– గుట్టుగా నమూనాల సేకరణ
– విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 14 బ్లాకులు గుర్తింపు
– త్వరలో గ్లోబల్‌ టెండర్లు
– ప్రజా వ్యతిరేకత బేఖాతరు
– విజయనగరం ప్రతినిధి

ఉత్తరాంధ్రలోని పచ్చని పల్లెల్లో మాంగనీసు చిచ్చు రేపుతోంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున విస్తరించి ఉన్న ఈ ఖనిజాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు ప్రారంభించింది. ఈ రెండు జిల్లాల్లోని 14 బ్లాకుల్లో ఖనిజ నిలువలను గుర్తించారు. వీటిలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నమూనాలు సేకరించగా, మరి కొన్నింటిలో సేకరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేసి గ్లోబల్‌ టెండర్లు పిలవడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఒకటి. రెండు బహుళ జాతి సంస్థలు ఈ గనులపై కన్నేశాయి. ఆ సంస్థల ప్రతినిధులు కూడా ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లో పర్యటించినట్లు తెలిసింది. ఈ సంస్థల సూచనల మేరకు ఈ రెండు జిల్లాలోని కొన్ని బ్లాకుల్లో రీ సర్వే పనులను కేంద్రం చేపట్టనుంది. ఉన్నతస్థాయి అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి, తెర్లాం, మెరకముడిదాం, రామభద్రపురం మండలాల్లో సుమారు 14 చోట్ల, శ్రీకాకుళం జిల్లాలో రాజాం మండలం గార్రాజు చీపురుపల్లి, లావేరు మండలం పెదలింగాలవలస ప్రాంతాల్లో మాంగనీసు నిక్షేపాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీటి నాణ్యతను పరిశీలించేందుకు మైన్స్‌ అండ్‌ జియాలజి శాఖ అధికారులు ప్రసుత్తం ర్యాండమ్‌ సర్వేలు చేపట్టారు. ‘ఇక్కడ ఖనిజ నాణ్యతపై ఒక అంచనా ఉంది. దానిని నిర్ధారించుకునేందుకు ఈ సర్వేలు చేస్తున్నాం.’ అని ఒక అధికారి చెప్పారు. ఈ సర్వేలు పూర్తయిన తరువాత ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ, పనులు జరుగుతున్న విధానాన్ని బట్టి అభిప్రాయ సేకరణ తంతుగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

రెండేళ్లుగా ప్రయత్నాలు…
వాస్తవానికి మాంగనీసును వెలికితీసేందుకు రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పటి నుండి ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న అధికారులను స్థానికులు అనేకవిధాలుగా అడ్డుకున్నారు. గత నెల 28న నెల్లిమర్ల మండలం గరికిపేట కొండపై మాంగనీసు గ్రేడింగ్‌ సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మండల ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా అధికార యంత్రాంగానికి వినతులు అందజేశారు. సర్వేలు ఆపాలని, మాంగనీసు క్వారీలను బహుళజాతి కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలను విడనాడాలని డిమాండ్‌ చేశారు. అయినా, ప్రభుత్వం బేస్‌ లెవెల్‌ సర్వేతోపాటు ఏరియల్‌ సర్వేలు పూర్తి చేసింది. ఒక్క విజయనగరం జిల్లాలోనే ఏడు బ్లాకుల్లోని 1,113 ఎకరాల్లో మాంగనీసు, ఒక బ్లాకులో 150 మీటర్లలో ఇనుము తవ్వకాలకు వీలుగా ఉన్నాయని గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్సు (ఐబిఎం), జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జిఎస్‌ఐ), మినరల్‌ ఎక్స్‌ప్లరేషన్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఇసిఎల్‌) ఉన్నతాధికారులు సంయుక్తంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

ప్రజలు అర్ధం చేసుకోవాలి : మైన్స్‌ ఎడి
రాష్ట్రంలోనే అత్యధికంగా మాంగనీసు నిక్షేపాలున్న జిల్లాల్లో విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయని చెప్పారు.
వీటిలోని మాంగనీసు నిల్వలు, దాని గ్రేడ్‌, ఇతర అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించ నుంది. అందుకోసమే కేంద్ర బృందాలు సర్వేలు చేస్తున్నాయి. ప్రజలు అర్థం చేసుకుని సహకరిస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందని గనుల శాఖ ఎడి ఎస్‌వి రమణారావు అన్నారు..

ఇవీ దుష్ఫలితాలు
మాంగనీసు మైనింగ్‌ జరిగే ప్రాంతాల్లో అక్కడి గనుల్లో పనిచేసే వారితో పాటు కొన్ని కిలోమీటర్ల దూరంలో నివసించే ప్రజానీకంలో నాడీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ ఖనిజం నీటిలో కలిసిపోతే ప్రభావం మరింత ఎక్కువగా కనపడుతోందని కొన్ని నిర్ధారణలు తేల్చాయి.ఈ గనులు తవ్వే ప్రాంతాల్లో నివసించే చిన్న పిల్లల్లో కూడా అనేక రకాల వ్యాధులు కనపడుతున్నాయి. కొన్ని చోట్ల క్యాన్సర్‌ కూడా పెద్ద ఎత్తున ఉన్నట్లు తేలింది. పశువులపై కూడా దీని ప్రభావం గణనీయంగా కనపడుతోంది. అయితే, అధికారయంత్రాంగం మాత్రం ఈ దుష్పరిణామాలపై ఇంతవరకు స్థానిక ప్రజల్లో ఎటువంటి ప్రచారం చేయడం లేదు.

Courtesy Prajasakti