మినియాపొలిస్‌ లో ఫ్లాయిడ్‌ మరణంపై అమెరికా నల్లజాతి ఆగ్రహం

మినియాపొలిస్‌: అమెరికాలోని మినెసొటా రాష్ట్రం మినియాపొలిస్‌, సెయింట్‌పాల్‌ జంట నగరాల్లో ఉద్రిక్తతలు చల్లారలేదు. జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతి యువకుడిని పోలీసు కాలితో తొక్కి చంపిన ఘటనపై ఆగ్రహించిన ప్రజలు గురువారం వేల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ నినదించారు. ఊరేగింపు దారిలో యువకులు నగరమంతటా లూటీలకు పాల్పడ్డారు. కొన్నిచోట్ల తమదారికి అడ్డంగా నిలబడ్డ పోలీసులతో తలపడ్డారు. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కే‌ నిప్పుపెట్టారు. ఈ సంఘటనను లైవ్‌లో ప్రసారం చేస్తున్న సీఎన్‌ఎన్‌ కెమెరామన్లు, రిపోర్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. నల్లజాతి యువకుడు ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన తెల్లజాతి పోలీసు అధికారి డెరెక్‌ చావిన్‌(44) మొదటి నుంచీ వివాదాస్పదుడే. తన 19 ఏళ్ల కెరీర్‌లో ఇద్దరిపై అవసరం లేకున్నా కాల్పులు జరిపాడు.

తాజా ఘటన నేపథ్యంలో అతడిని అరెస్టు చేశారు. కాగా, కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌ విల్లీ నగరంలోనూ నల్లజాతి ప్రజలు ప్రదర్శనలు చేశారు. వారిపై పోలీసులు రబ్బరు బుల్లెట్లతో జరిపిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఏడాది మార్చిలో బ్రెయోనా టేలర్‌(26) అనే నల్లజాతి మహిళ ఇంట్లో మాదక ద్రవ్యాల అనుమానంతో పోలీసులు చొరబడి కాల్పులు జరపగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఇంతాచేసి, ఆమె ఇంట్లో ఎలాంటి మాదక ద్రవ్యాలు దొరకలేదు. మినియాపొలిస్‌ ప్రజల స్ఫూర్తితో లూయీస్‌విల్లీ నల్లజాతి ప్రజలు కూడా బ్రెయోనాకు న్యాయం జరగాలంటూ గురువారం వీధులకు ఎక్కారు.

Courtesy AndhraJyothy