‘యురేనియం’పై ముందుకే!

  • దేవరకొండకు చేరుకున్న భూగర్భ నిపుణులు..
  • నేడు నల్లమలకు వెళ్లనున్న 30 మంది జియాలజిస్టులు
  • తవ్వకాలకు బోరు పాయింట్ల గుర్తింపు
  • నల్లమలలో సోమవారం బంద్‌ విజయవంతం
  • ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దు: కోదండరాం
  • యురేనియం తవ్వకాలు వద్దే వద్దు: పవన్‌ కల్యాణ్‌
నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ ఓవైపు పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపడుతుండగా.. మరోవైపు తవ్వకాలకు సంబంధించిన సన్నాహాలను యూసీఐఎల్‌ ముమ్మరం చేస్తోంది. యురేనియం తవ్వకాల కోసం నల్లమల అడవుల్లో యూసీఐఎల్‌ వేయదలచిన 4వేల బోరు పాయింట్లను గుర్తించడానికి 30 మంది జియాలజిస్టులు సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లాలోని దేవరకొండకు చేరుకున్నారు.
స్థానికంగా ఓ లాడ్జిలో బస చేసిన వీరు.. మంగళవారం ఉదయం 6గంటలకే ఆయా ప్రాంతాలకు బయలుదేరనున్నారు. అయితే వీరు సర్వేకు వెళ్లకుండా అక్కడే అడ్డుకునేందుకు తెలంగాణ విద్యావంతుల వేదిక నేతలు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా.. యురేనియం తవ్వకాలకు అనుమతులను రద్దు చేయాలంటూ సోమవారం తలపెట్టిన బంద్‌ విజయవంతమైంది. నాగర్‌కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్‌, పదర మండల కేంద్రాల్ల్లోని బ్యాంకులు, విద్యాలయాలు, దుకాణాలు, హోటళ్లను మూసివేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో మన్ననూర్‌లోని శ్రీశైలం- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వంశీకృష్ణను పోలీసులు అరెస్టు చేయడంతో.. మహిళలు ఈగలపెంట పోలీస్‌ అవుట్‌ పోస్టును ముట్టడించారు. దీంతో ఆయనను విడుదల చేశారు.
నల్లమలను కాపాడుకుందాం.. 
నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపొద్దని, నల్లమలను కాపాడుకుందామంటూ తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ముద్రించిన ‘సేవ్‌ నల్లమల’ వాల్‌పోస్టర్లను టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం జనగామలో ఆవిష్కరించారు. ప్రజలకు హాని కలిగించే యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వవద్దన్నారు. కాగా ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే యురేనియం తవ్వకాలు వద్దే వద్దని జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దీనిపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్‌ నియమించిన కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఆ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు సోమవారం పవన్‌కల్యాణ్‌ను జనసేన కార్యాలయంలో కలిశారు. ప్రజాసమస్యలపై పోరాటంలో పవన్‌ కల్యాణ్‌ ముందుంటారని, అందుకే తొలుత ఆయనను కలిసి మద్దతు కోరానని వీహెచ్‌ చెప్పారు.
అణుబాంబుల కోసమే తవ్వకాలు: మావోయిస్టు పార్టీ
అణుబాంబుల తయారీ కోసమే నల్లమలలో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటోందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అణువిద్యుత్తు పేరుతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని, ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో సోమవారం ఓ ప్రకటన వెలువడింది. యురేనియం తవ్వేందుకు నల్లమలకు వచ్చేవారిని అడ్డుకోవాలని ప్రకటనలో ఆయన పిలుపునిచ్చారు.

(Courtacy Andhrajyothi)

Leave a Reply