• ప్రభుత్వం గొప్పల తిప్పలు
  • వచ్చే డబ్బును వద్దనుకొంటున్న సర్కారు
  • సంక్షేమం పేరుతో అనుచిత పందేరం
  • ఇవ్వాల్సిన చోట నిధులివ్వలేని దుస్థితి
  • కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషణ
  • భూవిక్రయాలు, ఇతర వసూళ్లపై దృష్టి
  • పన్నుల వేటలో నిమగ్నమైన యంత్రాంగం
  • విధానపరమైన లోపాలే సమస్య: నిపుణులు

రైతుకు, రికార్డుకు మధ్య సంబంధం కొనసాగాలంటే భూ శిస్తు వసూలు చేయాలి.
..ఇదీ నిపుణుల సూచన.

ఎకరాకు రూ.5 వేల రైతుబంధు ఇస్తున్నప్పుడు.. భూమి శిస్తు, నీటి తీరువా ఏంటి? దాన్నీ మాఫీ చేస్తున్నాం.
..ఇదీ ప్రభుత్వ నిర్ణయం.

రైతుల భారం తగ్గించేదే. కానీ, వాటి వసూలుతో 170 కోట్ల ఆదాయం వస్తుంది.
హెల్త్‌కార్డు కోసం నెలకు రూ.500 చెల్లించడానికి సిద్ధం.. మాకు మెరుగైన వైద్యం ఇవ్వండి
..ఇదీ ఉద్యోగుల విన్నపం.

పైసా తీసుకోం. వైద్యమంతా ఉచితమే

..ఇదీ ప్రభుత్వ నిర్ణయం.

ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం మంచిదే. కానీ, దానివల్ల భారం దాదాపు రూ.300 కోట్లు. అదేసమయంలో.. వైద్యం చేయడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్న పరిస్థితి!!

పాస్‌ బుక్‌కు రూ.200 చొప్పున వసూలు చేద్దాం… మీసేవలో డబ్బులు కట్టి, పాస్‌పుస్తక ం తీసుకునే వెసులుబాటు కల్పిద్దాం

ఇదీ 2017లో సీసీఎల్‌ఏ సిఫారసు.

రైతులకిచ్చే పాస్‌పుస్తకానికి డబ్బులేందీ… ఉచితంగానే ఇద్దాం

ఇదీ ప్రభుత్వ నిర్ణయం.

రైతులకు మేలు చేసే ఈ నిర్ణయం మంచిదే కావచ్చు. కానీ, దానివల్ల ఖజానాపై దాదాపు రూ.110 కోట్ల భారం.

మాకు 24 గంటల కరెంట్‌ వద్దు.. 9 గంటలు నిరాటం కంగా  కరెంటివ్వండి చాలు.

ఇదీ రైతుల కోరిక.

బరాబర్‌ 24 గంటల కరెంటే ఇస్తాం

ఇదీ ప్రభుత్వ నిర్ణయం.

24 గంటల కరెంట్‌తో డిస్కంలపై రూ.1000 కోట్ల దాకా భారం. భూగర్భ జలాలన్నీ తోడేయడంతో విపరిణామాలు.

ఒకవైపేమో.. వద్దన్నా వరాలు! ప్రజలపై అంతగా భారం పడని.. ప్రజలకు మేలు చేసే అంశాల విషయంలో సంక్షేమం పేరుతో పందేరం!! దాని వల్ల రూ.వేల కోట్ల నష్టం! మరోవైపేమో.. ప్రజలకు ఎంతగానో అవసరమైన పథకాలకు డబ్బులు కేటాయించలేని దుస్థితి!! ఇదీ సర్కారు తీరు. వందలు, వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలు కళ్లముందున్నా కాదనుకుని.. ప్రభుత్వం ఆదాయం కోసం చిల్లరవేట సాగిస్తోంది. అత్యంత ఆవశ్యకమైన ఉచిత విద్య, రైతుబంధు వంటి కీలక పథకాలకు నిధుల్లేక చేతులెత్తేస్తోంది.

హైదరాబాద్‌: సంక్షేమ పథకాలు మంచివే. కానీ.. అవసరం లేని చోట ఇచ్చే వరాల వల్ల అవసరమైన చోట పైసా విదల్చలేని దుస్థితి ఏర్పడుతుందనడానికి నిదర్శనమీ ఉదాహరణలు. ప్రభుత్వ విధానాల్లో సమతౌల్యం లేకపోవడం.. నిధుల వినియోగంలో విధానపరమైన లోపాలు ఈ సమస్యకు కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. విధానాల్లో సమతౌల్యం లేకపోవడానికి, విధాన లోపాలకు ఒక ఉదాహరణ.. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతామంటున్న సర్కారే.. పెన్షన్‌ వయసును 57 ఏళ్లకు తగ్గిస్తామనడం! ఇలా వయో పరిమితి తగ్గించడం వల్ల పడే అదనపు భారం రూ.1500 కోట్లు. ఈ సంక్షేమాల మత్తులో ఉన్న సర్కారు.. నాలుగేళ్ల క్రితం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఉచిత విద్య పథకానికి పైసా ఇవ్వకపోవడం గమనార్హం. ప్రభుత్వం నుంచి నిధులు రాక కాలేజీల అవసరాలకు చాక్‌పీసులు, పేపర్లు, ఇతర చిన్నచిన్న వస్తువులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ‘రైతుబంధు’ పథకంలోనూ సర్కారు మొద్దు నిద్ర పోతోంది. గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా శ్రీకారం చుట్టిన సర్కారు.. ఇప్పుడు నిధుల విడుదలకు ఆపసోపాలు పడుతోంది. ఖరీఫ్‌ బకాయిలు చెల్లించకపోగా.. రబీ నిధుల ఊసు ఎత్తట్లేదు. అవసరం లేని చోట సంక్షేమం పేరుతో పెట్టే ఖర్చును.. ఉచిత విద్య వంటి మంచి పథకాలకు ఉపయోగించడం తెలివైన పని అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

భూముల్లోనే..
తెలంగాణ అవతరణ తర్వాత రాజధానిలో.. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం జిల్లా, డివిజన్‌ కేంద్రాలు తదితర చోట్ల భూముల విలువలు ఆకాశాన్ని అంటాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు వ్యవసాయ భూమి ఎకరం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల లోపే. ఇప్పుడది మారుమూల ప్రాంతాల్లో సైతం రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెరిగింది. దీనిప్రకారం విలువలు సవరించకపోవడంతో నష్టం వస్తోంది. నల్లధనమంతా భూ లావాదేవీల్లోకే చేరుతోంది. ఉదాహరణకు.. భువనగిరిలో రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం గజం భూమి కేవలం రూ.800. మార్కెట్‌ విలువ రూ.12 వేల నుంచి రూ.20 వేల దాకా ఉంది. 200 గజాల భూమిని రూ.20 లక్షల పైగా ధరకు విక్రయించినా.. రూ.1.60 లక్షలకు విక్రయించినట్లు చూపుతూ అంతమేరకే స్టాంప్‌ డ్యూటీ చెల్లిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంతో నష్టం. భూముల విలువలు సవరించాలని 2014 నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ కోరుతున్నా పట్టించుకోని ఫలితంగా ఏకంగా రూ.18 వేల కోట్ల దాకా ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి. రాష్ట్రం రావడానికి ముందు పట్టాదార్‌ పాస్‌పుస్తకం టైటిల్‌ డీడ్‌ కోసం రూ.100 దాకా వసూలు చేసేవారు.

తెలంగాణ వచ్చాక భూరికార్డుల నవీకరణ అనంతరం పాస్‌పుస్తకాల కోసం అత్యాధునిక సాంకేతికత వాడుతూ రూ.139 దాకా ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో పాస్‌ పుస్తకాలకు రూ.200 వసూలు చేయాలని ప్రతిపాదిస్తే ప్రభుత్వం బేఖాతరు చేసింది. దీనివల్ల ముద్రణకు నిధుల విడుదల కష్టంగా మారుతోంది. పలు ఇతర పథకాలదీ ఇదే పరిస్థితి. ఉదయ్‌ ఒప్పందంలో చేరినప్పుడు కేంద్రం పెట్టిన కరెంటు చార్జీల హేతుబద్ధీకరణకు రాష్ట్రం ఒప్పుకోలేదు. దీనివల్ల మూడేళ్లుగా ఏటా రూ.3 కోట్ల లోటుతో డిస్కమ్‌లు సంక్షోభంలో పడ్డాయి. నల్లా కనెక్షన్‌కు నెలకు రూ.100 కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం ఉచితంగా ఇస్తుండడంతో రూ.720 కోట్ల నష్టం. డీజిల్‌, లూబ్రికెంట్ల ధరలు పెరుగుతున్నాయి. చార్జీల హేతుబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ విజ్ఞప్తిచేస్తే.. చార్జీలు పెంచక్కర్లేదని, నష్టాలను తానే భరిస్తానని ప్రభుత్వం పేర్కొంది. దానివల్ల ఆర్టీసీ రూ.3 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఆదాయం వచ్చే మార్గాలను వదులుకుంటున్న సర్కారు.. ఏయే మార్గాల్లో పన్నులు ఆగిపోయాయో వెతకాలని ఆదేశాలు ఇస్తుండటంతో యంత్రాంగమంతా పన్నుల వేటలో నిమగ్నమైంది.

ఇప్పటికైనా..
ఆదాయం పెంపు పై నాలుగేళ్ల కిందట వాణిజ్య పన్నులు, రవాణా, మైనింగ్‌, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు, నిపుణుల సమావేశం రోజంతా జరిగింది. ఏయే కారణాల వల్ల ఎంత మేర ఆదాయం కోల్పోతున్నామో తేల్చి ఆ భేటీలో బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశానికి అప్పటి ఆర్థిక శాఖ ఈటల రాజేందర్‌ కూడా హాజరుకాగా, ప్రస్తుత ఎక్సైజ్‌ శాఖ మంత్రి, అప్పటి టీజీవోల నాయకుడు శ్రీనివా్‌సగౌడ్‌ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో వ్యక్తమైన అన్ని అంశాలతో నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఖజానా వట్టిపోయిన సమయంలోనైనా దీనిపై దృష్టి సారిస్తే… రాష్ట్రానికి మేలు జరుగుతుందని పలువురు సూచిస్తున్నారు.

వస్తాయన్నా పట్టించుకోని నిధులు
పథకం నిధులు
పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు 110కోట్లు
భూమిశిస్తు, నీటి తీరువా 170కోట్లు
ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ 300కోట్లు
నల్లా కనెక్షన్ల రుసుము’ 720కోట్లు
ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ 300కోట్లు
భూముల విలువల సవరణ 3000కోట్లు

అడగకున్నా ఇస్తున్న నిధులు
పథకం ప్రభావం నిధులు
వృద్ధాప్య పింఛను
(వయసు తగ్గింపు) 8 లక్షల మంది(కొత్తగా) 1,500
రైతు రుణమాఫీ 58 లక్షల కమతాలు 32,000
రైతుబంధు 58 లక్షల కమతాలు 13,920
24 గంటల కరెంట్‌ 58 లక్షల కమతాలు 1,000
గొర్రెల పంపిణీ 7.5 లక్షలు 4,000

కచ్చితంగా ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వని నిధులు
పథకం ప్రభావం నిధులు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 14 లక్షల మంది 4,000
ఆర్టీసీకి సహాయం కోటి మందికి రవాణా 3,000
డిస్కమ్‌లు 3.5 కోట్ల మంది 12,000
ఆరోగ్యశ్రీ 85 లక్షల కుటుంబాలు 500
ఎంప్లాయీస్‌ హెల్త్‌స్కీమ్‌ 12 లక్షల మంది 200
కేసీఆర్‌ కిట్‌ 3 లక్షల మంది గర్భిణులు 165
విత్తన సబ్సిడీ 58 లక్షల కమతాలు 54.84
పాఠశాలల అభివృద్ధికి 26 లక్షల విద్యార్థులు 500
పంటల బీమా 58 లక్షల కమతాలు 42
వడ్డీలేని రుణాలు 58 లక్షల కమతాలు 1,300

Courtesy Andhrajyothy..