– సమాచార కమిషనర్ల ఖాళీల భర్తీపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
– ఎపితో సహా తొమ్మిది రాష్ట్రాలకు తాఖీదులు
-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర సమాచార కమిషనర్‌ (సిఐసి), రాష్ట్రాల సమాచార కమిషనర్ల (ఎస్‌ఐసిల) పోస్టుల భర్తీ ప్రక్రియపై నాలుగు వారాల్లో స్టేటస్‌ రిపోర్టు సమర్పించాలని నివేదిక ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తొమ్మిది రాష్ట్రాలను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మోడీ సర్కార్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సిఐసి, ఎస్‌ఐసిల నియామకాల్లో సుప్రీం కోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడం లేదని సమాచార హక్కు చట్టం కార్యకర్త అంజలీ భరద్వాజ్‌ అత్యున్నత న్యాయం స్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ సుప్రీం కోర్టు సూచించిన విధంగా కమిషనర్‌ పదవి కోసం ఎంపిక చేసిన వారి పేర్లను వెబ్‌సైట్‌లో పొందుపరచలేదని తెలిపారు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లు, సమాచార కమిషనర్లను పారదర్శకంగా నియమించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 2017లో సమాచార కమిషన్‌ ఏర్పడిందని, కానీ అప్పటి నుంచి ప్రధాన సమాచార కమిషనర్‌ లేకుండానే పని చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గుజరాత్‌, మహారాష్ట్రల్లో కూడా ప్రధాన సమాచార కమిషనర్‌ లేకుండా కమిషన్‌ పని చేస్తోందని తెలిపారు. అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాలు ఎస్‌ఐసిలను నియమించలేదని పేర్కొన్నారు. ఖాళీలు భర్తీ కాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్‌లో దాదాపు 23,500 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరిలో సుప్రీం కోర్టే సిఐసిలో నాలుగు పోస్టులు ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేయాలని ఆదేశించిందని ప్రశాంత్‌ భూషణ్‌ గుర్తు చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం సిఐసి, ఎస్‌ఐసిల నియామకంపై కేంద్ర ప్రభుత్వం, ఏపితో పాటు తొమ్మిది రాష్ట్రాలు స్టేటస్‌ రిపోర్టు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
సమాచార హక్కు చట్టం కింద కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్‌ల్లో ఖాళీలను భర్తీ చేయడానికి సుప్రీం కోర్టు ఫిబ్రవరి 15న ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ ఎకె సిక్రీ, అబ్దుల్‌ నజీర్‌ ధర్మాసనం ఆమోదించిన ముఖ్యమైన ఆదేశాలు. ”ప్రధాన సమాచార కమిషనర్‌కు ప్రధాన ఎన్నికల కమిష నర్‌ హోదానే ఉండాలి. సమాచార కమిషనర్ల నియామకానికి అధికారులతో పాటు ఇతర రంగాలకు, వృత్తులకు చెందిన ప్రముఖ వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవాలి. కమిషన్‌లో పదవులు ఖాళీ అయ్యే సమయానికి ఒకటి, రెండు నెలల ముందే నియామకాల ప్రక్రియ ప్రారంభించాలి. సిఐసి, ఎస్‌ఐసిలో ఉన్న ఖాళీలను ఆరు నెలల్లోగా భర్తీ చేయాలి. సెర్చ్‌ కమిటీ అనుసరించిన ఎంపిక ప్రమాణాలను బహిరంగ పరచాలి” అని ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే, ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు నియామకాలు చేపట్టలేదు. సమాచార కమిషనర్ల నియామకంలో అధిక శాతం అధికారు లనే ఎంపిక చేయడంతో సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Prajasakti..