జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జూన్ 4న మిన్నియాపోలిస్‌లో జరిగిన ‘మెమోరియల్ సర్వీస్’లో నల్లజాతి నాయకుడు, మానవ హక్కుల ఉద్యమకారుడు, బాప్టిస్ట్ మినిస్టర్ అయిన.. ఆల్ షార్ప్ టన్ (ఆల్ఫ్రెడ్ చార్లెస్ షార్ప్ టన్ జూనియర్) ఈ ‘కీర్తి ప్రసంగం’ చేశాడు.

నేపథ్యం:
25 మే, 2020 రోజున …. అమెరికాలోని మిన్నియాపోలిస్ అనే పట్టణంలో… ఆఫ్రికన్-అమెరికన్, జార్జ్ పెర్రీ ఫ్లాయిడ్ జూనియర్ అనే నల్లజాతి వ్యక్తి… ఒక శ్వేతజాతీయుడైన పోలీస్ ఆఫీసర్ చేత చంపబడ్డాడు.
జార్జ్ ఫ్లాయిడ్ చేసిన నేరం…?
జార్జ్ ఫ్లాయిడ్ ఒక 20 డాలర్ల నోటును చెల్లించి ఒక సిగరెట్ ప్యాకెట్ కొనుక్కున్నాడు. అతను బయటికి వెళ్ళిన తర్వాత ఆ నోటు నకిలీది అయిఉండవచ్చని కొట్టువారికి అనుమానం వచ్చింది. అప్పటికే అతను రోడ్డు దాటి వెళ్ళాడు. కొట్టువారు వెళ్లి, అతణ్ణి నిలదీస్తే, నోటు వెనక్కి తీసుకోవడానికి అతను ఒప్పుకోలేదు. ఈలోగా పోలీసులకు సమాచారం అందింది.
పోలీసులు వచ్చారు. అతనికి బేడీలు వేశారు. కారులో ఎక్కడానికి నిరాకరించాడని, అందులో Derek Chauvin అనే ఒక పోలీస్ ఆఫీసర్ జార్జ్ మెడ మీద కాలు పెట్టి అదిమాడు. మిగతా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు అతనికి సహకరించారు. “ఊపిరి ఆడడం లేదు, ఆఫీసర్.” అని బ్రతిమిలాడినా జార్జ్ ను ఆ పోలీసులు విముక్తి చేయలేదు.
ఆ సంఘటనను, ఎంతోమంది ప్రత్యక్ష సాక్షులు వీడియోలు తీశారు. జార్జ్ మెడ మీద 8 నిముషాల 46 సెకండ్ల పాటు మోకాలు పెట్టి అదమడం వల్ల అతను చనిపోయాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
4 జూన్ 2020 రోజున మిన్నియాపోలిస్‌లో జరిగిన ‘మెమోరియల్ సర్వీస్’లో…. నల్లజాతి నాయకుడు, మానవ హక్కుల ఉద్యమకారుడు, బాప్టిస్ట్ మినిస్టర్ అయిన… ఆల్ షార్ప్ టన్ (ఆల్ఫ్రెడ్ చార్లెస్ షార్ప్ టన్ జూనియర్) ఈ ‘కీర్తి ప్రసంగం’ (eulogy) చేశాడు.
(ప్రసంగాన్ని కొంతవరకు సంక్షిప్తం చేయడం జరిగింది.)

ఆల్ఫ్రెడ్ చార్లెస్ షార్ప్ టన్ ప్రసంగ పాఠం..
మనమంతా అంత్యక్రియలకు హాజరు అవుతున్నట్టు ఇక్కడ కూర్చోవాలని నేను కోరుకోవడం లేదు. చనిపోయిన వారిలో జార్జ్ ఉండి ఉండకూడదు. అతను సాధారణ అనారోగ్య సమస్యలతో చనిపోలేదు. అమెరికన్ క్రిమినల్ న్యాయం వైఫల్యం వల్ల అతను చనిపోయాడు. ఒకవేళ నీవు నీలిరంగు జీన్స్ వేసుకున్నా లేదా నీలిరంగు యూనిఫాం వేసుకున్నా … నేరం చేస్తే నీవు దానికి తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఈ దేశం నేర్పించ పోవడంవల్ల అతను చనిపోయాడు. కాబట్టి, ఇవి సాధారణ అంత్యక్రియలు కావు. ఇవి సాధారణ పరిస్థితులు కూడా కావు. కానీ, ఇదంతా మామూలే. దానిని ఎలా నిర్వహించాలో మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉన్నది.

పబ్లిసిటీ కోసం నేను ఏదైనా చేస్తాను అని నా విమర్శకులు అంటూ ఉంటారు. అవును, రహస్యాలను అట్లాగే ఉంచాలని నన్ను ఎవరూ అడగరు.

ఎవరు ప్రచారం చేయలేని విషయాలను ప్రజలు నాకు అప్పగిస్తారు. నేను ప్రచారకుణ్ణి. నేను దానికి క్షమాపణలు చెప్పను. విషయాలను దాచిపెట్టినవాళ్ళు తప్పించుకుని తిరుగుతారు. బట్టలు ఆరవేయడానికి మీరు వాటిని అవెన్లో పెడతారు. అది నాకు హాస్యంగా ఉంటుంది. నేను థర్డ్ వ(ర)ల్డ్ లో పెరగలేదు. నేను థర్డ్ వార్డ్ లో పెరిగాను. నేను బ్రౌన్స్ విల్లీలో పెరిగాను. మా ఇంట్లో బొద్దింకలు ఉండేవి. నాకు తెలుసు… ఎక్కడ ఉన్నా కేరిన్ హార్ట్ లాంటి హాలీవుడ్ సంపన్నులకు బొద్దింకలు అంటే ఏమిటో తెలియదు. కానీ మాకు బొద్దింకలు ఉండేవి లుడాక్రిస్. నేను ఒక విషయం కనుక్కున్నాను. లైట్ ఆర్పివేస్తే బొద్దింకలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి, విందు చేసుకుంటాయి. కాబట్టి, కాసేపటి తర్వాత లైట్ వేస్తే వాటిని తరిమి పట్టుకోవచ్చు. ఆ విధంగా, నా జీవితం అంతా దేశం నిండా ఉన్న బొద్దింకలను పట్టుకోవడానికే వెచ్చించాను.

జార్జ్ మెడ మీద మోకాళ్ళతో అదిమి పట్టినప్పుడు… “నాకు ఊపిరి అందడం లేదు.” అని అతను అన్నాడని తెలిసినప్పుడు నాకు ఎరిక్ గార్డెనర్ గుర్తుకు వచ్చాడు. అతను అట్లాగే ఊపిరి ఆడక చనిపోయాడు. అతని అంత్యక్రియలకు కూడా నేను ‘కీర్తిగానం’ చేశాను. ఎరిక్ వాళ్ళ అమ్మ కూడా ఇవాళ మనతో ఉన్నారు.

జార్జ్ ఫ్లాయిడ్ కథ నల్లవాళ్ళ కథ. 401 సంవత్సరాలుగా, మేమేమిటో మేము నిరూపించుకోలేకపోయాము. మేము మా జీవితపు కలలను సాకారం చేసుకోలేకపోతున్నాము. కారణం… మీరు… మా మెడల మీద మీ మోకాలును అదిమిపెడుతున్నారు. మీరు మమ్మల్ని వేసిన అరకొర నిధులు ఉన్న స్కూల్ల కన్నా మేము తెలివైన వాళ్ళం. ఎలాంటి అవరోధాలు లేకుండా మేము కార్పొరేషన్లను నడిపించగలము. కానీ మా మెడల మీద మీ మోకాలును అదిమిపెట్టారు. మాకు సృజనాత్మక నైపుణ్యాలు ఉన్నాయి. వేరే వాళ్ళు చేసేది ఏదైనా మేము చేయగలం. కానీ, మా మెడల మీద నుండి మీ మోకాలును తొలగించుకోలేని ఆశక్తులుగా ఉన్నాము. మొన్న ఫ్లాయిడ్ పట్ల జరిగింది.. అమెరికన్ జీవితంలో… విద్యా రంగంలోనో, వైద్య రంగంలోనో లేదా మరోచోటనో… ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంది. జార్జ్ పేరిట మనమంతా లేచి నిలబడి, “మా మెడ మీద నుండి మీ మోకాళ్ళను తీసివేయండి” అని చెప్పాలి.

మీరు ఎవరైనా సరే, అదీ సమస్య. మాకు ఏదో సంక్లిష్టత ఉన్నది. అది మేమే కావచ్చు. విజయం సాధించిన నల్లవారి మెడల మీద కూడా మీ మోకాలును అదిమి ఉంచారు. మైఖేల్ జోర్డాన్ అన్ని ఛాంపియన్షిప్స్ గెలుచుకున్నాడు. కానీ మీరు అతనికి ఎన్నో అవరోధాలు కల్పిస్తున్నారు. ఎందుకంటే, అతని మెడ మీద మోకాలు అడ్డు పెట్టాలి కాబట్టి. ఆగండి! ఓఫ్రా విన్ఫ్రీ అనే నల్లజాతి ఆవిడను టీవీలో చూడాలని ఆడవాళ్లు ఇంటికి పరుగులు పెడతారు. తల్లిదండ్రుల్లో ఒక్కరే పెంచిన ఒక మనిషి… తనకు తానే కష్టపడి చదివి అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. మీరు అతని జన్మపత్రపు రుజువులు అడుగుతారు. ఎందుకంటే మా మెడల మీద నుండి మీ మోకాళ్ళను మీరు తీసి వేయలేరు కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా మేము ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నామంటే ‘మాకు ఊపిరి ఆడడం లేదు’ కాబట్టి. మా ఊపిరి తిత్తుల్లో ఎలాంటి సమస్య లేదు. కానీ మా మెడల మీద నుండి మీరు మీ మోకాళ్ళను తీయలేదు. మాకు ఎలాంటి ఉపకారాలు అవసరం లేదు. కేవలం మా మీద నుండి లేవండి. మేము ఏమి కావాలో అది అవుతాము.

ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. కొంతమంది లూటీలు, హింసాత్మక చర్యలు చేశారు. కానీ మేము ఎవరమూ విధ్వంసాన్ని సహించము. మీరు నిజాన్ని గుర్తించాలి. శాంతి కావాలని అడిగేవారికి … నిశ్శబ్దం కావాలని అడిగేవారికి తేడా ఉన్నది. మీలో కొంత మందికి శాంతి కావాలని లేదు. మీరు నిశ్శబ్దాన్ని కోరుకుంటున్నారు. మీరు కేవలం మమ్మల్ని మూసివేసి, మేము నిశ్శబ్దంగా బాధపడాలని కోరుకుంటున్నారు. నిరసనకారుల్లో ఎక్కువమంది అద్దాలను పగలగొట్టడం లేదు. వారు కేవలం అవరోధపు గోడలను పగలగొడుతున్నారు. వారు ఏమీ దొంగిలించాలి అనే ప్రయత్నం చేయడంలేదు. మా దగ్గర నుండి మీరు దొంగిలించిన న్యాయాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చట్టాన్ని బద్దలుకొట్టిన వారు …. ఏ చట్టాన్ని బద్దలుకొట్టారో దానికి అనుగుణంగా శిక్ష అనుభవించాలి. అలాగే ఈ అంత్యక్రియలకు కారణమైన నలుగురు పోలీసులను కూడా శిక్షించాలి.

మిస్టర్ గవర్నర్, హింసను ఖండించడంలో మాకు సమస్య లేదు. కానీ క్రిమినల్ న్యాయవ్యవస్థలో కొంతమంది సాక్ష్యాధారాలను చూడడానికి, జరిగినదానికి కారణం కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అదంతా తేల్చడానికి, మీరు చేయాల్సింది చేయడానికి మీకు సమయం పడుతుంది.

మేము క్రిమినల్ న్యాయం దగ్గర మొదలు పెట్టాము. గత కొన్ని దశాబ్దాలుగా నేను ఎన్నో ఉపన్యాసాలు, ‘కీర్తిగానాలు’ చేశాను. ఎన్నో నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించాను. మేము చేయవలసినది చేసాము. మూడవ మార్టిన్ (మార్టిన్ లూథర్ కింగ్ కుమారుడు) ఇక్కడే ఉన్నాడు. అతను, నేను… వాళ్ళ నాన్న లాగా పోరాటాలు చేస్తూ జైలుకు వెళ్లాము.

కానీ, ఈ రోజు పరిస్థితి మునుపటికన్నా ఆశాజనకంగా ఉన్నది. ఎందువల్ల? చాలా ప్రదర్శనలో ఎక్కువగా తెల్లజాతి యువకులు నల్లవారి కన్నా ఎక్కువగా పాల్గొన్నారు. ఇది ఒక భిన్నమైన పరిస్థితి, భిన్నమైన సమయం.

జార్జ్ ఫ్లాయిడ్ కోసం జర్మనీలో చేసిన నిరసన ప్రదర్శనలు చూస్తే ఇది ఒక భిన్నమైన పరిస్థితి, ఒక విభిన్నమైన సమయం అని అనిపిస్తున్నది. లండన్లోని పార్లమెంటు ముందు నిరసనకారులు …. “ఇది ఒక భిన్నమైన పరిస్థితి. ఇది ఒక భిన్నమైన సమయం” అని అన్నారు.
నేను ఇప్పుడు అమెరికాకు చెబుతున్నాను క్రిమినల్ న్యాయవ్యవస్థకు మీరు జవాబుదారీగా ఉండవలసిన సమయం వచ్చింది.

మీ దేశాన్ని వాషింగ్టన్ లో కూర్చుని సైనికీకరణ చేయాలని మాట్లాడుతుంటారు. ఇదివరకే సరిపడినంత అరాచకత్వానికి బలైపోయినవారిపై అరుస్తూ, వారిని భయపెట్టగలమని ఆలోచిస్తుంటారు. కానీ, అవన్నీ కేవలం మీరు టీవీలో మాత్రమే మాట్లాడగలరని నేను హెచ్చరిస్తున్నాను. మీరు జవాబుదారీగా లేనందువల్ల మీకు సమయం చెల్లిపోయింది. ఉత్త మాటలకు, ఉత్తుత్తి వాగ్దానాలకు కాలం చెల్లింది. న్యాయాన్ని నాలుగు పాదాల మీద నడవకుండా, కల్లబొల్లి కబుర్లతో చేస్తున్న కాలయాపనకు కాలం చెల్లింది. ఈసారి మేము ఊరుకునేది లేదు. మొత్తం న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేసే అంతవరకు మేము పోరాడుతూనే ఉంటాం.

ఈరోజు మూడవ మార్టిన్ మనతో ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆగస్టు 28న ….. వాషింగ్టన్ నిరసనలకు 57 వ వార్షికోత్సవం ఉన్నది. మనం ఆ రోజు అక్కడికి వెళుతున్నాం మార్టిన్. లింకన్ మెమోరియల్ నీడలో మీ నాన్న “నాకు ఒక కల ఉన్నది” అని అన్న రోజు. ఆ రోజును మనం పునరుజ్జీవితం చేద్దాం! ఆ కల సాకారం కోసం మళ్లీ ఒకసారి మనం పునరుద్ఘాటన చేద్దాం. ఎందుకంటే, ఒక శకంలో మనం బానిసత్వానికి వ్యతిరేకంగా… మరొక శకంలో జాతివివక్షకు వ్యతిరేకంగా…. ఇంకో శకంలో ఓటింగ్ హక్కు కోసం మనం పోరాటం చేశాము. ఈ శకంలో…. పోలీసు విధానాల పట్ల, క్రిమినల్ న్యాయం పట్ల మనం పోరాటం చేయాలి. తెల్లవాళ్ళు, నల్లవాళ్లు, లాటినోలు, అరబ్‌లు…. లింకన్ నీడలో నిలబడి…. “ఇదంతా మీరు ఆపి వేయాల్సిన సమయం వచ్చింది” అని నినాదం చేద్దాం.

మనం అమెరికాను గొప్పదిగా చేద్దాం అని మాట్లాడుకుంటాం. ఎవరికి గొప్ప? ఎప్పుడు గొప్ప? మొట్టమొదటిసారిగా అమెరికాలో ప్రతి ఒక్కరికి గొప్ప దానిగా చేయబోతున్నాము.

నల్లవారికి అమెరికా ఏనాడు గొప్పగా లేదు. లాటినోస్ కు ఏనాడు లేదు. వేరే వారికి కూడా ఎన్నడూ లేదు. ఆడవాళ్లకూ లేదు.ఆడవాళ్లారా! మీరంతా ఓటు హక్కు కోసం కూడా పోరాటం చేయాల్సి వచ్చింది.

ఇక చివరగా విషయానికి వద్దాం. నేను అటార్నీ, క్రంప్ తో మాట్లాడినప్పుడు జార్జ్ సోదరులతో తాను మాట్లాడాను అని చెప్పాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడండి అని నేను అడిగితే, “ఆవిడ చనిపోయింది.” అని చెప్పాడు. “అవునా, కానీ జార్జ్ అమ్మ కోసం అడిగాడు కదా?” అని నేను అన్నాను. కొన్నిసార్లు మనకు మన పరిస్థితులకు మధ్య అమ్మ ఉంటుంది. ప్రమాదం వచ్చినప్పుడు అమ్మే మనల్ని కాపాడుతుంది అని అనుకుంటాము. మన ఆకలి తెలిసిన వ్యక్తి ప్రపంచంలో తల్లి ఒక్కతే. తల్లి కోసం జార్జ్ ఎందుకు అడిగాడో నాకు తెలుసు.

బహుశా, వాళ్ళమ్మ…. అతన్ని….“వచ్చేసెయ్, జార్జ్! ఇక్కడ నీకు ఏ కష్టాలు ఉండవు. ఇక్కడ నీ మీద పోలీసులు మోకాళ్ళు పెట్టరు. ప్రాసిక్యూటర్ నీ కాళ్ళు పట్టి లాగరు.” అంటూ చేతులు చాపి పిలుస్తూ ఉండవచ్చు.

ఇంటికి వెళ్ళు, జార్జ్! విశ్రాంతి తీసుకో, జార్జ్! ప్రపంచాన్ని మార్చేశావు, జార్జ్! మేము ముందుకు నడుస్తాం, జార్జ్! మేము పోరాడుతాం, జార్జ్! మేము ముందుకే వెళతాము, జార్జ్! ఇక సమయం లేదు. ఇక సమయం లేదు. ఇక సమయం లేదు.

మనమందరమూ…. 8 నిముషాల 46 సెకన్లు మౌనం పాటిద్దాం.

అమెరికాలో… అడపాదడపా నల్లవారిపై పోలీస్ జులుం కొనసాగుతూనే ఉన్నది. అయితే, ఈసారి సంఘటనలో సాక్ష్యాధారాలు వీడియోల రూపంలో బలంగా ఉన్నాయి.
నేరం ఏదైనా… “నెక్ రిస్ట్రేయింట్” అనే పద్ధతిలో… జార్జ్ ఫ్లాయిడ్ ను అతి పాశవికంగా పోలీసులే హత్యచేశారు అని పక్కా ఆధారాలు ఉండడంతో… అమెరికాలో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. లూటీలు, హింసాకాండ ప్రజ్వరిల్లింది.
ఎంతోమంది ప్రపంచ నాయకులు ఈ సంఘటన పట్ల తమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఇతర చోట్లలో కూడా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు.

వక్త: ఆల్ఫ్రెడ్ చార్లెస్ షార్ప్ టన్ జూనియర్
సంక్షిప్త స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి
మూలం: ఇంగ్లీష్