• 5,100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లపై పిటిషన్‌ కొట్టివేత
  • బస్సులకు పర్మిట్లు ఇచ్చేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌
  • సర్కారుకు సంపూర్ణ అధికారాలు.. 50% మించరాదు
  • గెజిట్‌ నోటిఫికేషన్‌.. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి
  • ప్రజలు, ఆర్టీసీ నుంచి అభిప్రాయాలను స్వీకరించాలి
  • రోడ్డు భద్రత పాటించాలి.. అధిక రద్దీని నివారించాలి
  • ప్రజల అంచనాలకు తగినట్లు ప్రజా రవాణా ఉండాలి
  • హైకోర్టు ధర్మాసనం మార్గదర్శకాలు

సరళీకరణ విధానాలతోనే గుత్తాధిపత్యం పోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ పుంజుకుంటోంది. వేగంగా ప్రపంచీకరణ జరుగుతోంది. పోటీతత్వం ఉంటేనే సౌకర్యాలు మెరుగుపడతాయి. రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలంటే పోటీతత్వాన్ని తిరస్కరించడానికి బదులు ఆహ్వానించడమే మేలు.

హైకోర్టు ధర్మాసనం

టీఎస్‌ ఆర్టీసీలో 5,100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలంటూ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. మోటారు వాహనాల సవరణ చట్టం ప్రకారం ఈ విషయంలో ప్రభుత్వానికి విశేషాధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వడానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా వివరించింది. ప్రైవేటు ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించవచ్చని, అయితే, అది 50 శాతానికి మించరాదని తెలిపింది. 5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వడానికి కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ‘‘చట్ట నిబంధనలు పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్‌ 102 ప్రకారం ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని ఏదేని నిర్ణయం తీసుకునే విశేషాధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి. నిబంధనల ప్రకారం.. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలంటే చట్ట సవరణకు సంబంధించి తొలుత గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. దానిపై అభ్యంతరాలు స్వీకరించేందుకు స్థానిక పత్రికల్లో 30 రోజులు గడువు ఇస్తూ ప్రకటన ఇవ్వాలి. ప్రజల నుంచి, ఆర్టీసీ నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. ఈ నిర్ణయంతో నష్టపోయే ఆర్టీసీ అభిప్రాయాన్ని తీసుకోవాలి అని నిర్దేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు…మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు తగిన రక్షణ, రోడ్డు భద్రత ఉండాలని, రద్దీ (ఓవర్‌ క్రౌడింగ్‌) నివారించేలా చర్యలు ఉండాలని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. కొత్తగా తెచ్చిన సవరణ చట్టంలోని సెక్షన్‌ 67 (3) ప్రకారం.. రోడ్డు రవాణాను సంపూర్ణంగా నియంత్రించే అధికారాలు ప్రభుత్వానికి సంక్రమించాయని స్పష్టం చేసింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 67, సెక్షన్‌ 102ను సంయుక్తంగా అధ్యయనం చేస్తే.. రోడ్డు రవాణాను నియంత్రించే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని స్పష్టమవుతున్నాయని తెలిపింది. ట్రాన్స్‌పోర్టు సర్వీసు ప్రొవైడర్స్‌ అన్న పదంలో ఆర్టీసీ కలిసే ఉంటుందని తెలిపింది. 5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వడానికి కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మాజీ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర రావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం కూడా హైకోర్టు తుది ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్‌ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయవచ్చని మీరు కోర్టు పరిశీలనకు ఇచ్చిన మూడు తీర్పులూ ఈ కేసుకు వర్తించడం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అంతకుముందు.. ఆర్టికల్‌ 166 ప్రకారం కేబినెట్‌ నిర్ణయంపై కోర్టులు జోక్యం చేసుకోరాదని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 166 బిజినెస్‌ రూల్స్‌ గురించి చెబుతోందని, కేబినెట్‌ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయకూడదని అందులో లేదని ధర్మాసనం ఎత్తిచూపింది. కేబినెట్‌ తీర్మానాన్ని పిటిషనర్‌ సవాల్‌ చేశారని, కాబట్టి కోర్టులు జోక్యం చేసుకోవచ్చని తెలిపింది.

చట్ట ప్రక్రియను ప్రభుత్వమే చేయాలి..చట్ట ప్రక్రియను పూర్తి చేయడానికి కేబినెట్‌ నిర్ణయంలో స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఎస్టీఏ)కి అనుమతి ఇచ్చినట్లు ఉందని, చట్ట ప్రక్రియను ప్రభుత్వమే చేయాలని, దానిని మరో సంస్థకు బదలాయించడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘‘ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వడానికి చర్యలు ప్రారంభించాలని స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీని కోరడం సరికాదు. చట్ట ప్రకారం ఆ పనిని ప్రభుత్వమే చేపట్టాలి. దానిని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేను కేసుల విచారణ చేపడతా. అలాగే, నల్సార్‌ యూనివర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా, న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌గా, హైకోర్టు పరిపాలనాధికారిగా విధులు నిర్వర్తిస్తాను. అయితే, అన్ని విధులూ ఒక్కటి కాదు. అలాగే, ఎస్టీయేలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శే చైర్‌పర్సన్‌గా ఉండవచ్చు. అక్కడ విధులు వేరు. ఎస్టీఏ వేరు.. ప్రభుత్వం వేరు అని వ్యాఖ్యానించింది. దాంతో, ప్రభుత్వం తరఫున చట్ట ప్రకారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చర్యలు తీసుకుంటారని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన ధర్మాసనం ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టి వేసింది.

ఆదేశాల నిలుపుదలకు నో…డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె చేస్తున్న తరుణంలో ప్రభుత్వం కక్షసాధింపు చర్యగా ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తున్నట్లు ప్రకటన చేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకునే అధికారం చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. దాంతో, ఈ అంశంపై తాము సుప్రీం కోర్టుకు వెళతామని, అప్పటి వరకూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది.

Courtesy Andhrajyothy..