న్యూయార్క్: కరోనా వైరస్‌ వ్యాప్తి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌- బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 5,31,864 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ మృతుల సంఖ్య 24 వేలు దాటేసింది. అంతర్జాతీయంగా 24,073 మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకిన వారిలో 1,23,942 మంది ఇప్పటివరకు కోలుకున్నారు.

అమెరికా, యూరప్‌ దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అమెరికాలో 75 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,080 మంది మృతి చెందారు. ఇటలీలో 7,503 మంది ప్రాణాలు కోల్పోగా.. స్పెయిన్‌లో ఒక్కరోజే 656 మంది మృత్యువాత పడ్డారు. భారత దేశంలో 727 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం మరో ఏడుగురు కోవిడ్‌ కారణంగా మృతి చెందారు. దీంతో భారత్‌లో కోవిడ్‌ మరణాల సంఖ్య 20కి చేరింది.

కరోనా విజృంభణతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది ఇంటికే పరిమితమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌లోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి వైరస్‌ ప్రబలకుండా చూడాలని అన్ని దేశాల ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.