• బస్వరాజు సారయ్య, బి. దయానంద్‌ కూడా..
  • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక
  • నేడు ప్రమాణ స్వీకారం!
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కో ఆప్షన్‌కు అవకాశం
  • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక
  • నేడు ప్రమాణ స్వీకారం!

హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకూ పేర్లు ఖరారయ్యాయి. ప్రగతి భవన్‌లో శుక్రవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం.. ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రజాకవి గోరటి వెంకన్న; మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నేత బస్వరాజు సారయ్య; వాసవీ కేంద్రం ముఖ్య సలహాదారు, ఆర్యవైశ్య సంఘం నేత బొగ్గారపు దయానంద్‌లతో భర్తీ చేయాలని నిర్ణయించింది. వీరి పేర్లను గవర్నర్‌కు పంపింది. గవర్నర్‌ ఆమోదం లాంఛనమేనని, ముగ్గురి ప్రమాణ స్వీకారం శనివారమే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి శాసనమండలికి సమాచారం కూడా వెళ్లిందని చెబుతున్నారు. గతంలో గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపికైన నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్‌, రాములు నాయక్‌ పదవీ కాలం పూర్తవడంతో ఈ మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాములు నాయక్‌ 2018 ఎన్నికలకు ముందు కాంగ్రె్‌సలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు వేశారు. ఆ కేసు న్యాయస్థానంలో కొనసాగుతుండగానే మార్చి 2, 2020లో రాములు నాయక్‌ పదవీ కాలం పూర్తయిపోయింది. ఈ ఏడాది జూన్‌, ఆగస్టులో నాయిని, కర్నె పదవీ కాలం కూడా ముగిసింది. అప్పటి నుంచి ఈ స్థానాలను ఖాళీగా ఉంచిన కేసీఆర్‌ సర్కారు.. సరిగ్గా గ్రేటర్‌ ఎన్నికల ముందు సామాజిక సమీకరణాలతో పేర్లను ఖరారు చేసింది.

నగర వ్యాపార రంగాలపై గట్టి పట్టున్న ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి బొగ్గారపు దయానంద్‌ను ఎంపిక చేశారు. బీసీల్లోనూ వెనుకబాటుకు గురైన రజక సామాజిక వర్గం నుంచి సారయ్య పేరును ఎంపిక చేశారు. దయానంద్‌, సారయ్యలు వారి కుల సంఘాల్లో ప్రముఖులుగానూ ఉన్నారు. ప్రజాకవుల్లో గోరటి వెంకన్న పేరు బాగా ప్రాచుర్యంలో ఉంది. ఎస్సీ విభాగంలో మాల సామాజిక వర్గం నుంచి ఆయన్ను ఎంపిక చేశారు. ఆయా వర్గాలను ప్రభావితం చేయగల ముగ్గురిని గ్రేటర్‌ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 15, 16 తేదీల్లో వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఆ లోపే ముగ్గురితో ప్రమాణం చేయిస్తే కో ఆప్షన్‌ సభ్యులుగా వారికి అవకాశం దక్కుతుంది. మేయర్‌ ఎన్నికలో ఓటు హక్కు లభిస్తుంది. దీంతో శనివారమే వారితో ప్రమాణం చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానానికి ప్రజాకవి గోరటి వెంకన్న పేరును ప్రభుత్వం నామినేట్‌ చేయనుందని ఇప్పుడు గోరటి వెంకన్నను నామినేట్‌ చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

గోరటి వెంకన్న: ఏఆర్‌ సబ్‌ డివిజనల్‌ కో ఆపరేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఉస్మానియా నుంచి ఎంఏ(తెలుగు) పట్టా పొందారు. రేల పూతలు, ఏకనాథం మోత, పూసిన పున్నమి, వల్లంకితాళం, ద వేవ్‌ ఆఫ్‌ ద క్రిసెంట్‌ అనే పుస్తకాలు రాశారు. కబీర్‌ సమ్మాన్‌, హంస, కాళోజీ, సినారే, లోకనాయక్‌, అరుణసాగర్‌ అవార్డులను, అధికార భాషా సంఘం పురస్కారాన్నీ పొందారు.

బస్వరాజు సారయ్య: మాజీ మంత్రి బస్వరాజు సారయ్య.. ఇంటర్‌, ఐటీఐ పూర్తి చేశారు. దక్షిణ భారత దేశంలో రజక కులం నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఏకైక నేత సారయ్య.

బొగ్గారపు దయానంద్‌: ప్రోటోకాల్‌ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన దయానంద్‌.. 2003లో వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. గోషామహల్‌ నియోజకవర్గంలో పనిచేస్తూ ఆ పార్టీ బిజినెస్‌ సెల్‌  రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 2014లో టీఆర్‌ఎ్‌సలో చేరిన ఆయన.. పార్టీ సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొని మంత్రి కేటీఆర్‌ దృష్టిలో పడ్డారు.

కేసీఆర్‌, కేటీఆర్‌కు ధన్యవాదాలు: గోరటి
‘‘సీఎం కేసీఆర్‌ సాహిత్య నేపథ్యమున్న వ్యక్తి. ఆయనకు నా పాటలు, కవితలంటే అభిమానం. ఆ మాట పలు సందర్భాల్లో ఆయనే చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన నాతో పాటలు రాయించిండు. కేసీఆర్‌కి నా మీదున్న అభిమానంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అందుకు కేసీఆర్‌, కేటీఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. గుర్రం జాషువా, బోయి భీమన్న వంటి సాహితీ దిగ్గజాలు శాసనమండలి సభ్యులుగా సేవలందించారు. ఇప్పుడు నాకా అవకాశం రావడం ఆనందంగా ఉంది. చట్ట సభల్లో ప్రజా పక్షపాతిగా నడుచుకుంటా’’ అని గోరటి వెంకన్న అన్నారు.

సీఎం శుభాకాంక్షలు
గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు శుక్రవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. తమను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముగ్గురికీ సీఎం అభినందనలు తెలియజేశారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని చెప్పారు.

Courtesy Andhrajyothi