ఫ్రాంక్‌ఫర్ట్‌: కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఐరోపా ఖండంలో ఇటలీ, స్పెయిన్‌ తర్వాత జర్మనీ అత్యధికంగా కోవిడ్‌ ప్రభావానికి గురైంది. ఇప్పటివరకు జర్మనీలో 62,435 మంది కరోనా బారిన పడ్డారు. 541 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కల్లోలానికి ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో ప్రజలతో పాటు పాలకులకు పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొవాలోనన్న భయాందోళనతో జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి థామస్‌ షాఫర్‌(54) బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఈ విషయాన్ని హెస్సీ రాష్ట్ర మినిస్టర్‌ ప్రెసిడెంట్‌ వోల్కర్‌ బౌఫియర్‌ వెల్లడించారు. శనివారం రైలు పట్టాలపై థామస్‌ షాపర్‌ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ధ్రువీకరించారు. జర్మనీ వాణిజ్య రాజధాని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరం హెస్సీ రాష్ట్రంలోనే ఉంది. దేశంలో ప్రముఖ బ్యాంకుల కేంద్ర స్థానం ఈ నగరమే. కరోనా వల్ల హెస్సీలో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. షాఫర్‌ పదేళ్లుగా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. కరోనా ఉపద్రవంతో భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత భయానకంగా ఉండబోతోందని భావించి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

థామస్‌ షాఫర్‌ ఆత్మహత్యపై వోల్కర్‌ బౌఫియర్‌ స్పందిస్తూ.. ‘థామస్‌ చనిపోయారంటే మేం నమ్మేలకపోతున్నాం. మేం షాక్‌లో ఉన్నాం. హెస్సీ రాష్ట్రానికి పదేళ్లుగా షాపర్‌ ఆర్థికమంత్రిగా ఉన్నారు. కరోనా కల్లోలం నేపథ్యంలో అతలాకుతలమైన ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి , బాధితులను ఆదుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇలాంటి కిష్ట పరిస్థితుల్లో ఆయన అవసరం మాకు ఎంతో ఉంది’ అని పేర్కొన్నారు.