పబ్లిక్‌ డొమైన్‌లో కానరాని ప్రభుత్వ ఉత్తర్వులు..
అమలు కాని హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌ కుమార్‌ను నియమించారు. ఇది జరిగి 50 రోజులైంది. ఇదేమీ రహస్యం కాదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన విషయమే.   సంబంధిత జీవో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కనిపించదు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 51 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఇందుకు మూడు జీవోలను జారీ చేశారు. ఇది కూడా అందరికీ తెలియాల్సిన విషయమే. సంబంధిత జీవోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా చెప్పడం లేదు. సదరు విషయానికి సంబంధించి జీవో జారీ చేస్తేనే ప్రభుత్వం అధికారికంగా చెప్పినట్లు. కానీ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోంది. కానీ, జారీ చేసినట్లు అధికారికంగా చెప్పడం లేదు. సోషల్‌ మీడియా ద్వారానే ప్రజలు తెలుసుకోవాల్సి వస్తోంది. ఇవి మాత్రమే కాదు.. వివిధ శాఖల పరిధిలో ప్రభుత్వం జారీ చేసే అనేక జీవోలు ఇప్పుడు వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. గత నాలుగున్నరేళ్లలో 43 వేల జీవోలు మాయమయ్యాయని అధికారులే చెబుతున్నారు. 2014 జూన్‌ 2 నుంచి 2019 ఆగస్టు 15వ తేదీ దాకా 1.04 లక్షల జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. వాటిలో 43,462 జీవోలను డొమైన్‌లో పెట్టలేదని ఆర్టీఐ కార్యకర్త ఒకరు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం జవాబిచ్చింది. దీనిపై హైకోర్టులో కేసు కూడా దాఖలైంది.

జీవోలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకూ కోర్టు ఆదేశాలు అమలు కాలేదు. ఆర్థిక శాఖ విడుదల చేసే బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డరు మూడేళ్లుగా వెబ్‌ సైట్‌లో కనిపిస్తే ఒట్టు. వాటి ఆధారంగా ఇతర శాఖలు జీవోలు విడుదల చేస్తున్నా.. రిఫరెన్స్‌లో జీవో నంబర్లు పొందుపరుస్తున్నా.. ఆ జీవోలు మాత్రం కనిపించడం లేదు. ఈనెల 8న 30కిపైగా జీవోలు జారీ చేశారు.  వాటిలో 21 మాత్రమే వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. జీవోలను రహస్యంగా ఉంచాలనే ఉత్తర్వులు ఏమీ లేవు. ఆర్టీఐ చట్టానికి ముందు నుంచే ప్రభుత్వ జీవోలన్నిటినీ వెబ్‌సైట్‌లో   ఉంచుతూ వస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని జీవోలు రహస్యంగా జారీ అవుతున్నాయి.

ఇందుకు wwwgoir.telangana.gov.inలో రెండంచెల వ్యవస్థను అమలు చేస్తోంది. సదరు రహస్య జీవోలు సంబంధిత సెక్షన్‌ ఆఫీసర్‌ (ఎస్‌వో) లాగిన్‌లో మాత్రమే కనిపిస్తాయి. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎ్‌సవో), ఎస్‌వోలు మాత్రమే ప్రత్యేక పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయి ఆ జీవోలను చూడవచ్చు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు కూడా వీటిని చూసే అవకాశాల్లేవు.

Courtesy Andhrajyothi