రామచంద్ర గుహ 

మా లేఖకు అటువంటి ప్రత్యుత్తరం, అదీ తీవ్ర విమర్శలతో రావడం నన్నేమీ ఆశ్చర్య పరచలేదు. అపర్ణాసేన్, శ్యామ్ బెనెగల్ లాంటి వారిని జాతి-వ్యతిరేకులుగా పేర్కొనడం వర్తమాన భారతదేశంలో ప్రజా చర్చలుగా పరిగణింపబడుతున్న వాటి విషపూరిత స్ఫూర్తికి అనుగుణంగానే వున్నది. ఈ ప్రత్యుత్తరం వచ్చిన వెంటనే మాకు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు చేపట్టడం మరింత కలవరపరుస్తోంది. నాతో పాటు ఆ లేఖపై సంతకం చేసిన కొంతమందిమీద బిహార్ కోర్టులో నేరపూరిత ఫిర్యాదు దాఖలయింది. మీడియా వార్తల ప్రకారం బిహార్లో ఆ కేసు నేడు విచారణకు రానున్నది.

కుల, మత వివక్షతో పెరిగిపోతోన్న విద్వేష నేరాలను అరికట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అప్రమత్తం చేస్తూ ఇటీవల ఆయనకు ఒక లేఖ రాసిన చలనచిత్ర కళాకారులు, విద్వత్ పరుల బృందంలో నేనూ ఉన్నాను. ‘ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మూక దాడులను తక్షణమే నిరోధించాలని’ మేము విజ్ఞప్తి చేశాము. విమర్శలను సహించే సహృదయత ప్రభుత్వానికి అంతగా లేదని తెలుసు కనుక ప్రధానమంత్రికి మేమీ సత్యాలను గుర్తు చేశాము: ‘పాలక పక్షాన్ని విమర్శించడమంటే జాతిని విమర్శించడం ఎంతమాత్రం కాదు. ఏ అధికార పార్టీ కూడా తాను అధికారంలో వున్న దేశంతో సమం కాదు. అది ఆ దేశ రాజకీయ పార్టీలలో ఒకటి మాత్రమే. కనుక ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని జాతి వ్యతిరేక ధోరణిగా భావించకూడదు. భిన్నాభిప్రాయాలు అణచివేతకు గురికాని స్వేచ్ఛాయుత వాతావరణం జాతిని శక్తిమంతం చేస్తుంది’. ఆ లేఖను ఈ మాటలతో ముగించాము: ‘మా సూచనలను వాటిని ఉద్దేశించిన స్ఫూర్తితో తీసుకుంటారని ఆశిస్తున్నాము. భారతీయులంగా మన జాతి భవిష్యత్తు విషయమై మేము ఆందోళన, ఆవేదన చెందుతున్నాం’.

ఈ లేఖకు తక్షణమే ఒక ప్రత్యుత్తరం వచ్చింది. విద్వేష నేరాలను అరికట్టేందుకు మేము తీసుకున్న చొరవ జాతిని అప్రతిష్ఠ పాలుచేసే ‘కుట్ర’అని ఆ ప్రత్యుత్తరం ఆరోపించింది. ‘అంతర్జాతీ య సమాజంలో భారత్‌ను చిన్నబుచ్చడమే మా ధ్యేయమని’ విమర్శించింది. జాతీయ వాదం, మానవ వాదం ప్రాతిపదికలపై పాలనను పటిష్ఠం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవిరామంగా చేస్తున్న ప్రయత్నాలపై వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారనే’అభియోగాన్ని మాపై మోపింది. నాగరిక మర్యాదలు, సాధారణ మానవత, కుల మతాలు, జెండర్ ప్రాతిపదికన ఎవరిపై ఎలాంటి వివక్ష చూపకూడదని నిర్దేశించిన భారత రాజ్యాంగ ఆదర్శాల ఆచరణకై చేసిన విజ్ఞప్తిగా మేము మా లేఖను భావించాము. అయితే మేము ఒక నిశ్చిత ఎజెండాతో పని చేస్తున్నామని, భారత్ ను అస్థిర పరచి చీల్చివేసేందుకు పూనుకున్న శక్తుల కుట్రలు, కుతంత్రాలకు తోడ్పడుతున్నామనే అవివేక ఆరోపణలకు మా విమర్శకులు పాల్పడ్డారు!

మా లేఖకు ఇటువంటి ప్రత్యుత్తరం, అదీ వెన్వెంటనే తీవ్ర విమర్శలతో రావడం నన్నేమీ ఆశ్చర్య పరచలేదు. అపర్ణాసేన్, శ్యామ్ బెనెగళ్ లాంటి వారిని జాతి-వ్యతిరేకులుగా పేర్కొనడం వర్తమాన భారతదేశంలో ప్రజా చర్చలుగా పరిగణింపబడుతున్న వాటి విషపూరిత స్ఫూర్తికి అనుగుణంగానే వున్నది. మరింతగా కలవరపరుస్తున్న విషయమేమిటంటే ఈ ప్రత్యుతరం వచ్చిన వెంటనే ప్రధానమంత్రికి లేఖ రాసిన వారికి వ్యతిరేకంగా నిస్సిగ్గుగా న్యాయపరమైన చర్య చేపట్టడం మరింతగా కలవరపరుస్తోంది. ఆ లేఖపై నాతో పాటు సంతకం చేసిన కొంతమందిపై బిహార్ కోర్టులో నేరపూరిత ఫిర్యాదు దాఖలయింది. భారతీయ శిక్షా స్మృతి (ఐపిసి) లోని 124 ఏ (దేశ ద్రోహం), 153 బి (జాతీయ సమైక్యతకు హానిచేసే ప్రకటనలు), 290 (బహిరంగ గందరగోళం), 297 (మతపరమైన మనో భావాలను దెబ్బ తీయడం) 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం) సెక్షన్లను మా లేఖ ఉల్లంఘించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మన దేశంలో నిష్పక్షపాత, పారదర్శక న్యాయవ్యవస్థ ఉన్నా, పరిణత ప్రజాస్వామ్య దేశాలలో వలే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నా ఇటువంటి పూర్తిగా దురుద్దేశ పూరిత ఫిర్యాదులను న్యాయస్థానాల్లో విచారణకు స్వీకరించరు. దురదృష్టవశాత్తు మన న్యాయవ్యవస్థ పూర్తిగా అపరిపూర్ణమైనది. మన ప్రజాస్వామ్యం అమితంగా లోపభూయిష్టమైనది కావడమే ఇందుకు కారణం. మీడియా వార్తల ప్రకారం ఈ వ్యాసం ప్రచురితమయ్యే రోజునే (ఆగస్టు 3) బిహార్లో ఆ కేసు విచారణకు రానున్నది. విచారణ జరిపే న్యాయమూర్తి ధైర్యం, వివేకం, ప్రజాస్వామ్య స్వభావం కల విజ్ఞుడు అయితే ఆ ఫిర్యాదును తిరస్కరిస్తాడు.

విద్వేష దాడులను అరికట్టాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాసిన వారికి వ్యతిరేకంగా ప్రయోగించిన భారతీయ శిక్షా స్మృతి నిబంధనలను 19 వ శతాబ్దిలో వలసవాద, జాతి వివక్షాపూరిత ప్రభుత్వం రూపొందించింది. ఆ నిబంధనలు ఇప్పటికీ మన చట్టాలలో వుండడం మనకు అవమానకరం. 1922లో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే ఒక పెద్ద మనిషిని ఐపిసి 124–ఏ కింద ఆనాటి వలసపాలకులు నిర్బంధించారు. జైలు నుంచి విడుదలైన తరువాత 124–ఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. భారతీయ శిక్షా స్మృతిలోని ఆ నిబంధన పూర్తిగా న్యాయ విరుద్ధమైనదని గాంధీ అన్నారు. ‘దేశాన్ని దురాక్రమించిన పాలకులు ఆ న్యాయనియమాన్ని ఏర్పరిచారు. ప్రజల మనోభావాలతో అధికారం చెలాయిస్తున్న నిరంకుశ పాలకులు తలచుకున్నప్పుడల్లా దానిని మనపై ప్రయోగిస్తారు’ అని ఆయన విమర్శించారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే ఆయన వాక్ స్వాతంత్ర్యాన్ని వలస పాలకులు అణచివేశారు. 1910లో ఆయన పుస్తకం ‘హింద్ స్వరాజ్’ ను బొంబాయి నౌకాశ్రయంలో కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు. భారత్‌లో ఆ పుస్తకం పంపిణీని నిషేధించారు. ఆ నిషేధాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ గాంధీజీ ఇలా అన్నారు: నా అభిప్రాయంలో ప్రతి మనిషికీ తాను ఇష్టపడే అభిప్రాయాన్ని కలిగివుండే హక్కు ఉన్నది. ఆ అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించేందుకు, అలా వ్యవహరించడంలో ఎవరికీ వ్యతిరేకంగా భౌతిక హింసకు పాల్పడనంతవరకు సదరు అభిప్రాయాన్ని కలిగివుండేందుకు ఆతనికి హక్కు ఉన్నది’

స్వరాజ్యాన్ని సాధించడమంటే ఐపిసి 124 ఏ తదితర అణచివేత చట్టాలను చెత్త బుట్టలోకి పారవేయడమేనని గాంధీజీ, ఇతర జాతీయ వాదులు భావించారు. స్వతంత్ర భారతదేశంలో అటువంటి చట్టాలకు స్థానం వుండకూడదని వారు విశ్వసించారు. విషాదకరమైన విషయమేమిటంటే స్వాతంత్ర్యానంతరం ఆ చట్టాలను రద్దు చేయలేదు. వాటిస్థానంలో మేలైన చట్టాలనూ తీసుకురాలేదు. అవి ఇంకా దేశప్రజల మెడపై వేలాడుతూనే వున్నాయి. అధికారంలో ఉన్నవారికి లొంగిపోయేలా చేసేందుకు వాటిని ఉపయోగించడం జరుగుతూనే ఉన్నది. అటువంటి గర్హనీయమైన ఐపిసి నిబంధనల కిందనే కింది స్థాయి న్యాయస్థానాలలో ప్రముఖ చిత్రకారుడు ఎమ్.ఎఫ్ .హుస్సేన్ కు వ్యతిరేకంగా అనేక కేసులు దాఖలయ్యాయి. మాతృభూమిని విడనాడి పరాయి సీమలలో ఆశ్రయం పొందేలా ఆయన్ని వెంటాడాయి. పుస్తకాలు, సినిమాలను నిషేధించడానికి, అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, పాలక పార్టీ సైద్ధాంతిక వేత్తలు ఈ చట్టాలనే ఉపయోగించుకున్నారు. ప్రధానమంత్రికి చాలా వినయ పూర్వకంగా, పూర్తిగా అహింసాత్మక వైఖరితో లేఖ రాసిన కళాకారులు, మేధావులను పలు విధాల వేధింపులకు గురిచేయడానికి ఈ ఐపిసి నిబంధనలనే ఉపయోగించనున్నారు.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేసేందుకు మిత వాద ప్రభుత్వాలు, మితవాద సైద్ధాంతికవేత్తలు ఈ నిరంకుశ చట్టాలను చురుగ్గా ఉపయోగించుకోవడం కద్దు. అయితే ఇతర పార్టీలు, నాయకులు కూడా ఈ విషయంలో వెనుకబడి లేరు. బెంగాల్‌లో ప్రజాస్వామిక అసమ్మతిని అణచివేసేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇతర రాష్ట్రాలలోని బీజేపీ ముఖ్యమంత్రుల వలే ఈ చట్టాలను ఉపయోగించేందుకు వెనుకాడడం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడంకుళం అణు విద్యుదుత్పాదన కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించిన వారికి వ్యతిరేకంగా ఐపిసి 124–ఏ ని ప్రయోగించారు.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేసేందుకు పార్టీల కతీతంగా మన రాజకీయవేత్తలు అందరూ వలసపాలనాకాలపు చట్టాలను ఉపయోగించడం ఎవరినీ ఆశ్చర్య పరచదు. నిరుత్సాహకరమైన విషయమేమిటంటే ప్రజాస్వామిక స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మరింతగా తగ్గిపోయేందుకు అనుమతించడంలో భారతీయ న్యాయమూర్తులు భాగస్వాములు కావడం. కింది స్థాయి న్యాయస్థానాల జడ్జీలు ప్రచారం నిమిత్తం లేదా ఇతర కారణాల రీత్యా స్వతంత్ర ఆలోచనలను అణచివేసే కపట, కొరగాని పిటీషన్లను విచారణకు స్వీకరించడం జరుగుతోంది. ఉన్నత న్యాయవ్యవస్థ కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు చేయవలసినది చేస్తుందని చెప్పలేని పరిస్థితి వున్నది. 2016లో వలస పాలనా కాలానికి చెందిన ‘నేరపూరిత పరువు నష్టం’ నిబంధనను కొట్టివేయడంలో సుప్రీంకోర్టు విఫలమయింది. భావ స్వేచ్ఛను కాపాడడంలో నిరంతర కృషి చేస్తున్న వారికి సర్వోన్నత న్యాయస్థానం వైఖరి చాలా అసంతృప్తి కలిగించింది. రాజకీయ ప్రత్యర్థులను శిక్షించేందుకై యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు రెండూ కఠోర ఉగ్రవాద నిరోధక చట్టాలను దుర్వినియోగపరచడాన్ని అదుపు చేయలేకపోవడం సుప్రీం కోర్టు చరిత్రలో మరో మాయనిమచ్చ. తన గౌరవాన్ని సముద్ధరించుకోవడానికి సుప్రీం కోర్టుకు ఇంకా కాలం మించి పోలేదు. పౌరుల భావ వ్యక్తీకరణ స్వాతంత్యాన్ని పరిరక్షించడంలో భారత రాజ్యాంగం తనకు నిర్దేశించిన పాత్రను సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ధరించుకోవాలి. గాంధీజీ 1910లో ప్రతిపాదించిన, వర్తమానానికి సవరింపబడిన ఒక ధర్మసూత్రం ఈ విషయంలో సుప్రీం కోర్టుకు మార్గదర్శకం కావాలి: ‘తనకు ఇష్టమైన అభిప్రాయాన్ని కలిగి వుండడానికి ప్రతి పురుషుడు లేదా స్త్రీకి పూర్తి హక్కు ఉన్నది. ఆ అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించేందుకు లేదా అలా వ్యవహరించే క్రమంలో ఎవరికీ వ్యతిరేకంగా భౌతిక హింసను ఉపయోగించనంతవరకు లేదా ఉపయోగించడాన్ని సమర్థించనంతవరకు అతడు లేదా ఆమెకు సదరు అభిప్రాయాన్ని కలిగి వుండేందుకు పూర్తి హక్కు ఉన్నది’. ఈ ధర్మసూత్రాన్ని అన్ని న్యాయస్థానాలు, ప్రభుత్వాలు సక్రమంగా, నిష్పక్షపాతంగా, స్థిరంగా పాటించినప్పుడు మాత్రమే ‘ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ’ అని చెప్పుకొని గర్వించేందుకు భారత్‌కు నైతిక అర్హత చేకూరుతుంది.

 

(వ్యాసకర్త చరిత్రకారుడు)

(Courtacy Andhrajyothi)