న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కోవిడ్‌ బాధిత దేశాలు ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. అంతర్జాతీయంగా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 42 వేలు దాటిపోయింది. కోవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య ఎమిదిన్నర లక్షలు దాటేసింది. ఇప్పటికే వేలాది మందిని బలితీసుకున్న మమహ్మరి ఇంకెంత తీవ్రంగా ఉపద్రవం సృష్టిస్తోందోనని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.

అగ్రరాజ్యం ఆగమాగం
అమెరికాలో కోవిడ్‌ ప్రభావానికి గురైన వారి సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సీటీ తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో 1,88,578 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 4,055 మరణాలు సంభవించాయి. దీంతో మున్ముందు అమెరికా వాసులకు కరోనా కష్టాలు రెట్టింపు కానున్నాయి. కోవిడ్‌ను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినా కరోనా కేసులు పెరుగుతుండటం భయాందోళన కలిగిస్తోంది. కాగా, అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒకేరోజు 700 కోవిడ్‌ మరణాలు సంభవించాయి.

ఇటలీలో మృత్యుహేల
ఇటలీలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. కోవిడ్‌ కాటుకు బలైనవారి సంఖ్య 12 వేలు దాటేసింది. ఇప్పటివరకు అక్కడ 12,428 మరణాలు నమోదయ్యాయి. స్పెయిన్‌లో కరోనా మహమ్మారి బారిన పడి 8,464 మంది ప్రాణాలు కోల్పోయారు. 95,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో 3,523, బ్రిటన్‌లో 1,789 మందిని కరోనా బలిగొంది.

ఐరోపాలోనే ఎక్కువ..
అంతర్జాతీయంగా 202 దేశాలు, పప్రాంతాల్లో కోవిడ్‌-19 వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ఐరోపాలో మొత్తం 4,29,362 కోవిడ్‌ కేసులు నమోదు కాగా, ఆసియాలో ఈ సంఖ్య 1,08,143గా ఉంది. యూరప్‌లో 27,740 మంది ప్రాణాలు కోల్పోగా ఆసియాలో 3878 మంది మృతి చెందారు. మధ్యప్రాచ్యంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,642 కాగా, 2999 మరణాలు నమోద య్యాయి. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దీవుల్లో 16,399 కేసులు, 417 మరణాలు సంభవించాయి. ఆఫ్రికాలో 5,343 కోవిడ్‌ కేసులు, 170 మరణాలు నమోదయ్యాయి.