పలు స్కూళ్లలో పిల్లలకు ఇంటి నుంచే బువ్వ

రూ.6తో పౌష్టికాహారం పెట్టాలని కార్మికులపై అధికారులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు
తనిఖీలతో హల్‌చల్‌
నిధుల గురించి మాత్రం నోరెత్తని వైనం
మూడు నెలలుగా పెండింగ్‌లో బిల్లులు
రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు

రాష్ట్రంలో సింగిల్‌ టీ ధర కనీసం ఏడు రూపాయలు..
రెండ్లు ఇడ్లీల ధర తక్కువలో తక్కువ 15 రూపాయలు…
కానీ ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా..? కేవలం రూ.6.71 పైసలు..!
బయట గుడ్డు ధర దాదాపు రూ. 5 ఉన్నా.. రూ.6.71లోనే పౌష్టికాహారం అందించాలని ఆదేశాలు..
వంట చేస్తున్న కార్మికులకు మాత్రం 2009 నుంచి నెలకు చెల్లిస్తున్నది కేవలం వెయ్యి రూపాయలు..
ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరు…!
సర్కారు ఇస్తున్న శ్లాబ్‌రేట్‌లోనే నాణ్యమైన భోజనం అందజేయాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు, హెడ్మాస్టర్లు అందరూ కార్మికులను గద్దించేవారే. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు.. నిర్వాహకులను నేరస్తులుగా లెక్కగడుతున్నారంటే అతిశయోక్తి కాదు! ఇంత తక్కువ శ్లాబ్‌రేట్‌లో ఎలా భోజనం పెట్టాలో మాత్రం చెప్పరు. దీని ఫలితం కామారెడ్డిలోని ఓ పాఠశాలలో రెండున్నర నెలలుగా విద్యార్థులకు భోజనం లేదు. నిజామాబాద్‌ జిల్లాలో ఓ విద్యాలయంలో మూడు రోజులుగా ఇంటి నుంచి టిఫిన్‌ బాక్సులు తెచ్చుకునే పరిస్థితి…!

సాధారణంగా తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనానికి అవసరమైన నిధులు ఒక నెల ముందుగానే ప్రభుత్వాలు విడుదల చేస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఒక్కో కార్మికురాలు పుస్తెలు తాకట్టుపెట్టి, అప్పులు చేసి మరీ ఏజెన్సీలను నడుపుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 1196 పాఠశాలలో లక్షా 19వేలు, కామారెడ్డిలో 1052 పాఠశాలల్లో 92 వేల మందికి మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నా.. నిర్వాహకులు అప్పులు చేసి మరీ విద్యార్థుల కడుపు నింపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి సుమారు రూ.20 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక వంట చేసే కార్మికులకు గౌరవవేతనం కింద కేవలం వెయ్యి మాత్రమే అందజేస్తున్నారు. ఇది కూడా నవంబర్‌ నుంచి పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ విద్యార్థులకు రూ.4.48, హైస్కూల్‌ విద్యార్థులకు రూ.6.71గా శ్లాబ్‌ రేటు నిర్ణయించింది. ఇక గుడ్డు ధర మార్కెట్‌లో పెరిగినప్పటికీ.. కేవలం రూ.4 మాత్రమే అందజేస్తోంది.

రెండున్నర నెలలుగా బంద్‌..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గతేడాది డిసెంబర్‌ 20 నుంచి మధ్యాహ్న భోజనం అందించడం లేదు. స్కూళ్లో మొత్తం 85 మంది విద్యార్థులు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. మెను ప్రకారం హైస్కూల్‌ విద్యార్థికి 30 గ్రాముల పప్పు, 75 గ్రాముల కూరగాయలు అందజేయాలి. సోమ, బుధ, శుక్రవారం గుడ్డు అందజేయాలి. ప్రభుత్వం ఇచ్చే శ్లాబ్‌ రేట్‌ ప్రకారం వండితే విద్యార్థులకు నీళ్లచారే దిక్కువుతోంది. దీంతో కింది నుంచి పైదాకా అందరూ వంట చేసే సిబ్బం దిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఉద్యోగాల నుంచి తొలగి స్తామని బెదిరించడం పరిపాటిగా మారింది. కార్మికులు మాత్రం ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని వాపోతు న్నారు. నిత్యవసరాల ధరలతో పొల్చితే ఒక్కో విద్యార్థికి సగటున రూ.13.60 పైసల వరకు ఖర్చు వస్తదని చెబుతు న్నారు. ఇప్పటికే అప్పులు చేసైనా మానవతాహృదయంతో భోజనాలు అందజేస్తున్నామని వాపోతున్నారు.

టిఫిన్‌ బాక్సులతో స్కూల్‌కు..

నిజామాబాద్‌ జిల్లాలోని మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడ్రోజులుగా భోజనం బంద్‌ అయ్యింది. స్కూల్‌లో ఆంగ్ల మీడియంలో 160 మంది, తెలుగు మీడియంలో 50 మంది విద్యార్థులున్నారు. అమ్రాద్‌, ఒడ్యాట్‌పల్లి, ముత్యంపల్లి, ఆమ్రాద్‌ తండాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. పదో తరగతి విద్యార్థులు 50 మంది ఉన్నారు. భోజన విషయమై ప్రిన్సిపాల్‌ వివరణ కోరగా.. నీళ్లచారు, రుచిలేకుండా కూరలు చేస్తున్నారనీ, అడిగితే వెళ్లిపోతున్నారనీ చెబుతున్నారు. మధ్యాహ్న భోజన కార్మికురాలిని అడిగితే ప్రభుత్వం అందిస్తున్న శ్లాబ్‌రేట్‌ ఎటూ సరిపోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం ఇంటి నుంచే విద్యార్థులు టిఫిన్‌ తెచ్చుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తమ స్నేహితుల ఇండ్లల్లో భోజనాలు చేస్తున్నారు.

210
మందికి 5 కిలోల పప్పు ఇస్తున్నారు
స్కూల్‌లో మొత్తం 210 మంది విద్యార్థులుంటే కేవలం 5 కిలోల పప్పు ఇస్తున్నారు. ఈ పప్పు రెండువందల మందికి సరిపోతుందా? వండితే నీళ్లచారుగానే ఉంటుంది. హెడ్మాస్టర్‌ చెప్పినట్టు గట్టిగా చేస్తే 20 మందికి కూడా సరిపోదు. నేనేం చేయాలి మరి? ప్రతిరోజూ పాఠశాల చైర్మెన్‌, అధికారులు తనిఖీ చేస్తూ నేనేదో తప్పు చేసినట్టు చూస్తున్నారు. డిసెంబర్‌ నుంచి పెట్టిన ఖర్చులు ఇప్పించండి. ఎవరితోనైనా వంట చేయించుకోండి.
లావణ్య, మధ్యాహ్న భోజననిర్వాహకురాలు, అమ్రాద్‌

Courtesy Nava telangana