అగ్రరాజ్యం అమెరికా జాత్యహంకార వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతోంది. నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను బహిరంగంగా అంతం చేసిన శ్వేతజాతీయ దురహంకార మదం అణచివేసేందుకు అమెరికా అంతటా ఉద్యమకారులు కదం తొక్కుతున్నారు. శతాబ్దాల తరబడి కొనసాగుతున్న వర్ణవివక్షను రూపుమాపడానికి ఇంకా ఎన్నేళ్లు ఎదురుచూడాలని నల్లజాతీయులు గళమెత్తుతున్నారు.

‘నాకు వూపిరి ఆడటం లేదు’ అంటూ జార్జి ఫ్లాయిడ్‌ పలికిన చిట్టచివరి మాటను పునాదిగా చేసుకుని పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నారు. శ్వేతసౌధానికి బీటలుపడేలా ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. ఉవ్వెత్తున్న ఎగిసిన ఉద్యమంతో అగ్రరాజ్యధినేత కలుగులో దాక్కోవలసి పరిస్ధితి వచ్చిందంటే పోరాటం ఏ స్థాయిలో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. మృత్యుపాశం విసురుతున్న కరోనా మహమ్మారిని సైతం లెక్కచేయకుండా ఎక్కడ చూసినా వేలాది మంది అమెరికన్లు రోడ్ల మీదకు వచ్చి జాత్యహంకారానికి వ్యతిరేకంగా ముక్త కంఠంతో గళమెత్తున్నారు. బానిసత్వానికి బొంద పెట్టాలని బలంగా కొట్లాడుతున్నారు. ‘ఎదురు తిరిగితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్ళు తప్ప’ అన్నట్టుగా తెగించి జాత్యంహకారులకు ఎదురునిలుస్తున్నారు. నల్లజాతీయులకు సంఘీభావంగా శ్వేతజాతీయులు చెప్పుకోదగ్గ సంఖ్యలో పోరాటడం వర్తమానంలో స్వాగతించతగిన పరిణామం. ఈ ఉద్యమ జ్వాలలు నెమ్మదిగా విశ్వవ్యాప్తం అవుతుండటం జగమంతా విప్పారిన కళ్లతో వీక్షిస్తోంది.

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశల్లో తాము ఉన్నామని భుజకీర్తులు తొడుక్కున్న అమెరికాలో నల్లజాతీయుల జీవించే హక్కు కోసం ఇప్పటికీ పోరాడవలసిన ఆగత్యం ఏర్పడిందంటే అర్థం ఏమిటి? నీగ్రోలను రాక్షస హింసలకు గురిచేసినా జాత్యహంకార వారసత్వం కొనసాగుతుందనడానికి జార్జి ఫ్లాయిడ్‌ హత్య తాజా రుజువు. ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న అమెరికా దీనికి ఏమి సమాధానం చెబుతుంది? మనుషుల మధ్య సమానత్వం కాగితాలకే పరిమితమైందా? నల్లజాతీయులను సాటి మనుషులుగా గుర్తించలేనంత కాలం జార్జి ఫ్లాయిడ్‌ లాంటి అమాయకులకు ఊపిరి ఆడే పరిస్థితి ఉండదు. జాతి దురహంకారం, అణిచివేత అంతం కానంతవరకు అగ్రరాజ్యంలో ఉద్యమాలు పుడుతూనే ఉంటాయి!