• గాంధీకొచ్చే రోగులకు టెస్టులు చేయాల్సిందే!
 • తీవ్ర లక్షణాలున్న పాజిటివ్‌లకు అక్కడే వైద్యం
 • పాజిటివ్‌ రిపోర్టు లేకుంటే తిప్పి పంపుతారా?
 • ఈలోగా ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత?
 • ఆస్పత్రులను కేటగిరీలుగా వర్గీకరించండి
 • ఏ ఆస్పత్రిలో ఎలాంటి చికిత్సో ప్రచారం చేయండి
 • ప్రైవేటు వైద్యం చార్జీలను ఖరారు చేయండి
 • ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోండి
 • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మార్గదర్శకాలు

హైదరాబాద్‌ :  కరోనా లక్షణాలతో చికిత్స కోసం గాంధీకి వచ్చిన వారిని కరోనా రిపోర్టు లేదంటూ తిప్పి పంపరాదని హైకోర్టు ఆదేశించింది. వచ్చిన ప్రతీ ఒక్కరికీ ర్యాపిడ్‌ యాంటీజన్‌ టెస్ట్‌ కిట్ల ద్వారా పరీక్ష చేసి, పాజిటివ్‌ అని తేలితే వెంటనే ఆసుపత్రిలో చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి గాంధీ ఆస్పత్రికి స్పష్టమైన ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. అదే విధంగా ప్రైవేటులో చికిత్సకు సంబంధించిన ధరలను ఖరారు చేయాలని, వాటిని ఉల్లంఘించిన ఆస్పత్రులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా చికిత్సలకు సంబంధించి దాఖలైన ఐదు వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి. విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఉమ్మడి ఆదేశాలు జారీ చేసింది. కరోనా చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగులకు వ్యాధి నిర్ధారణ(పాజిటివ్‌) నివేదిక చూపాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని ప్రస్తావించింది. నివేదిక చూపని వారిని తిప్పి పంపడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. కరోనా చికిత్సకు ప్రత్యేక ఆస్పత్రిగా గుర్తించిన గాంధీకి వచ్చే రోగులను వ్యాధి నిర్ధారణ నివేదిక (పాజిటివ్‌ రిపోర్టు) లేదని ఎలా తిప్పి పంపుతారని నిలదీసింది. పాజిటివ్‌ నివేదిక తీసుకుని రావడానికి రోగికి ఒకటి రెండు రోజులు పడుతుందని, ఈలోగా కొందరు శ్వాస తీసుకోడానికి తీవ్ర ఇబ్బందులకు గురై చివరికి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు కేవలం గర్భిణులకే చేస్తున్నామని వైద్య విద్య డైరెక్టర్‌(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి చెప్పడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. కొవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రిగా ప్రకటించాక పరీక్షలు కేవలం గర్భిణులకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించింది. డీఎంఈ వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. గాంధీలో రోజుకు 1500 ఆర్‌ఏటీ పరీక్షలు చేసేందుకు అవకాశం ఉందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ జి.శ్రీనివాస్‌ చెబుతున్నారని, అంతపెద్ద వెసులుబాటు ఉన్నపుడు కొవిడ్‌ పరీక్షలు ఎందుకు చేయరని ప్రశ్నించింది. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి న ధర్మాసనం..  కరోనా చికిత్సకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలు అమలుపై జూలై 27లోగా వాస్తవ నివేదిక ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎస్‌. ప్రసాద్‌ను ఆదేశించింది.

హైకోర్టు మార్గదర్శకాలు

 1.  రాష్ట్రంలో ప్రకటించిన మొదటి కరోనా ఆస్పత్రి గాంధీ. అందుకే ఎక్కువ మంది రోగులు ఇక్కడికి వస్తున్నారు. వారిని తిప్పిపంపకుండా ఉండాలంటే ఇక్కడే ఒక ల్యాబ్‌ ఉండాలి. వచ్చిన రోగులను తిప్పి  పంపవద్దు. గాంధీలో రోజుకు 1500 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. ఇక్కడే వ్యాధి నిర్ధారణ జరగాలి.
 2.  ఆస్పత్రికి వచ్చిన రోగులను నిరాకరించడానికి ఎలాంటి కారణాలు లేవు. కరోనా లక్షణాలతో గాంధీకి వచ్చే రోగులకు ఇక్కడే నిర్ధారణ పరీక్షలు చేసేందుకు  అనుమతి ఇవ్వాలి.
 3.  కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం సమగ్రంగా ప్రజలకు చేరడం లేదు. మొదటగా కోవిడ్‌ ఆస్పత్రులను వర్గీకరించాలి. ఏ ఆసుపత్రిలో ఎలాంటి లక్షణాలున్న వారికి చికిత్స అందిస్తున్నారో చెప్పాలి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను తీవ్ర లక్షణాలున్న కరోనా రోగుల చికిత్సకు కేటాయించారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వమే ప్రజల్లోకి చేరవేయాలి.
 4.  కేటగిరీ వారీగా కరోనా చికిత్సలు అందించే ఆసుపత్రులను ముందుగా గుర్తించాలి. ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియపర్చాలి. కరోనా చికిత్స అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల జాబితాను ప్రచురించాలి. కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించిన గాంధీ, ఉస్మానియాల బయట ప్రభుత్వం ‘డాష్‌ బోర్డులు’ ఏర్పాటు చేసి, ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి? వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సౌకర్యం, సాధార ణ పడకలు ఎన్ని ఉన్నాయనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు  అందించాలి.
 5.  రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే రోజువారీ మెడికల్‌ బులిటెన్‌లోనూ వివిధ ఆసుత్రుల్లో పడకల సమాచారాన్ని కేటగిరీల వారీగా పొందుపర్చాలి. ఈ సమాచారాన్ని స్థానిక పత్రికలతో పాటు హైదరాబాద్‌ కేంద్రంగా ముద్రితమయ్యే జాతీయ పత్రికల్లో ప్రకటించాలి.
 6.  అధిక ఫీజులు వసూళ్లు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ ఒక వెబ్‌లింక్‌ను ఏర్పాటు చేయాలి. కరోనా చికిత్సకు గరిష్ఠంగా వసూలుచేసే చార్జీల గురించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని అంశాలను ప్రజలకు తెలియపర్చాలి. వైద్య బీమా ఉన్న వారికి ప్రభుత్వం జారీ చేసిన జీవో వర్తించదనే అంశాలను తెలియపర్చాలి.
 7.  వైద్య సంస్థల చట్టం 32వ సెక్షన్‌ ప్రకారం ప్రజారోగ్య డైరెక్టర్‌కు ఆసుపత్రులపై విస్తృత అధికారాలు ఉంటాయి. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించే ప్రై వేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయొచ్చు.  ప్రైవేటు ఆసుపత్రులు అందించే సేవలకు సంబంధించి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. ఉల్లంఘించిన వాటిపై చర్యలు తీసుకోవాలి.

Courtesy Andhrajyothi