• తల్లిదండ్రులు వేడుకున్నా కనికరించని ప్రధానోపాధ్యాయుడు
  • చదువుకు దూరమై పశువుల కాపరిగా మారిన బాలుడు

మర్పల్లి, జనవరి : బాల్యం అంటేనే అల్లరి.. తంటరి వయసు. ఆ చిన్నారి కూడా తుంటరి పనే చేశాడు. ఆశ్రమ పాఠశాల గోడ దూకి.. తోటలో జామ కాయలు కోశాడు. ఇది తెలిసి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆ బాలుడికి టీసీ ఇచ్చి పంపించి వేశాడు. చదువుకు దూరమైన ఆ బాలుడు పశువుల కాపరిగా మారాడు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం జాజిగుబ్బడి తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన అంగోత్‌ శంకర్‌, చాందినీ బాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు.

చిన్న కుమారుడు ఆంగోత్‌ కిషన్‌ మర్పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 11న సహచర విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రహరీ దూకి పక్కన ఉన్న పొలంలోని జామతోటలోకి వెళ్లి జామకాయలు కోసుకువచ్చాడు. ఈ విషయం హెచ్‌ఎం దృష్టికి రాగా.. ఆయన కిషన్‌ను తన గదిలోకి పిలిపించి చితకబాదాడు. విషయాన్ని కిషన్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పి పిలిపించి.. కిషన్‌కు టీసీ ఇచ్చి పంపించి వేశాడు.

కొడుకును చదువుకు దూరం చేయొద్దంటూ తల్లిదండ్రులు కాళ్లావేళ్లా పడ్డా ప్రధానోపాధ్యాయుడు కనికరించలేదు. అటు.. దొంగతనం చేశావంటూ తండాలోని పిల్లలు హేళన చేస్తుండటంతో కిషన్‌ తండాలో ఉండలేక తండ్రితో పాటు మేకలను కాసేందుకు వెళుతున్నాడు. ఈ విషయమై మర్పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంను వివరణ కోరగా కిషన్‌ అనే విద్యార్థి ఆశ్రమ పాఠశాల పక్కన ఉన్న పొలాలకు వెళ్లి జామకాయలు, అరటికాయలు దొంగతనం చేస్తున్నాడని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాను టీసీ ఇచ్చానని చెప్పడం విడ్డూరం.

Courtesy Andhrajyothi