గత 73 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఆయా దశలలో పౌరుల అభివ్యక్తి స్వేచ్ఛపై ఆంక్షలు అధిక మవుతూనే ఉన్నాయి. అసమ్మతిని గౌరవించినపుడే ప్రజాస్వామిక మనుగడ సాధ్యమనే వాస్తవాన్ని పాలకులు మరిచిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు కేంద్రంలోని భాజపా సర్కార్, దేశభక్తి జాతీయవాదం– సంస్కృతి పేరిట ఈ అసమ్మతి హక్కును అన్ని విధాలా అణచి వేస్తున్నది. ప్రజా ఉద్యమాలు ఏ రూపంలో ఉన్నా తమ అధికారానికి ముప్పు వాటిల్లగలదనే మానసికత రాజ్యం చేస్తున్నది. అందులో భాగంగానే భీమా కోరేగావ్‌ దళితుల కార్యక్రమంపై క్రిమినల్‌ కేసులు పెట్టి, మిత్రులు వరవరరావు ఇతర ప్రజా స్వామిక ఉద్యమకారులపై కక్షపూరితంగా నేరాలు మోపి, కనీసం బెయిల్‌ రాకుండా చేస్తున్నారు.ప్రస్తుతం ఉపా (యూఏపీఏ) చట్టం కింద కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఏకపక్ష నిర్బంధాల మూలానా వివిధ కేసులలో, విచారణ లేకుండా మేధావులు–ప్రజాస్వామికవాదులు జైళ్లలో మగ్గిపోతున్నారు. కనీసం బెయిల్‌పై వచ్చే అవకాశాలు కోల్పోతున్నారు. ఒకవిధంగా ఇది రాజ్యహింసకు మరో రూపం.

ఈ నేపథ్యంలో రాజ్యాంగ యంత్రాంగం ముసుగులో పాలకులు నియంతలుగా మారిపోతే, ప్రజల ఆగ్రహాన్ని తిరుగుబాట్లను చూడవలసి ఉంటుంది. అభివ్యక్తి స్వేచ్ఛను హరించినప్పుడల్లా ప్రజల గొంతులుగా, నాడిగా రచనలు చేసే కవులు– రచయితలు తమ ఆత్మవిశ్వాసాన్ని–నిబద్ధతను చాటు తూనే ఉన్నారు. మరోవైపు రాజ్యాంగపరంగా పేదలకు రక్షణ ఉన్నా, వలస కాలం నాటి చట్టాలు, నేరస్మృతిలో భాగంగా– ఆ రక్షణను లాగేసి, నిర్బంధాలను అమలు చేస్తున్నారు. ఈ దేశంలోని సెక్యులర్‌ వామపక్ష భావాలు గల వారందరినీ అణచివేయాలనే కక్షపూరిత వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు. 1948లోనే రాజ్యాంగసభలో ప్రసంగిస్తూ మహానాయకుడు డా. అంబేడ్కర్‌ ఇలా వ్యాఖ్యానించారు. ‘ఈ నూతన రాజ్యాంగపరంగా ఏవైనా తప్పులు జరిగితే మనకు చెడ్డ రాజ్యాంగం ఉందనేది కారణం కాదు. మనిషి నీచుడిగా (దుష్టుడిగా) పరిణమించాడని మనం అను కోవలసి ఉంటుంది’.

‘స్వేచ్ఛాభివ్యక్తి నేరం కాదు’ అనే శీర్షికన వెలువడిన పెంగ్విన్‌ ప్రచురణ ఇలాంటి అనేకానేక నిషేధాలను, నిర్బంధాలను వెల్లడిస్తున్నది. వివిధ రూపాలలో రచయిత లను, జర్నలిస్టులను ఆయా దేశాలలోని ప్రభుత్వాలు ఎలా పీడిస్తున్నాయో వివరిస్తున్నది. ఇటీవల మన దేశంలో వెలువడిన ప్రచురణ (భారత్‌ అసమ్మతి) సంపాదకుడు అశోక్‌ వాజ్‌పేయి. ఈ దేశంలో భిన్నాభిప్రాయంతో ప్రశ్నించే సాంప్ర దాయం తరతరాలుగా కొనసాగుతున్నదనే చరిత్ర సంకలనమది. అన్ని కోణాల నుంచి నిజాన్ని దర్శించ గలిగే స్వతంత్రమైన చర్చ మాత్రమే యథార్థాన్ని వెలికితీయగలదు! ఈ ఆలోచనా క్రమంలోనే హెరాల్డ్‌ పింటర్‌ (2005 నోబెల్‌–సాహిత్య పురస్కార ప్రసంగం) జాతి–రంగు–భాష–లింగ భేదాలను దేశాల సరిహద్దులను దాటి ప్రపంచ రచయితల ఆత్మపరిశీలన కోసం, మనమంతా మననం చేసుకో వలసిన భావాలను వ్యక్తం చేశాడు.

గతంలో అంతర్జాతీయ వార్తలతో సంచలనం లేవ దీసిన ప్రఖ్యాత టర్కిష్‌ నవలా రచయిత, నోబెల్‌ పురస్కార గ్రహీత అర్హన్‌ పాముక్‌ ఉదంతంతో ముగిస్తాను. పాముక్‌ ఒక స్విస్‌ వార్తా పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా అన్నాడు ‘మా దేశంలో గతంలో 30 వేల కుర్దు జాతీయులను, 10 లక్షల ఆర్మేనియన్లను చంపివేశారు. నేను తప్ప మరెవరూ కూడా దాని గురించి మాట్లాడే సాహసం చేయడం లేదు’. ఈ చారిత్రక వాస్తవాన్ని తమ జాతీయుడే వెల్లడించేసరికి, టర్కీ ప్రభుత్వం జీర్ణించుకోలేక, పాముక్‌పై దేశద్రోహ నేరం మోపి న్యాయస్ధానానికి ఈడ్చింది.

అయితే టర్కీ దేశంలోని న్యాయస్థానాలకు ప్రజాస్వామ్యంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ పవిత్ర మైనదనే నమ్మకం ఆనాటికి ఉంది కాబట్టి పాముక్‌కు ఎలాంటి శిక్ష విధించలేకపోయింది. విచారణను వాయిదా వేస్తూ, టర్కీ దేశంలోని ప్రజాస్వామిక అభి వ్యక్తి స్వేచ్ఛకు అర్థమేమిటని కోర్టులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.మనదేశంలో కూడా ప్రజా ఉద్యమాలు, రచయితల, మేధావుల సంఘీభావ సహకారం, న్యాయాన్ని పరిరక్షించే న్యాయమూర్తులు–రాజ్యం విధించే నిషేధాలను ఎప్పటికప్పుడు ఎదిరిస్తూ సృజ నాత్మక రచయితలను రక్షించుకోగలరనే నమ్మకం మిగిలి ఉంది.

వ్యాసకర్త: నిఖిలేశ్వర్‌
ప్రముఖ కవి

Courtesy Sakshi