలు
గత నాలుగేళ్లలో పెరిగిన రోగుల తాకిడి

రాష్ట్రంలోని పెద్దాసుపత్రుల్లో పరిస్థితులు రోగులకు ప్రత్యక్ష నరకం చూపుతున్నాయి. ఔట్‌ పేషెంట్‌గా ఇక్కడకు రావడం వరకే రోగుల చేతుల్లో ఉంటోంది. తిరిగి ఇంటికెళ్లేది ఇవ్వాళేనా.. పోనీ రేపా… కాదు ఎల్లుండా అంటే ఎవరి వద్దా కచ్చితమైన సమాధానం ఉండదు. వ్యవస్థాపరమైన లోపాలు రోగులపాలిట శాపాలవుతున్నాయి. రోజుకు సుమారు రెండు వేల మంది రోగులు నిత్యం ఔట్‌ పేషెంట్‌(ఓపీ) విభాగానికి వస్తుండగా అందుకు తగ్గట్టు వైద్యులు, సిబ్బంది లేకపోవడం పెద్దాసుపత్రులను పట్టి వేధిస్తున్న పెద్ద జబ్బు. అంతమందిని పరీక్షించడానికి వైద్యులకు అసలు సమయమే ఉండడంలేదు. దీంతో రోగి బాధను పూర్తిగా వినకుండానే పరీక్షలకు పంపించడంపైనే వైద్యులు దృష్టిపెడుతున్నారు. ధర్మాసుపత్రులకు పట్టిన జబ్బును నయం చేయడానికి ప్రభుత్వమే నడుం కట్టాల్సి ఉంది. రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల్లో దాదాపు 38 శాతం, నర్సుల పోస్టుల్లో సుమారు 27 శాతం ఖాళీలున్నాయి. నిమ్స్‌లో ఖాళీల భర్తీ కొంత మెరుగ్గా ఉన్నా.. ఉస్మానియా, గాంధీ, వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రుల్లో మాత్రం వైద్యులు, నర్సుల లోటు ప్రభావం రోగులపై తీవ్రంగా కనిపిస్తోంది.

ఉదయం 7 గంటలకు ఓపీలో నిలుచుంటే..
వైద్యుల కొరతతో ఓపీలో రోగులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఉదయం 7 గంటలకు ఓపీలో నిలుచుంటే.. వైద్యుని సంప్రదింపులకే దాదాపు నాలుగైదు గంటలు పట్టడం గమనార్హం. దీంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంలో  జాప్యమవుతోంది. నిర్ధారణ పరీక్షలయి, తిరిగి వైద్యుణ్ని కలిసి చికిత్స పొందడం వంటివి పూర్తయ్యే సరికి కనీసం నాలుగైదు రోజులైనా పడుతోంది. అప్పటి దాకా ఆసుపత్రి వెలుపల చెట్ల కింద, షెడ్‌ల కింద రోగులు తలదాచుకుంటున్నారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, ఎంజీఎం, నిమ్స్‌ తదితర ఆసుపత్రుల్లో వెలుపల గడిపే రోగి బంధువులు, రోగులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు దుర్భరమవుతోంది.

వైద్య నియామక సంస్థను ఏర్పాటు చేసినా..
ప్రధాన బోధనాసుపత్రుల్లో ప్రస్తుతమున్న వైద్యుల్లోనూ అత్యధిక శాతం మంది మధ్యాహ్నం 12-2 గంటల మధ్యలోనే విధుల నుంచి సొంత క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. పీజీ వైద్యవిద్యను అభ్యసించే క్రమంలో సీనియర్‌ రెసిడెంట్లు, పీజీ వైద్య విద్యార్థులు ఎక్కువ సమయం వైద్యసేవల్లో ఉండడం కొంతలో కొంత నయంగా ఉంది. దీర్ఘకాలంగా మంజూరు చేసిన పోస్టులే భర్తీకి నోచుకోవడం లేదు. చివరకు ప్రత్యేకంగా వైద్య నియామక సంస్థను ఏర్పాటు చేసినా.. ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఇటీవలే 1466 వైద్యుల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. త్వరగా వైద్య నియామక సంస్థ కార్యకలాపాలను అమల్లోకి తీసుకురావడంపై సర్కారు దృష్టిపెట్టాల్సిన అవసరముంది. మరోపక్క బోధనాసుపత్రుల్లో పెరిగిన రోగుల తాకిడికి తగ్గట్లుగా వైద్యులు, నర్సుల సంఖ్యను దాదాపు రెట్టింపు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

వీరిద్దరూ గత వారం నుంచీ ఇక్కడే!

నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం పడగల్‌ గ్రామానికి చెందిన మల్లయ్య(60) మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. గత సోమవారం(జులై 29న) గాంధీ ఆసుపత్రిలో ఓపీలో వైద్యుని సంప్రదింపులకు భార్యతో కలిసి వచ్చారు. వైద్యుని సంప్రదింపులయ్యేసరికే ఆరోజు మధ్యాహ్నం 2 గంటలు దాటింది. మూత్రపిండాల వ్యాధి నిపుణులు రాసిచ్చిన నిర్ధారణ పరీక్షల కోసం రెండు రోజులు పట్టింది. శుక్రవారానికి పరీక్షల ఫలితాలొచ్చాయి. మళ్లీ ఇప్పుడు వైద్యుణ్ని సంప్రదించాలంటే సోమవారం(5వ తేదీ) వరకూ ఆగాలంటున్నారని చెబుతున్నారు మల్లయ్య. ఇంటికెళ్లి మళ్లీ రావడం ఖర్చుతో కూడినదని భావించి ఆసుపత్రి ఆవరణలోనే షెడ్డు కింద కాలం వెళ్లదీస్తున్నారు.

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కాన్కుర్తి గ్రామానికి చెందిన నర్సప్ప(65) కడుపునొప్పితో బాధపడుతూ గత నెల 29న గాంధీ ఆసుపత్రికొచ్చారు. వైద్యుడు పరీక్షించి ఎక్స్‌రే సహా కొన్ని పరీక్షలు సూచించారు. నిర్ధారణ పరీక్షలు పూర్తయి, ఫలితాలొచ్చేసరికి మరో నాలుగు రోజులు గడిచిపోయాయి. ఓపీలో మళ్లీ వైద్యుణ్ని సంప్రదించి, మందులు రాసిస్తే ఇంటికెళ్తామంటున్నారు నర్సప్ప. ‘‘డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.. ఇప్పుడు కాదు. తర్వాత రమ్మని చెబుతున్నారు.. మా ఊరికి పోయి, మళ్లీ ఇంత దూరం రావడం మాకెంత కష్టం? అందుకే డాక్టర్‌కు చూపించుకున్నాకే వెళ్దామని ఇక్కడ షెడ్డు కిందే ఉంటున్నాం’’ అని నర్సప్ప తన ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక బోధనాసుపత్రుల్లో రోగుల దుస్థితికివి ప్రత్యక్ష తార్కాణాలు.

(Courtacy Eenadu)