• 64 ఏళ్ల వృద్ధుల్లో పాతికేళ్ల యవ్వనం
  • స్వచ్ఛమైన గాలితో సుసాధ్యం
  • ఆక్సిజన్‌ చాంబర్‌ ప్రయోగాలతో జీవకణ స్థాయిలో మార్పులు
  • ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల ప్రకటన

టెల్‌అవివ్‌ (ఇజ్రాయెల్‌)  : కాలచక్రం గిర్రున తిరగడం.. వయసు పెరుగుతూ పోవడం, వృద్ధాప్య ఛాయలు అలుముకోవడం సహజ పరిణామమే!! అయితేనేం.. షష్ఠి పూర్తి వయసులోనూ పాతికేళ్ల యవ్వనాన్ని సొంతం చేసుకోవచ్చని ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటే అది సాధ్యమేనని వారు వాదిస్తున్నారు. చెప్పడమే కాదు.. చేతల్లోనూ ఇది నిరూపించి యావత్‌ ప్రపంచం చూపులను తమవైపు తిప్పుకున్నారు. 64 ఏళ్లు లేదా అంతకు పైబడిన 35 మంది వృద్ధులపై మూడు నెలల పాటు జరిపిన ప్రెషరైజ్డ్‌ ఆక్సిజన్‌ చాంబర్‌ ప్రయోగాల్లో ఈవిషయాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఆ వృద్ధులందరినీ ప్రతివారంలో ఐదురోజుల పాటు.. ప్రతిరోజు 90 నిమిషాలు (గంటన్నర) ఆ ఆక్సిజన్‌ చాంబర్లలో ఉంచి, మాస్క్‌ల ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించారు. ఈ ట్రయల్స్‌కు వాడిన చాంబర్లలో.. ఆక్సిజన్‌ లభ్యత అత్యంత తక్కువగా ఉండేలా చూశారు.

టెలోమెర్లు మళ్లీ పెరిగాయి
మూడు నెలల ప్రయోగాల అనంతరం.. వృద్ధుల్లో జీవకణ స్థాయిలో రెండు కీలకమైన మార్పులు జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మనిషి శరీరంలోని ప్రతి జీవకణంలోనూ 23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఇవి ఎక్స్‌ ఆకారంలో ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ‘జన్యు’ సంబంధ వారసత్వాన్ని సంక్రమింపజేసే వాహకాలే క్రోమోజోమ్‌లు. క్రోమోజోమ్‌ల పరిమాణం క్షీణించకుండా.. వాటి కొనలకు నాలుగువైపులా మూతల్లా ఉండే ‘టెలోమెర్‌’ తొడుగులు ఉంటాయి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ.. టెలోమెర్‌లు తరుగుదలకు గురై వాటి పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంటుంది. మనిషి పుట్టినప్పుడు సగటున 11 కిలోబే్‌సలు ‘టెలోమెర్‌’ పొడవు.. వృద్ధాప్య సమయానికి 4 కిలోబే్‌సలకు కుచించుకుపోతుంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే టెలోమెర్‌ తరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా.. ఈ ప్రయోగాల్లో పాల్గొన్న వృద్ధుల్లో టెలోమెర్లు మళ్లీ 20 శాతం పెరిగాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వృద్ధులు.. పాతికేళ్ల వయసులో ఉన్నప్పటి స్థితికి టెలోమెర్లు మళ్లీ చేరడాన్ని అత్యంత సానుకూల అంశంగా అభివర్ణించారు. సాధారణ వ్యాధుల్లాగే.. వయసు మీద పడటాన్ని కూడా నిలువరించవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

జాంబీ కణాలు డౌన్‌
దీంతోపాటు ఆ వృద్ధుల్లో ‘సెనెసెంట్‌ కణాల’ మోతాదు 37 శాతం మేర తగ్గిందని వెల్లడించారు. ‘సెనెసెంట్‌’లు ఒకరకం శరీర కణాలు. సాధారణంగానైతే వీటివల్ల ఎలా సమస్యలూ తలెత్తవు. అయితే వాటి డీఎన్‌ఏకు నష్టం వాటిల్లినా, వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకినా.. ఆరోగ్య సమస్యల రూపంలో తీవ్ర ప్రతికూల పరిణామాలను కలిగిస్తాయి. ఇలా ప్రతికూలతలు సృష్టించే ‘సెనెసెంట్‌’ కణాలను జాంబీ కణాలు అని కూడా పిలుస్తారు. ఇవి తమ చుట్టుపక్కల సంచరించే ఇతరత్రా శరీర కణాలపైకి రసాయనాలను విడుదలచేసి హాని కలిగిస్తాయి. ఈ కారణంతో చాలామందిలో మధుమేహం, కేటరాక్ట్‌ (కళ్లలో శుక్లాలు), బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్‌), మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్‌), వణుకుడు వ్యాధి (పార్కిన్సన్స్‌), కిడ్నీ సమస్యలు, ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం, హృద్రోగాలు వంటివి తలెత్తుతుంటాయని గతంలో ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలింది. ఈ తరహా జాంబీ కణాలు భారీగా శరీరంలో పేరుకుపోతే.. ఆరోగ్య రుగ్మతల ముప్పు ఉంటుంది. టెల్‌ అవివ్‌ వర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో.. ఆక్సిజన్‌ చాంబర్లలో గడిపిన వృద్ధుల్లో ‘సెనెసెంట్‌’ కణాల మోతాదు 37 శాతం తగ్గడాన్ని మరో సానుకూల అంశంగా చెప్పొచ్చు. పౌష్టికాహారం, వ్యాయామాలతో టెలోమెర్‌ల తరుగుదల రేటును, జాంబీ కణాల మోతాదును తగ్గించి.. వృద్ధాప్య ఛాయలు త్వరగా అలుముకోకుండా చేయొచ్చని గతంలో పలు పరిశోధనలు చెప్పాయి. తమ పరిశోధన అంతకు మించిన ఫలితాలనే అందించిందని టెల్‌ అవివ్‌ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్‌ అమీర్‌ హదానీ తెలిపారు.

Courtesy Andhrajyothi