-మోడీ ప్రకటించిన జీకేఆర్‌ఎతో కొత్తగా ఒరిగేదేమీ లేదు
– కొత్త కేటాయింపులేవి..?
– బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పథకం

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా సొంత ప్రాంతాలకు తిరిగొచ్చిన వలసకూలీలకు ఉపాధి కల్పించడానికని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీభ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ యోజనా (జీకేఆర్‌ఎ) పాత సీసాలో కొత్త సారాగా ఉన్నదని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిద్వారా వలసకూలీలకు కొత్తగా ఒరిగేదేమీ లేదనీ, ఇప్పటికే ఉన్న పాత పథకాలకే కొత్త పేరు పెట్టి ప్రధాని మోడీ ప్రకటించారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని 12 మంత్రిత్వశాఖలు ఇప్పటికే పలు పథకాల కింద గ్రామీణ భారతంలో ఈ పనులు చేస్తున్నాయనీ, కానీ.. మోడీ మాత్రం దీనినొక గొప్ప పథకమని కీర్తిస్తూ జనాలను మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

జీకేఆర్‌ఎ అంటే…
ఆరు రాష్ట్రాల్లో వలస కూలీలు అధికంగా ఉన్న జిల్లాల్లో స్వగ్రామంలోనే వారికి పనులు కల్పించడానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకమే జీకేఆర్‌ఎ. కూలీలకు 125 రోజుల పాటు సొంతూళ్లనే ఉపాధి కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. మొక్కలు నాటడం, జలజీవన్‌ మిషన్‌, గ్రామీణ మార్కెట్ల నిర్మాణం, రోడ్లు, పశువుల షెడ్లు, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ఫైబర్‌ నెట్‌.. తదితర 25 ఉపాధి విభాగాల్లో కార్మికులకు పని కల్పిస్తారు.

కొత్తగా కేటాయించారా..?

జీకేఆర్‌ఎ కింద కొత్తగా కేటాయించిన నిధులేమైనా ఉన్నాయా..? అంటే లేవనే అంటున్నారు విశ్లేషకులు. రోడ్లు, మైనింగ్‌, తాగునీరు, పారిశుధ్యం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌.. ఇలా 12 మంత్రిత్వ శాఖలు ఇప్పటికే పలు పథకాల పేరుతో ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ పథకాలలో ఎక్కువగా స్థానికులే పనులు చేస్తున్నారు. ఇక ఇప్పుడు జీకేఆర్‌ఎ అమలుకాబోయే జిల్లాల్లో ఈ పథకాలకే నిధులను విడుదల చేసి వాటిని దీనికింద చూపించనున్నారనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఉదాహరణకు.. భారత్‌ నెట్‌ ద్వారా ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సౌకర్యం అందించడానికి గానూ గ్రామ గ్రామానికి ఫైబర్‌ కేబుల్‌లు వేస్తున్నారు. దీన్ని ఇప్పుడు జీకేఆర్‌ఎలో చేర్చారు. ఇదే పద్దతిలో గ్రామీణ రోడ్లు, అంగన్వాడీ, పంచాయతీరాజ్‌ పనులను జీకేఆర్‌ఎలో భాగం చేశారు. ఇక్కడ మరో ముఖ్య విషయం.. ఇప్పటికే ప్రకటించి ఉన్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత నిధులను విడుదల చేసింది. కానీ ఇప్పుడు మోడీ సర్కారు వీటినే రూ. 50 వేల కోట్ల పథకంగా చూపిస్తున్నది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతాయని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా..
పథకాన్ని ప్రకటించేప్పుడు.. దీన్ని 116 జిల్లాల్లో అమలుచేస్తామని మోడీ చెప్పారు. ఇందులో బీహార్‌ నుంచే 32 (మొత్తం 38) జిల్లాలున్నాయి. జీకేఆర్‌ఎను వలస కార్మికులు అధికంగా ఉన్న బీహార్‌లోని ఖగరియా నుంచి ప్రారంభించడం కాకతాళీయం కాదనీ, దాని వెనుక మోడీ రహస్య ఎజెండా దాగి ఉన్నదని రాజకీయ విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. బీహార్‌లో అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడానికే బీజేపీ పావులు కదుపుతున్నదని వారు అంటున్నారు. పదివారాల లాక్‌డౌన్‌తో ప్రజల్లో.. ముఖ్యంగా వలస కార్మికుల్లో మోడీ సర్కారు మీద విపరీతమైన జనాగ్రహం ఉన్నది. దీన్ని తగ్గించి, వారిని మచ్చిక చేసుకోవడానికే మోడీ ప్రయత్నిస్తున్నారనీ, ఇందులో భాగంగానే జీకేఆర్‌ఏను ప్రకటించారని విమర్శిస్తున్నారు. మోడీ కంటే ముందే అక్కడ కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా ఆన్‌లైన్‌లో బీహార్‌ జనసంవాద్‌ ఏర్పాటు చేసి.. ప్రభుత్వ పథకాలను ఏకరువు పెట్టిన విషయం విదితమే. ఏదెలాఉన్నా జీకేఆర్‌ఎతో బీహారీలకు ఒరిగేదేమీ లేదనీ, అదొక పాత సీసాలో కొత్త సారా వంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గరీబ్‌ కళ్యాణ్‌ యోజన తెలుగు రాష్ట్రాలకు అమలు చేయాలి
గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 200 రోజుల పనిదినాలు కల్పించాలని కోరారు. ఈ పథకానికి రూ.లక్ష కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Courtesy Nava telangana