NRC– గౌహతి హైకోర్టు ఆదేశాలు

గువహతి: ఇంటర్నెట్‌ సేవలను వెంటనే పునరుద్ధరించాలంటూ గౌహతి హైకోర్టు అసోం ప్రభుత్వాన్ని ఆదేశించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటడంతో అసోం ప్రభుత్వం ఈ నెల 11న ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేసింది. శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జర్నలిస్ట్‌ అజిత్‌ కుమార్‌ భూయాన్‌, న్యాయవాది బోనోశ్రీ గొగోరు, మరో ఇద్దరు గౌహతి కోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి అజరు లాంబా, జస్టిస్‌ అచింత్య మల్లా బుజోర్‌ బారువాలతో కూడిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. ప్రజా అవసరాల దృష్ట్యా ఇంటర్నెట్‌ సేవలను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే సోషల్‌ మీడియాలో ఎలాంటి విద్వేషపూరిత సందేశాలూ, వీడియోలు వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపింది. ఈ ఆదేశాలపై అసోం ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయగా.. దానిని కోర్టు తోసిపుచ్చింది.

(Courtesty Nava Telangana)