– పరస్పరం కత్తులతో దాడులు
– ఒకరి మృతి

విజయవాడ : విజయవాడ పటమట ప్రాంతంలో స్థలం విషయంలో ఇరుగ్రూపుల మధ్య నెలకొన్న వివాదం కత్తులతో దాడి వరకూ వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో, పటమట ప్రాంతంలోనూ, ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పటమట ప్రాంతానికి చెందిన తోట సందీప్‌, సనత్‌నగర్‌కు చెందిన పాండు ఒకరికొకరు తెలిసిన వారు. స్థల వివాదాలను సెటిల్మెంట్‌ చేస్తుంటారు. పటమట ప్రాంతంలోని డొంకరోడ్లులో ఒకస్థల వివాదంలో ఇరువురు మధ్య వివాదర నెలకొంది. ఆ స్థలం వద్ద ఇరుగ్రూపులూ కత్తులు, కర్రలు, రాళ్లతో శనివారం రాత్రి దాడి చేసుకున్నాయి. సందీప్‌ తలకు, చేతులకు, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. ఒక ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం మృతి చెందాడు. ఇదే ఆస్పత్రిలో మరికొందరు చికిత్స పొందుతున్నారు. మరలా ఏమైనా గొడవలు జరుగుతాయోమోనని ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రి వద్ద, పటమట ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గాయపడిన పాండు మరో ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సందీప్‌, పాండు ఇద్దరూ అధికార పార్టీ నాయకుని అనుచరులని సమాచారం. దీంతో, పోలీసులు రహస్యంగా దర్యాప్తు పడుతున్నారు. సుమారు 40 మంది ఈ దాడిలో పాల్గొన్నారని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకొనేందుకు ఆరు బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

Courtesy Nava Telangana