– కోప్ర

హంతకుడే అనుచరుడుగ
అవతారమెత్తిన చోట
దేశ భక్తుడే దేశద్రోహిగా
చిత్రీకరించబడుతాడు
విశ్వమానవ విముక్తిని కోరుకునేవాడు
జాతి విచ్ఛిన్నకారుడి జాబితాలో
జమచేయబడతాడు
జాతిపిత ప్రాణం తీసిన ముఠా సభ్యుడే
అభినవ జాతిపితగా అవతరిస్తాడు!
మత విశ్వాసం వేరు, మత విద్వేషం వేరు. గాంధీ మత విశ్వాసి. సంఘ్ మత విద్వేషి. తప్పో ఒప్పో గాంధీ తాను జన్మించిన హిందూమతాన్ని విశ్వసించారు. ఆ మత నియమాల ప్రకారం నడుచుకోవాలనుకున్నాడు. అందుకే అత్యంత నికృష్టమైన వర్ణ వ్యవస్థను సైతం చివరివరకూ సమర్థించాడు. నిజానికి, కుల వ్యవస్థకు మూలమైన వర్ణ వ్యవస్థను సమర్థించిన గాంధీ వైఖరికి సమర్థించాల్సిన పని లేదు. ఆయన జీవితాంతం మత సామరస్యం కోసం కృషి చేశారు. మత సామరస్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ ఇప్పుడు గాంధీని సమర్ధించాల్సిన అవసరం ముంచుకొచ్చింది. అవును! గాంధీ గొప్ప మత సామరస్యవాది. ఆ మత సామరస్యం కోసమే ఆయన తన ప్రాణాలను అర్పించారు. ఆయన ప్రాణాలు తీసిన శక్తులే ఇప్పుడు గాంధీ భక్తులుగా చెలామణి అయ్యేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో గాంధీని వక్రీకరిస్తున్నారు. ఆయన భావజాలాన్ని వంచిస్తున్నారు. గాంధీని ఒక మతవాదిగా, హిందూమత వీరునిగా చిత్రీకరించి తమ మత విద్వేష చర్యలకు ఒక సామాజిక అంగీకారాన్ని సృష్టించుకునే సాహసం చేస్తున్నారు గాంధీ హంతకుడైన ఈ గాడ్సే వారసులు.
పెట్టుబడిదారీ దోపిడీ వర్గ ప్రయోజనాల కోసం మత విద్వేషాన్ని ఒక ఆయుధంగా మలచుకుని అధికారంలోకి ఎగబాకిన సంఘ్ పరివార్‌ శక్తులు సెక్యులరిస్టులు కాబట్టి అడ్డుకోకపోతే గాంధీని కూడా తమ ఖాతాలో కలిపేసుకోవడం ఖాయం. శత్రువు గొప్పతనాన్ని సైతం నిస్సిగ్గుగా సొమ్ముచేసుకునే చాణక్యం సంఘ్ పరివార్‌ శక్తులది. గోరక్షణ నుంచి కాశ్మీర్‌ వరకూ గాంధీ విస్పష్టంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అలాగే, సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) గురించి కూడా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. మొదట్లో కుల వ్యవస్థను సైతం సమర్థించిన గాంధీ తన తప్పును తెలుసుకుని చివరకు కుల వ్యవస్థను ఈసడించారు. సనాతన హిందువు అయిన గాంధీ తన మత నియమాలను పూర్తిగా ఉల్లంఘించలేని అశక్తుడై కుల వ్యవస్థ స్థానంలో వర్ణవ్యవస్థ ఉండాలని తన పరిష్కారంగా సూచించారు. అయినా తన చివరి దశలో ”నాకు ఒక అవకాశం ఇస్తే.. నాదగ్గర ఉన్న ఉన్నత కులాలకు చెందిన అమ్మాయిలందరూ యోగ్యులైన హరిజన యువకులను తమ భర్తలుగా ఎన్నుకోవాలని సలహా ఇస్తాను.. కాలం మారే కొద్దీ ఇలాంటి వివాహాలు సర్వ సాధారణమవుతాయి (యంగ్‌ ఇండియా జులై 7, 1946) అంటూ భవిష్యత్‌ దర్శనం చేశారు.
ఒక విధంగా గాంధీ మతానికన్నా మానవీయతనే అధికంగా విశ్వసించారు. కాబట్టే ”హిందూ మతం పేరిట ఉన్న చాలా విషయాలు నాకు ఆమోద యోగ్యం కాదు. ఒక వేళ నేను నిజంగా అలాంటివి పాటించకపోతే నేను హిందువు కాదని భావిస్తే నన్ను హిందువు అని పిలవాల్సిన పనిలేదు. (యంగ్‌ ఇండియా అక్టోబర్‌ 6, 1921) అని విస్పష్టంగా ప్రకటించారు. గో సంరక్షణ విషయంలో కూడా గాంధీ అంతే విస్పష్టంగా ఉన్నారు. ”ఒక ఆవును రక్షించడం కోసం ఒక మనిషిని చంపడం అనేది హిందూ ధర్మానికి, అహింసా సూత్రాలకూ వ్యతిరేకం. తనను తాను ప్రక్షాళన చేసుకోవడం, ఆత్మత్యాగం అనేది హిందూ ధర్మ ఆచరణీయ మార్గం. కానీ, ఈ రోజుల్లో గోరక్షణ పేరిట ముస్లింలతో వివాదం కొనసాగుతోంది. గోరక్షణకు పిలుపునిచ్చిన మతం.. సాటి మనిషిని హింసించడాన్ని ఎలా సమర్థిస్తుంది?” అని సూటిగా సంఘ్ పరివార్‌ శక్తులను ప్రశ్నించారు.
దేశం అందరిదీ అన్నది గాంధీ బాట. దేశం హిందువులది అన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ మాట. అందుకనే సంఘ్ పరివార్‌ శక్తులు గాంధీ ఎడల ఎన్నడూ సానుకూలంగా లేవు. గాంధీ సారథ్యంలో సాగిన స్వాతంత్య్ర ఉద్యమానికి సహకారం అందించడం అటుంచి, ఉద్యమానికి వ్యతిరేకంగా సైతం పనిచేశాయి. ”గాంధీ ముస్లిం సమాజంలోని అతివాద జీహాదీ వర్గాలకు లొంగిపోయారు.. హిందూ – ముస్లిం ఐక్యత సాధించేందుకు అత్యంత సులభమైన పద్ధతి హిందువులందరూ ముస్లింలుగా మారిపోవడమే” ఇండియాస్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఇండిపెండెన్స్‌, పేజీ 438) అంటూ గోల్వాల్కర్‌ గాంధీ మత సామరస్య ప్రయత్నాలను ఎద్దేవా చేశారు. కాగా, ”అన్ని మతాలనుంచి గొప్ప విషయాలను హిందూ మతం స్వీకరిస్తుంది. అదే దాని గొప్పతనం. ఒక వేళ తమతో కలిసి జీవించాలనుకునే వేరే మతాల వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారాలని హిందువులు నమ్మితే హిందూమతానికి అదే అంతం అవుతుంది” అని గాంధీ స్పష్టం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే తాను విశ్వసించిన మతంలో మానవీయతను గాంధీ బతికించుకోవాలని తాపత్రయ పడ్డారు. మతం కోసమే తాము జీవించి ఉన్నామంటూ గప్పాలు కొట్టుకునే సంఘీయులు మాత్రం హిందూమతాన్ని తమ ఆధిపత్యానికి సాధనంగా వాడు కోవాలని ప్రయత్నించారు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో గాంధీజీకి- సంఘ్ అధినేత గోల్వాల్కర్‌కీ మధ్య ఒక దశలో మాటల యుద్ధమే సాగింది. స్వాతంత్య్ర ప్రకటన తరువాత దేశంలో దారుణమైన మత కలహాలు జరుగుతున్న సమయంలో సెప్టెంబర్‌ 7, 1947న ఢిల్లీలో గాంధీ-గోల్వాల్కర్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ”మీ సంస్థ, మీ చేతులకూ రక్తపు మరకలు ఉన్నాయని నాకు సమాచారం వచ్చింది” అని గాంధీ గోల్వాల్కర్‌తో అన్నారు. అందుకు సమాధానంగా ”ముస్లింలను చంపే ఎజెండా మాకు లేదు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే మా సంస్థ కృషి చేస్తోంది. శాంతినే కోరుకుంటోంది. ఈ విషయాన్ని మీరు కూడా ప్రచారం చేయాలి” అనగా, గాంధీ గోల్వాల్కర్‌ మాటలను ఏ మాత్రం విశ్వసించలేదు. అప్పుడు గాంధీ ”నిజంగా మీ మాటలు గుండెలోతుల్లోంచి వస్తే, వాటిని ప్రజలు మీ నోటినుంచి వినడమే బాగుంటుంది (ఢిల్లీ డైరీ, 11పేజీ) అని గోల్వాల్కర్‌ ముఖం మీద గుద్దినట్టు చెప్పారు. దీంతో, తమ హంతక చర్యలను గాంధీ అహింసా మూర్తిత్వం కింద కప్పిపెట్టాలనే సంఘీయుల కుట్ర నీల్గి చచ్చింది.
గాంధీకి ఆర్‌ఎస్‌ఎస్‌ మత విద్వేష ఫాసిస్టు భావజాలంపై పూర్తి స్పష్టతా విముఖతా ఉంది. ఈ విషయాన్ని దేశ విభజన సమయంలో హిందూ – ముస్లిం మతాల మధ్య చెలరేగిన సందర్భంలో ఆయన స్పష్టం చేశారు. శరణార్ధి (హిందూ) శిబిరాలలో సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలలో తెగువ, క్రమశిక్షణ, శ్రమించే తత్వం కనిపించాయని గోల్వాల్కర్‌తో సమావేశం సందర్భంగా గాంధీ అనుచరుడు అనగా, ”హిట్లర్‌ నాజీలు, ముస్సోలిని ఫాసిస్టులు కూడా ఇలాంటి సేవ చేసిన విషయాన్ని మరచిపోవద్దు” అని ఘాటుగా గాంధీ హెచ్చరించారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి చాలా విషయాలు విన్నాను. ఈ దుండగాలన్నిటికీ ఆ సంస్థే మూల కారణమని కూడా విన్నాను. వెయ్యి ఖడ్గాలకంటే ప్రజాభిప్రాయమే మహా శక్తివంతమైనదన్న సత్యాన్ని మనం విస్మరించకూడదు. అడ్డూ ఆపూలేని హత్యలతో హిందూమతానికి రక్షణ సమకూరదు.. ఇప్పుడు మీరు నిరంతర జాగరూకతతో వ్యవహరించాలి. లేనిపక్షంలో మీరు ఎంతో కష్టంమీద సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోతారు. అటువంటి చెడ్డరోజులు రాకూడదని ఆశిస్తున్నాను” అని నవంబర్‌ 15, 1947న జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఒక వైపు గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు రంగు బయట వేస్తూ మత సామరస్యం కోసం తన ప్రాణాలను అడ్డుపెట్టి కృషిచేస్తుంటే, మరో వైపు 1947 డిసెంబర్‌ మొదటివారంలో ఢిల్లీలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ”ముస్లింలు భారత్‌లో ఉండిపోయేలా చేయడం ఎవరికీ సాధ్యం కాదు. వారు వెంటనే ఈ దేశం నుంచి వెళ్లిపోవాలి. ముస్లింలు భారత్‌లో ఉండిపోవాలని మహాత్ముడు కోరుతున్నాడు. వచ్చే ఎన్నికలలో ముస్లింల ఓట్లద్వారా కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనం పొందాలన్నదే ఆయన లక్ష్యం. అయితే ఎన్నికలు వచ్చే నాటికి ఒక్క ముస్లిం కూడా భారత్‌లో ఉండబోడు. మహాత్ముడు వారిని ఇంకెంత మాత్రం తప్పుదోవ పట్టించ లేరు. అటువంటి వారిని మౌనం వహించేలా చేసేందుకు అవసరమెనౖ ”సాధనాలు” మనకు ఉన్నాయి. అయితే హిందువులకు హాని తలపెట్టడం మన సాంప్రదాయం కాదు. అటువంటి చర్యలు చేపట్టేందుకు వెనుకాడే ప్రసక్తి లేదు” అంటూ సాక్షాత్తూ గాంధీజీకే డెత్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అన్నట్టుగానే గోల్వాల్కర్‌ ఉన్న ‘సాధనాలలో’ ఒక ‘సాధనం’ గాడ్సే రూపంలో రెండు నెలలు తిరక్క ముందే పట్టపగలు దేశ రాజధానిలో క్రూరంగా కడతేర్చింది. గాంధీ హత్య కేసులో అనుమానితుడిగా గోల్వాల్కర్‌ జైలు కెళ్లాల్సి వచ్చింది.
గాంధీని అంతగా ద్వేషించి అంతం చేసిన శక్తులు ఇప్పుడు ఆయనను ఎందుకు భుజాలకెత్తుకుని ఊరేగుతున్నాయన్నది ప్రశ్న. ఇందుకు సమాధానమూ స్పష్టమే. ఇందులో ఇమిడి ఉన్నది దోపిడీ శక్తుల ఆర్థిక ప్రయోజనమే. అవును! తమ హంతకముఖాలతో అర్థిస్తే అంతర్జాతీయ పెట్టుబడి తమ చెంత చేరదు. అందుకని, శాంతి దూతగా, అహింసా మూర్తిగా గాంధీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇమేజ్‌ను అడ్డంపెట్టుకుని పెట్టుబడులను ఆకర్షించేందుకు పన్నాగం పన్నారు. ఆ పన్నాగంలో భాగంగానే గాంధీని కాషాయ పాలకులు ఆకాశానికి ఎత్తుతున్నారు. దేశంలో మాత్రం గాడ్సే భజనలు చేస్తూ అణగారిన కులస్తుల, అన్య మతస్తుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. గాంధీ సిద్ధాంతాలను, ఆచరణను మనం విమర్శించవచ్చు, విభేదించవచ్చు. కానీ, మత విద్వేషక రాజ్యం ఆ గొప్ప మత సామరస్యవాది స్ఫూర్తిని బలిగొనడాన్ని మాత్రం సహించకూడదు. అది మన బాధ్యత. అంతకుమించి అవసరం..

సెల్‌:6301289321