మీర్జాపూర్ (యూపీ): హైదరాబాద్‌ నగరంలో పశువైద్యురాలిని పైశాచికంగా అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో దోషులకు కఠినమైన శిక్షలు పడాలని కొందరు.. ఉరితీయాలని మరికొందరు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే ఎన్ని ఘటనలు జరిగినప్పటికీ మహిళలు, యువతులు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో పదో తరగతి విద్యార్థినిపై నలుగురు యువకులు పోలీస్‌ లోగో ఉన్న కదులుతున్న కారులోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఓ విశ్రాంత పోలీసు అధికారి కుమారుడు జయప్రకాశ్‌, లవకుమార్‌ పాల్, గణేష్‌ ప్రసాద్‌, సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మహేంద్ర కుమార్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి హాలియా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవివర్‌ శుక్లా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘నిందితుల్లో ఒకరైన జయప్రకాశ్‌ మౌర్య ఓ విశ్రాంత పోలీసు అధికారి బ్రిజ్‌లాల్‌ మౌర్య కుమారుడు. జయప్రకాశ్‌ సోదరి పెళ్లైన తర్వాత హాలియా ప్రాంతంలోని ఓ గ్రామంలో నివాసముంటోంది. సోదరిని చూసేందుకు జయప్రకాశ్‌ ఈ మధ్య తరచూ గ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో బాధితురాలితో పరిచయం ఏర్పడింది. సోమవారం గ్రామ శివారులో కలవాల్సిందిగా బాధితురాలికి జయప్రకాశ్‌ సమాచారం అందించాడు. అప్పటికే అతడు తన ముగ్గురు స్నేహితులతో అక్కడ కారులో వేచిఉన్నాడు. అక్కడికి చేరుకున్న బాధితురాలిని బలవంతంగా కారులోకి ఎక్కించుకొని కదులుతున్న కారులోనే నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది గమనించారు. కారులో నుంచి బాధితురాలి అరుపులు వినిపించడంతో కారును స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు’ అని హాలియా ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వీరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. బాధితురాలితో పాటు నలుగురు నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు మీర్జాపూర్ ఎస్పీ ధరమ్ వీర్ తెలిపారు.

Courtesy Eenadu…