ప్రపంచంలో ఆకలి స్థితిని తెలియజేసే గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు. 2019 సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఇటీవలే విడుదల చేశారు. దీనిని ఐరిష్‌ సంస్థ అయిన కన్సర్న్‌ వరల్డ్‌ వైడ్‌, జర్మన్‌ సంస్థ అయిన వెల్‌ హంగర్‌ హిల్పేవస్‌ కలసి సంయుక్తంగా విడుదల చేశారు. 2000 తర్వాత ఆకలిని తగ్గించ డంలో కొంత ప్రగతి సాధించింది. కానీ చాలా దేశాలలో ఆకలితో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉన్నది.
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నాలుగు ముఖ్యాంశాల్ని పరిగణనలోకి తీసుకొని అంచనా వేస్తారు. మొత్తం జనాభాలో పోషకాహార లోపంతో ఉన్న వారి శాతం, ఐదేండ్ల లోపు ఉన్న పిల్లలలో ఎత్తుకు తగ్గ బరువులేని (చైల్డ్‌ వెస్టింగ్‌) వారి శాతం, ఐదేండ్ల లోపు ఉన్న పిల్లలలో వయసుకు తగ్గ ఎత్తు లేని వారి శాతం (స్టంటింగ్‌) అలాగే ఐదేండ్లలోపు ఉన్న పిల్లల్లో మరణాల సంఖ్యను ఆధారంగా చేసుకొని జీహెచ్‌ఐ లెక్కిస్తారు. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌, యునిసెఫ్‌, వరల్డ్‌ బ్యాంకుల నుంచి సేకరించి జీహెచ్‌ఐ నిర్ధారిస్తారు.
2019 సంవత్సరానికి జీహెచ్‌ఐ 117 దేశాలలో లెక్కించారు. జీహెచ్‌ఐని 100 పాయింట్‌ స్కేల్‌పై లెక్కిస్తారు. ఇందులో 10కన్నా తక్కువ పాయింట్లు వస్తే ఆకలి కనిష్ట స్థాయిలో ఉన్నట్టు. అలాగే 10 నుంచి 19.9 పాయింట్లు వస్తే ఆకలి తక్కువ మోతాదులో ఉన్నట్టు. 20 నుంచి 34.9 పాయింట్ల మధ్యలో వస్తే ఆకలి తీవ్రస్థాయిలో ఉన్నట్టు, 35 నుంచి 49.9 మధ్యలో ఉంటే ఆకలి ఆందోళనకరంగా ఉన్నట్టు, 50 పైన పాయింట్లు ఉంటే ఆకలి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్టుగా పరిగణిస్తారు. దీని ప్రకారం 46 దేశాలలో ఆకలి కనిష్ట స్థాయిలో ఉన్నది. 23 దేశాలలో తక్కువ స్థాయిలో ఉన్నది. 43 దేశాలలో తీవ్ర స్థాయిలో ఉన్నది. నాలుగు దేశాలలో (చాద్‌, మడగాస్కర్‌, యెమెన్‌, జాంబియా) ఆందోళనకరంగా ఉండగా, ఒక దేశంలో (సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌) అత్యంత ఆందోళనకరంగా ఉందని నివేదిక వెల్లడించింది.
సరైన పోషక ఆహారం లేకుండా ఉండే స్థితిని కూడా ఆకలిగా భావిస్తారు. సరైన పరిమాణంలో ఆహారం తీసుకోలేకుండా ఉండడం, తీసుకునే ఆహారంలో పోషక విలువలు లేకపోవడం హంగర్‌ ఇండెక్స్‌ను పెంచుతుంది. ఒక మనిషి ఆరోగ్యవంతమైన, ఫలవంతమైన జీవితాన్ని గడపాలంటే పోషక విలువలున్న మంచి ఆహారం తీసుకోవడం తప్పనిసరి. తీసుకునే ఆహారం వ్యక్తి యొక్క వయస్సు, పనిని బట్టి ఉండాలి. పోషక విలువలున్న ఆహారం మనిషికి శక్తి, ప్రోటీన్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి. తక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకోవడం అలాగే నాణ్యతలేని ఆహారం తీసుకోవడం అండర్‌ న్యూట్రిషన్‌కు దారితీస్తుంది. తక్కువ ఆదాయాలు, ఆహార భద్రత కొరవడడం, శిశు సంరక్షణకు కావలసిన పరిస్థితులు లేకపోవడం, ప్రసవానికి ముందు తల్లి మానసిక, శారీరక, ఆరోగ్య పరిస్థితులు హంగర్‌ ఇండెక్స్‌పై ప్రభావం చూపిస్తాయి.
విపరీతమైన వాతావరణ పరిస్థితులు, హింసాయుత వివాదాలు, యుద్ధాలు, ఆర్థిక మందగమన పరిస్థితి, ఆర్థిక సంక్షోభాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఆకలి సూచికలను పెంచుతున్నాయి. పోషకాహారం అందనివారు 2015లో 785 మిలియన్లు ఉండగా 2018లో అది 822 మిలియన్లకు పెరిగింది. తొమ్మిది దేశాల ఆకలి సూచికలు 2015 కన్నా 2018లో పెరిగాయి. సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, మెడగాస్కర్‌, యెమెన్‌, హైతి, నైజర్‌లలో పరిస్థితులు దారుణం గా ఉన్నాయని నివేదిక పేర్కొంది. దక్షిణ ఆసియా, సహారాలోని ఆఫ్రికా దక్షిణ ప్రాంతాలలో జీహెచ్‌ఐ స్కోరు చాలా ఎక్కువగా ఉన్నది. దక్షిణాసియాలో పిల్లలకు పోషకాహారం అందకపోవడం కారణమైతే సహారా ప్రాంతాలలో పోషకాహారం లేక శిశుమరణాలు పెరిగిపోవడం జీహెచ్‌ఐ స్కోరు పెరగడానికి కారణమవుతున్నది.
భారతదేశ జనాభా చాలా ఎక్కువ కాబట్టి మన జీహెచ్‌ఐ సూచికలు భారత ఉపఖండంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. చైల్డ్‌ వేస్టింగ్‌ మనదేశంలో చాలా ఎక్కువగా (20.8శాతం) ఉన్నది. చైల్డ్‌ స్టంటింగ్‌ కూడా చాలా ఎక్కువ. ముఖ్యమైన ఈ రెండు సూచికలు ఎక్కువగా ఉండడం వల్ల మనదేశ జీహెచ్‌ఐ రేటింగ్‌ పెరిగింది. అలాగే ఆరు నెలల నుంచి 23 నెలల వయసున్న శిశువులలో కేవలం 9.6శాతం పిల్లలకు మాత్రమే ఆమోదయోగ్యమైన పోషకాహారం లభ్యమవుతున్నదని జీహెచ్‌ఐ అంచనా వేసింది. అయితే కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ తరఫున చేపట్టిన సమగ్ర జాతీయ పోషకాహార సర్వేను అక్టోబర్‌ 7న విడుదల చేశారు. దీని ప్రకారం కేవలం 6.4శాతం పిల్లలు మాత్రమే అవసరమైన పోషకాహారం పొందుతున్నారని తెలుస్తున్నది. మెజారిటీ కుటుంబాలకు రక్షిత మంచినీటి సదుపాయం లేదు. స్వచ్ఛ భారత్‌ గురించి ప్రభుత్వాలు ఎన్ని ప్రచారాలు చేసినా ఫలితాలు కానరావడం లేదు. గాంధీ జయంతి నాడు భారతదేశంలోని గ్రామాలన్నీ బహిరంగ మల విసర్జన నుంచి విముక్తయ్యాయని ప్రధాని ప్రకటించారు. కానీ ఇది వాస్తవం కాదు. లక్షలాది టాయిలెట్లు కట్టించామని చెప్పినా బహిరంగ మల విసర్జన జరుగుతూనే ఉన్నది. ఇవి ప్రజారోగ్యంపై ప్రభావం చూపు తాయి. శిశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.
మన దేశం 30.3 పాయింట్లతో ఆకలి తీవ్రస్థాయిలో ఉన్న దేశాల జాబితాలో ఉన్నది. జీహెచ్‌ఐలోని 117 దేశాలలో 102వ స్థానంలో భారతదేశం ఉంది. పాకిస్థాన్‌ (94), బంగ్లాదేశ్‌ (88), నేపాల్‌ (73), శ్రీలంక (66) కన్నా మన దేశం తక్కువ స్థానాన్ని పొందింది. సులభతర వాణిజ్య ప్రక్రియ ర్యాంకింగ్లో వేగంగా పైకి వస్తున్న భారతదేశం ఇతర అన్ని సామాజిక సూచికలో వెనుకబడి ఉండడం ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తున్నది. ప్రజల కన్నా కార్పొరేట్‌లే వారి ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని భావించే ఆలోచన ధోరణితో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం హంగర్‌ ఇండెక్స్‌ను తగ్గించ లేకపోయిందని, ఆరోగ్య ప్రమాణాలను పెంచ లేకపోయిందని, పిల్లల పెరుగుదల, పోషణ పై ఏరకమైన ప్రభావం చూపించ లేక పోయిందని జీహెచ్‌ఐ తెలియజేస్తోంది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రతి సంవత్సరం ఆకలి, పోషకాహారనికి అనుసంధానమైన కొన్ని ఇతర ముఖ్యమైన విషయాల గురించి కూడా విపులంగా చర్చిస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచ ఆకలిపై పర్యావరణ మార్పు ప్రభావం గురించి నివేదిక విపులంగా చర్చించింది.
పర్యావరణ మార్పులు ఆహార ఉత్పత్తి, పోషకాహారంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనిజీహెచ్‌ఐ పేర్కొంది. పేదలపై మరింత భారాలను మోపుతోందని, ప్రపంచ ఆకలిని మరింత పెంచుతుందని నివేదిక తెలియజేసింది. పర్యావరణ మార్పులు ఉష్ణోగ్రతల పెంపుకు (గ్లోబల్‌ వార్మింగ్‌) ఎక్కువ పరిమాణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలకు దారి తీస్తుంది. దీని వల్ల వేడి గాలులు, కరువులు, వరదలు వచ్చే ప్రమాదాలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితులలో ఆహారోత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. పోషక విలువలు కల ఆహారం అందుబాటు తగ్గుతుంది. గోధుమలు, మొక్కజొన్న లాంటి ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల సముద్ర తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు, చిన్న చిన్న దీవులలో ఆహార ఉత్పత్తి పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఉదాహరణకు వియత్నాంలో వరి ఉత్పత్తిలో 50శాతం మెకాంగ్‌ డెల్టా ప్రాంతం నుంచి వస్తుంది. సముద్ర మట్టం పెరగడంతో దేశంలో వరి ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం వచ్చింది. ప్రపంచంలో సగం జనాభాకు వరి ప్రధానమైన ఆహారం. ఉష్ణోగ్రతలు, నీటిలో ఉప్పు సాంద్రతలు లాంటి చిన్న చిన్న మార్పులు కూడా వరి ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. పర్యావరణ మార్పుల వల్ల ఆహార భద్రతకు ప్రమాదం కలిగించే అవకాశాలు బాగా పెరిగాయని జీహెచ్‌ఐ తెలుపుతున్నది.
అంతర్జాతీయంగా పెను ప్రమాదాలకు పర్యావరణ మార్పులు కారణమవుతున్నాయి. 2011-16 మధ్య పర్యావరణ మార్పుల వల్ల 51 దేశాలలోని 124 మిలియన్‌ ప్రజలు తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొన్నారు. ఆహార అభద్రత వల్ల బాధలు అనుభవించారు. 2015- 16లో చాలా దేశాలలో ఎల్‌ నినో వల్ల తీవ్రమైన కరువు వచ్చింది. రానున్న రోజుల్లో గ్లోబల్‌ వార్మింగ్‌, కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఆకలి సూచీలో తక్కువ స్థాయిలో ఉన్న దేశాలు, అన్ని దేశాలలోని పేదలు మరింత భారాలను భరించాల్సిన పరిస్థితి వస్తుంది.
జీహెచ్‌ఐ ప్రపంచ ఆకలిని తగ్గించడానికి అలాగే ఆకలిపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని కీలక సూచనలు చేసింది. ఆహార సార్వభౌమత్వం, ఆహార భద్రతను పరిరక్షించడానికి ప్రభుత్వాలు సన్నకారు రైతులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని జీహెచ్‌ఐ సూచించింది. ఆహార ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలని, వనరులు, మార్కెట్‌ సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ విస్తరణ సదుపాయాలను పెంచాలని జి హెచ్‌ ఐ ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర ఉద్యోగాలను పెంచేట్టుగా చర్యలు తీసుకోవాలని, పర్యావరణానికి సంబంధించిన నిర్ణయాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని జీహెచ్‌ఐ సూచించింది. స్థానిక పద్ధతులను, సంప్రదాయ విజ్ఞానాన్ని అనుసంధా నించడం ద్వారా సంప్రదాయ పంటలను కాపాడుకోవాలని జీహెచ్‌ఐ సూచించింది. ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యం కూడా పెంచాలని జీహెచ్‌ఐ సూచించింది. వ్యవసాయరంగ పరిశోధనలను, టెక్నాలజీని రైతులకు అందుబాటులో ఉండేటట్టు విధాన నిర్ణయాలను చేయాలని సిఫారసు చేసింది. విపత్తుల నివారణకు ఎర్లీ వార్నింగ్‌ రెస్పాన్స్‌ వ్యవస్థలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని దీనికి సంబంధించిన పెట్టుబడులను పెంచాలని ప్రభుత్వాలను జీహెచ్‌ఐ కోరింది. ప్రకృతి వనరులపై గుత్తాధిపత్యం ప్రపంచ శాంతి, సుస్థిరతలకు భంగం కలిగిస్తుందని ఈ ఆధిపత్యాలను నియంత్రించాలని జీహెచ్‌ఐ పిలుపునిచ్చింది. పర్యావరణంపై పారిస్‌ ఒప్పందాన్ని ప్రభుత్వాలన్నీ అమలు చేయాలని కూడా జీహెచ్‌ఐ పేర్కొంది. పేదరికాన్ని, అసమానతలు తగ్గించడం, పోషక విలువలున్న ఆహార వినియోగాన్ని పెంచడం, ఆహార పదార్థాలు వృథా కాకుండా చూసుకోవడం ప్రభుత్వాల ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని జీహెచ్‌ఐ పిలుపునిచ్చింది. దీనికిగాను గ్రామీణాభివృద్ధి, పౌర సర్వీసుల మెరుగుదల, సామాజిక బాధ్యతలపై దృష్టి సారించాలని ప్రభుత్వాలను కోరింది. వాణిజ్యం, మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వాలు అవలంబించాలని, ప్రయివేట్‌ కంపెనీలు ఈ నిబంధనలకు అనుగుణంగా తమ వ్యాపారాలు చేసుకునేట్టుగా ప్రభుత్వాలు వాటిని నియంత్రించాలని జీహెచ్‌ఐ సూచించింది. ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, పర్యావరణ సంఘాలు జీహెచ్‌ఐ సూచనలను ప్రభుత్వాలు అవలంబించేట్టుగా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లోని కొన్ని సిఫారసులనైనా ప్రభుత్వాలు అమలు చేసే అవకాశాలు ఉంటాయి.
                                                                                                        – కె. వేణుగోపాల్‌.