పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశంపై శనివారం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో కొంత సేపు వాగ్వావాదాలు జరిగాయి. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని మజ్లిస్‌ పార్టీ పట్టుబట్టింది. అయితే, ముందు వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌ సభ్యులు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌.. లంచ్‌ తర్వాత ఆమోదించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. సీఏఏకు వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడంలో దేశంలోనే జీహెచ్‌ఎంసీ మొదటి నగర పాలక సంస్థగా నిలిచింది. జీహెచ్‌ఎంసీ 2020-21 బడ్జెట్‌ను ఆమోదించేందుకుగాను ప్రత్యేక సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన తర్వాత మాజీ మేయర్‌, జీహెచ్‌ఎంసీ ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ మాజిద్‌ హుస్సేన్‌ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ఇప్పటికే సీఏఏను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ తన వైఖరిని స్పష్టం చేశారన్నారు. హైదరాబాద్‌ నగరంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లతో పాటు అనేక మతాల వారి కలయికతో అన్యోన్యంగా జీవిస్తున్నారని.. అందుకు మన నగర లౌకిక విలువలు, ప్రజల ఐక్యతను చాటుతూ తీర్మానం చేయాలని ఆయనతో పాటు ఎంఐఎం సభ్యులు పట్టుబట్టారు. అయితే, సీఏఏ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారమని, మహానగర పాలక సంస్థకు అవసరం లేదని మేయర్‌ బొంతు రామ్మోహన్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎమ్మెస్‌ ప్రభాకర్‌ వాదించారు. ఇదే సందర్భంలో బీజేపీ కార్పొరేటర్లు శంకర్‌యాదవ్‌, కావ్య, పద్మ మాట్లాడుతూ.. రాజకీయం చేసేందుకే ఎంఐఎం పార్టీ ప్రతినిధులు సీఏఏ విషయం లేవనెత్తుతున్నారని విమర్శించారు. దీంతో కాసేపు కౌన్సిల్‌ సమావేశంలో గందరగోళం, నెలకొంది. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్లు తమ డివిజన్‌ సమస్యల ప్రస్తావనతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు.

మధ్యాహ్న భోజన విరామం అనంతరం డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ మళ్లీ సీఏఏ అంశాన్ని లేవనెత్తారు. గ్రేటర్‌లో అనేక మతాలకు చెందిన ప్రజలు మత సహనం పాటిస్తున్నారన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు జగదీశ్వర్‌గౌడ్‌, స్వర్ణలత, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ కూడా డిప్యూటీ మేయర్‌ ప్రతిపాదనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సెక్యులరిజానికి నిదర్శనంగా నిలుస్తున్నారనీ, త్వరలో అసెంబ్లీ సమావేశంలోనూ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ కౌన్సిల్‌లో కూడా సీఏఏకు వ్యతిరేకంగా సభ్యులు తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు. దీంతో సభ్యులంతా ఏకగ్రీవంగా హర్షం వ్యక్తం చేయడంతో తీర్మానాన్ని ఆమోదించినట్టు మేయర్‌ ప్రకటించారు.

Courtesy Nava Telangana