ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఐదు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే అంతర్జాతీయంగా కరోనా పాజిటివ్‌ కేసులు అరకోటి దాటేశాయి.

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఐదు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే అంతర్జాతీయంగా కరోనా పాజిటివ్‌ కేసులు అరకోటి దాటేశాయి. దాదాపు 3 లక్షల 30 వేల మరణాలు సంభవించాయి. చైనాలో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్‌ 213 దేశాలు, ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పటివరకు ఏ వ్యాధి కూడా ఈవిధంగా ప్రపంచ దేశాలను వణికించలేదు. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌ను ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. టీకాను తయారుచేసే లోపల ఇంకా ఎంత విలయం సృష్టిస్తుందోనని విశ్వమానవాళి భయాందోళన చెందుతోంది. కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుప్పకులాయి. సామాన్యులు, పేదలు, వలస కార్మికుల కష్టాలకు అంతేలేదు. అగ్ర దేశాలను సైతం అతిచిన్న క్రిమి వణికిస్తోంది. మొదట్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాల్లో విజృంభించిన కరోనా తాజాగా రష్యా, బ్రెజిల్, యూకేలను గడగడలాడిస్తోంది.

తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 50,90,157 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుగా, 3,29,739 మరణాలు సంభవించాయి. కోవిడ్‌-19 బారిన పడిన వారిలో 20, 24,329 కోలుకోవడం ఊరట కలిగించే అంశం. కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అక్కడ 15,93,039 కరోనా కేసులు నమోదు కాగా, 94,941 మంది మృతి చెందారు. రష్యాలో 3,08,705 మంది కరోనా బారిన పడగా 2,972 మంది మృత్యువాత పడ్డారు. బ్రెజిల్‌లో 2,93,357 కరోనా కేసులు వెలుగు చూడగా, 18,894 మరణాలు నమోదయ్యాయి. లక్షకు మించి కరోనా కేసులు నమోదైన దేశాలు 12 ఉన్నాయి. భారత్‌లో 1,12,442 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3,438 మంది చనిపోయారు. కోవిడ్‌ నుంచి 45,422 మంది కోలుకున్నారు.