Image result for అమ్మాయా.. వద్దులే!"దేశవ్యాప్తంగా తగ్గుతున్న ఆడపిల్లల జననాలు

లింగ నిష్పత్తిలో పంజాబ్‌, గుజరాత్‌లకు అథమ స్థానం
ఆదర్శంగా అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం
జనాభా లెక్కల విభాగం తాజా నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌ జిల్లాలో 97,962 మందికి 90,495 మందే..
తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శంగా జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా
ఇక్కడ మాత్రమే ఆడ శిశువుల జననాలు ఎక్కువ

ఆ ఏడాది దేశం మొత్తంమీద పుట్టిన వారిలో అబ్బాయిల కన్నా, అమ్మాయిలు సుమారు 11.21 లక్షల మంది తక్కువగా ఉన్నారు.
అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరొందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోనే లింగ నిష్పత్తి దారుణంగా తగ్గుతోంది.
రాష్ట్రాల వారీగా లింగ నిష్పత్తిలో తెలంగాణ 20, ఏపీ 11వ స్థానంలో ఉన్నాయి.

మహిళలను పూజ్య భావంతో చూసే పురిటిగడ్డగా భారత దేశానికి పేరు. అలాంటి గడ్డ ఇప్పుడు ఆడబిడ్డలను వద్దనుకుంటోందా? అబ్బాయి పుడితే చాల్లే అని సరిపెట్టుకుంటోందా? దేశవ్యాప్తంగా నమోదైన జననాల గణాంకాలు ఆ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయి. కారణం ఏదైనా.. కారకులెవరైనా దేశవ్యాప్తంగా ఆడపిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. మరీ ప్రమాదకర అంశం ఏమిటంటే విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్లు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్యలో తరుగుదల నమోదవడం. తాజాగా విడుదలైన జనాభా లెక్కల వివరాలు ఈ చేదు నిజాన్ని బయటపెట్టాయి.

దేశంలో అమ్మాయిల జననాలు నానాటికీ తగ్గుతున్నాయి. ఒక్క అరుణాచల్‌ప్రదేశ్‌ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు, ఎంత మంది అమ్మాయిలు పుట్టారనే సంఖ్యను ‘లింగ నిష్పత్తి’గా పిలుస్తారు. దేశ వ్యాప్తంగా 2017 జనవరి ఒకటి నుంచి డిసెంబరు 31 వరకూ నమోదైన జననాల ప్రకారం మొదటి స్థానంలో ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లో లింగ నిష్పత్తి 1047 ఉండగా..రెండో స్థానంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 78 తగ్గి 968గా నమోదైంది. జనాభా లెక్కల విభాగం తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌  11
తెలంగాణ 20
ఆ ఏడాది దేశం మొత్తమ్మీద పుట్టిన వారిలో అబ్బాయిల కన్నా, అమ్మాయిలు సుమారు 11.21 లక్షల మంది తక్కువగా ఉన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోనే లింగ నిష్పత్తి దారుణంగా తగ్గుతోంది. రాష్ట్రాల వారీగా లింగ నిష్పత్తిలో ఏపీ 11, తెలంగాణ 20వ స్థానంలో ఉన్నాయి. జాబితాలో ఆఖరున ఉన్న పంజాబ్‌ రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది బాలురకు కేవలం 890 మంది అమ్మాయిలే పుట్టగా, చివర నుంచి రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 898 మందే ఉన్నారు. దేశంలో లింగ నిష్పత్తి అతి తక్కువగా..అంటే 900 కంటే దిగువన ఉన్నది ఈ రెండు రాష్ట్రాలే కావడం గమనార్హం.

అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో వివక్ష ఎక్కువా?
దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉండగా.. అభివృద్ధి చెందిన జిల్లాల్లో మాత్రం తక్కువగా ఉంది. ఉదాహరణకు అభివృద్ధి చెందిన, ఉద్యోగులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పేరొందిన పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌ జిల్లాలో 24,906 మంది బాలురుకు, బాలికలు 19,158 మందే జన్మించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ జిల్లాలో 97,962కి, 90,495 మందే అమ్మాయిలున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మారుమూలన ఉన్న జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో 4,962 మంది బాలురుకు, 4,994 మంది బాలికలున్నారు. ఇలా ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా జిల్లాలు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటీ లేదు. దేశ వ్యాప్తంగా చూసినా ఇలాంటివి అరుదుగానే ఉన్నాయి.

వద్దనుకుంటున్నారా?

 అమ్మాయా.. వద్దులే!

ఆడ పిల్లల జననాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తక్కువగా ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నారు. ‘‘చాలా మంది ఉద్యోగులు, విద్యావంతులు మొదట అబ్బాయి పుట్టిన పక్షంలో రెండో బిడ్డను కనకుండా ఆపేస్తున్నారు. ఉన్నత కుటుంబాలు, బాగా విద్యావంతులైన కుటుంబాల్లో ఆలస్యంగా పెళ్లిళ్లు కావడం, ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితం అవుతుండటం కూడా లింగ నిష్పత్తి తగ్గేందుకు కారణమవుతోంది’’ అని వాళ్లు విశ్లేషిస్తున్నారు.

విదేశాల్లోనూ తక్కువే…

 అమ్మాయా.. వద్దులే!

విదేశాల్లో నివసిస్తున్న భారతీయ కుటుంబాల్లో జననాలనూ భారత రాయబార కార్యాలయాల్లో నమోదు చేయిస్తున్నారు. ఆ ప్రకారం 2017లో 110 దేశాల్లోని భారతీయ కుటుంబాల్లో 12,479 మంది జన్మించారు. అక్కడా బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య 155 తక్కువగా ఉంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో 70 మంది తక్కువగా ఉన్నారు. దక్షిణాఫ్రికా, సూడాన్‌, పోలండ్‌, సౌదీ అరేబియా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లోని భారతీయ కుటుంబాల్లో బాలికలు ఎక్కువగా పుట్టారు.

ఆందోళన కల్గించే అంశం.. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి

దేశంలో లింగ నిష్పత్తి బాగా తగ్గుతుండటం ఆందోళన కలిగించే అంశమని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘దేశంలో పంజాబ్‌, హరియాణా వంటి ఉత్తరాది రాష్ట్రాల వారు వధువులు దొరక్క దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్నారు. ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాల వారు, అమ్మాయిల కోసం ఉత్తర కోస్తా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వర్గాలు యువతులు దొరకని పరిస్థితుల్లో కులాంతర వివాహానికీ సిద్ధమవుతున్నాయి. దేశంలో లింగ నిష్పత్తి పడిపోవడం వల్ల కలిగే నష్టాలకు ఇవి ఉదాహరణలే’’ అని ఆయన ‘ఈనాడు’కు వివరించారు.

 అమ్మాయా.. వద్దులే!

 అమ్మాయా.. వద్దులే!