Image result for పేదలకు ‘జనరిక్‌’ అండ"ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో దుకాణాల ఏర్పాటు
తగిన అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత
హైదరాబాద్‌

జనరిక్‌ ఔషధాలతో పేదలకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం లభిస్తోంది. ప్రధానంగా గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్సతోపాటు మందులు కూడా ఉచితంగానే అందిస్తారు. అయితే రోగుల రద్దీ ఇతరత్రా కారణాలతో కొన్ని మందులు లభించడం లేదు. దీంతో బయట కొనుగోలు చేయాలని సూచిస్తుంటారు. ఉచితంగా చికిత్స అందించినా సరే.. మందుల ఖర్చు తడిసి మోపెడవుతోందని చాలామంది రోగులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జనరిక్‌ మందులను కొనుగోలు చేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే బయట పడుతున్నారు. బ్రాండెడ్‌ ఔషధ దుకాణాల్లో రూ.100 ఖర్చు అయ్యే మందులు.. జనరిక్‌లో రూ.20-30లోపు దొరకుతున్నాయి. నగరంలోని ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌, నిలోఫర్‌ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఈ దుకాణాలు ఉన్నాయి. ఉస్మానియా, గాంధీలోని ఎక్కువ మంది పేదలు ఈ జనరిక్‌ మందులనే కొంటున్నారు. రోగుల ఆర్థిక పరిస్థితి చూసి చాలామంది వైద్యులు జనరిక్‌ మందులను రాస్తున్నారు. కొందరు మాత్రం బ్రాండ్‌కే పరిమితమవుతున్నారు. మరింత అవగాహన కల్పించడం ద్వారా మందులకు రోగులు పెట్టే ఖర్చును తగ్గించే వీలుంటుంది. సాధారణ రోగాలకు సంబంధించిన ఔషధాలకే కాకుండా కేన్సర్‌ వంటి తీవ్రమైన వ్యాధులకూ జనరిక్‌ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి.

జనరిక్‌ ఔషధాలంటే…
సాధారణ జ్వరం వస్తే వినియోగించే ఔషధం పారాసిటమాల్‌. వైద్యుడి దగ్గరకు వెళ్తే మందుల చిట్టీలో పారాసిటమాల్‌ అని కాకుండా ఏదో ఒక బ్రాండ్‌ పేరు రాస్తారు. మందుల దుకాణానికి వెళ్లి అదే తీసుకుంటుంటారు. ఈ బ్రాండ్‌ మందులు ఔషధ తయారీ సంస్థలు, పంపిణీదార్లు, రిటైల్‌ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఏదైనా ఒక బ్రాండ్‌ ఔషధానికి బాగా పేరొస్తే ఇష్టానుసారం ధర నిర్ణయిస్తున్నారు. జనరిక్‌ మందుల విషయంలో ఇలాంటి ప్రచారం ఉండటం లేదు. అసలు వీటి గురించి రోగులకు అర్థమయ్యేలా చెప్పే వారే కనిపించడం లేదు.

ధరల్లో తేడా..
సాధారణ మందులకు, జనరిక్‌ ఔషధాలకు ధరల్లో తేడా ఉంది. ఉదాహరణకు నొప్పి నివారణకు వాడే ఒక ప్రముఖ బ్రాండ్‌ పది మాత్రలు రూ.55పైనే. కానీ ఇదే పది మాత్రలు జనరిక్‌ స్టోర్‌లో కేవలం రూ.10లోపే. ఇక 100 ఎంఎల్‌ దగ్గు సిరప్‌ బ్రాండ్‌ది అయితే రూ.40పైనే. అదే జనరిక్‌ అయితే కేవలం రూ.20లోపే లభిస్తుంది. ఇలా అన్ని ఔషధాలు ధరల వ్యత్యాసం 40-90 శాతం మధ్య ఉంటోంది. ప్రస్తుతం రోగుల చికిత్సకు అయ్యే వ్యయంలో 40-50 శాతం వరకు ఔషధాల ఖర్చు ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు ప్రభుత్వమే ఉచితంగా ఔషధాలు సరఫరా చేయాలి. ఏ ప్రభుత్వ దవాఖానాలోనూ ఈ పరిస్థితి లేదు. అరకొర సరఫరా చేసి మిగతావన్నీ బయటే కొనుక్కోవాలని సూచిస్తున్నారు.

(Courtesy Eenadu)