ఎదురుకాల్పుల్లో యూపీ గ్యాంగ్‌స్టర్‌ హతం..
నిజమైన ఐజీ అమితాబ్‌ ఠాకూర్‌ మాటలు

కాన్పూర్‌: ‘‘వికాస్‌ దూబేను అదుపులోకి తీసుకుంటాం. రేపు(శుక్రవారం) యూపీకి తీసుకువస్తాం. ఆ సమయంలో అతడు తప్పించుకునే ప్రయత్నంలో హతమవ్వొచ్చేమో. అప్పుడు వికాస్‌ దూబే అధ్యాయం(చరిత్ర) పరిసమాప్తి అవుతుంది’’ అని ఉత్తరప్రదేశ్‌ పౌర భద్రత విభాగం ఐజీ అమితాబ్‌ ఠాకూర్‌ గురువారం హిందీలో ట్వీట్‌ చేశారు. ఆయన అన్న మాటలే నిజమయ్యాయి. శుక్రవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో వికాస్‌ దూబే హతమయ్యాడు. ఇటీవల కాన్పూర్‌లో 8 మంది పోలీసులను పాశవికంగా కాల్చిచంపిన కేసులో ప్రధాన నిందితుడు వికాస్‌ దూబే చరిత్ర పరిసమాప్తమైంది. గత శుక్రవారం తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డ వికాస్‌ గ్యాంగ్‌.. ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరారీలో ఉన్న వికా్‌సను అరెస్టు చేసేందుకు యూపీ పోలీసులు ఆరు రోజులపాటు గాలింపు చర్యలు చేపట్టారు.

అనూహ్యంగా గురువారం ఉదయం ఉజ్జయినీ ఆలయం వద్ద మధ్యప్రదేశ్‌ పోలీసులకు వికాస్‌, అతడి అనుచరులిద్దరు పట్టుబడ్డారు. సాయంత్రానికి అతడిని యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున వికా్‌సను రోడ్డు మార్గంలో కాన్పూర్‌కు తరలించే ప్రక్రియను ప్రారంభించారు. ఓ ఎస్‌యూవీలో వికా్‌సను తీసుకెళ్తుండగా.. దానికి ముందు, వెనకా మరో రెండు ఎస్‌యూవీల్లో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎస్టీఎఫ్‌), సాయుధ పోలీసులు ఎస్కార్టుగా వెళ్లారు. ఆ కాన్వాయ్‌ని మీడియా ప్రతినిధులు తమ వాహనాల్లో వెంబడించారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో కాన్పూర్‌ శివార్లలోని ఓ టోల్‌గేటు వరకు మీడియాను అనుమతించిన పోలీసులు.. ఆ తర్వాత వారిని నిలువరించారు.

కాన్వాయ్‌ సరిగ్గా అక్కడి నుంచి ఒక కిలోమీటర్‌ దాటగానే.. హైవేపై పశువులు అడ్డురావడంతో.. డ్రైవర్‌ వాటిని తప్పించే క్రమంలో ఓ కారు బోల్తాపడింది. దీంతో మిగతా రెండు కార్లు కూడా నిలిచిపోయాయి. అందులోని సిబ్బంది వెంటనే.. బోల్తాపడ్డ కార్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇదే అదునుగా వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడని కాన్పూర్‌ రేంజ్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ‘‘ఓ పోలీసు వద్ద ఉన్న తుపాకీని వికాస్‌ లాక్కొన్నాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి, చుట్టుముట్టారు. లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. దాంతో అతడు వారిపై కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, కుప్పకూలిపోయాడు’’ అని ఆయన వివరించారు.

రక్తమోడుతున్న వికా్‌సను చికిత్స నిమిత్తం కాన్పూర్‌లోని గణేశ్‌ శంకర్‌ విద్యార్థి మెడికల్‌ కాలేజీకి తరలించారు. అయితే.. అప్పటికే దూబే మృతిచెందినట్లు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.బి.కమల్‌ ధ్రువీకరించారు. ‘‘ప్రత్యేక కమిటీతో పోస్టుమార్టం చేయించాం. దూబే ఒంట్లో నాలుగు బుల్లెట్లను గుర్తించాం. మూడు ఛాతీభాగంలోకి దూసుకుపోగా.. మరొకటి చేతిని ఛేదించింది’’ అని తెలిపారు. అంతకు ముందు అతడికి కొవిడ్‌-19 పరీక్ష నిర్వహించగా.. నెగెటివ్‌గా రిపోర్టు వచ్చిందని తెలిపారు. పోస్టు మార్టం తర్వాత కూడా దూబే మృతదేహాన్ని తీసు కెళ్లడాని అతడి కుటుంబ సభ్యులు రాలేదని పోలీ సులు తెలిపారు. బోల్తాపడిన కారులో ఉన్న ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. గత శుక్రవారం 8 మంది పోలీసులను కాల్చిచంపిన ఘటన తర్వాత పోలీసు ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారి సంఖ్య(దూబే సహా) ఆరుకు చేరుకుంది. కాగా.. దూబే ఎన్‌కౌంటర్‌కు కొన్ని గంటల ముందు.. అతడి అడ్వొకేట్‌ సుప్రీంకోర్టులో ఆన్‌లైన్‌ ద్వారా ఓ పిటీషన్‌ దాఖలు చేశారు.

అన్నీ అనుమానాలే?
దూబే ఎన్‌కౌంటర్‌పై న్యాయనిపుణులు, విపక్ష నాయకులు పలు అనుమానాలను లేవనెత్తుతున్నారు. ఇది పకడ్బందీగా జరిగిన ఎన్‌కౌంటర్‌ అని ఆరోపిస్తున్నారు. అందులో ప్రధానమైన అంశాలు..

ఎన్‌కౌంటర్‌ గురించి ఐజీ అమితాబ్‌ ఠాకూర్‌ ముందే ఎలా చెప్పారు?

పారిపోయే ఉద్దేశం ఉంటే దూబే ఉజ్జయినీలోనే పారిపోయేందుకు యత్నించేవాడు కదా?

వాహనం బోల్తాపడితే.. వెంటనే పోలీసుల నుంచి తుపాకీని ఎలా లాక్కొనగలిగాడు?

పోలీసు కాన్వాయ్‌ని వెంబడిస్తున్న మీడియా వాహనాలను ఘటనాస్థలికి ఒక కిలోమీటరు దూరంలో ఎందుకు నిలిపివేశారు?

ఒక కిలోమీటరు దూరంలోనే.. నిమిషం వ్యవధిలో పోలీసులు వాడిన కారు బోల్తాపడేంత వేగాన్ని అందుకుంటుందా?

Courtesy Andhrajyothy