ప్రభాత్‌ పట్నాయక్‌

రైతాంగంలో పెల్లుబికిన నిరసనతో ప్రభుత్వం ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ (ఆర్‌సిఇపి) నుంచి ఉపసంహరించుకున్న తరువాత ఒక వాదన ముందుకు వచ్చింది. ‘వివిధ రకాల వస్తువుల ఉత్పత్తిలో ఒకవేళ భారతదేశం ఇతర దేశాలతో పోటీ పడలేకపోతే వాటిని ఎందుకు ఉత్పత్తి చేస్తూ పోవాలి? అందుకే కదా దేశం లోని అటువంటి వస్తువులను ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది’. దానికి సంబంధించిన మరో వాదన ఇలా వుంది. ‘పోటీ పడలేని ఉత్పత్తిదారులను రక్షించటానికి దేశం వినియోగదారులను శిక్షిస్తోంది. అలా జరగకపోతే వినియోగదారులకు చౌకగా దిగుమతి అయ్యే వస్తువులు అందుబాటులో ఉండేవి కదా. ఇది అన్యాయం కదూ?’. మొదటి ప్రశ్నకు తక్షణమే ఇచ్చే స్పష్టమైన సమాధానం (రెండవ ప్రశ్నకు తరువాత వద్దాం) ఏమంటే…ధరల రూపంలో కనపడే పోటీతత్వం సాధారణంగా విదేశీ మార్కెట్లను కైవసం చేసుకోవటానికి పన్నిన వాణిజ్య వ్యూహం అయివుంటుంది. సబ్సిడీలు, మారకపు రేటును కృత్రిమంగా తక్కువగా ఉంచటం వంటి మార్గాలలో ఇది జరుగుతుంది. వ్యవసాయ రంగంలో ఇది ఉంటుంది. ఆర్‌సిఇపి ఒప్పందంలో భాగంకాని ఐరోపా, అమెరికాలలో వ్యవసాయానికి విపరీతంగా సబ్సిడీలు ఇస్తుంటారు. కాబట్టి ధరలలో పోటీతత్వం అనే భావన తప్పుతోవ పట్టించేదిగా ఉంటుంది. ఒక దేశం లోని ధరల పోటీతత్వం ఆ దేశ విత్త, మారకపు విధానాలకు అనుగుణంగా ఉంటుంది. విదేశీ ప్రభుత్వాలు అందించే సబ్సిడీలతో దిగుమతి అయ్యే సరుకులతో పోటీ పడటానికి భారతీయ ఉత్పత్తిదారులను ‘మార్కెట్‌’ దయాదాక్షిణ్యాలకు వదిలి వేయటం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. అంతేకాకుండా అదనంగా దీనిలో చర్చించవలసిన నియమాన్ని చర్చించటంలేదు. స్వేచ్ఛా వాణిజ్యానికి అనుకూలంగా చేసే వాదన బూటకం అనే వాస్తవానికి సంబంధించినది ఈ నియమం. స్వేచ్ఛా వాణిజ్యానికి సిద్ధంగా వున్న ఆర్థిక వ్యవస్థలన్నీ పూర్ణ ఉద్యోగ సమతౌల్యత (శ్రామికులతో సహా వనరులన్నీ పూర్తి స్థాయిలో వినియోగించబడతాయి) స్థాయికి చేరుకుంటాయనే ఊహ ఉంటుంది. వేరే మాటల్లో చెప్పాలంటే…స్వేచ్ఛా వాణిజ్యం వల్ల నిరుద్యోగం ఏర్పడదనే ఊహ ఆధారంగా ‘స్వేచ్ఛా వాణిజ్యం అవసరం’ అనే వాదన ఉంటుంది. ఈ ప్రాతిపదికన చేసే వాదన…ఆధునిక సామూహిక దారిద్య్రానికి కారణభూతమైన వలస పాలన నాటి పారిశ్రామిక విధ్వంసాన్ని మనకు గుర్తుచేస్తుంది.

ఒక వేళ మొత్తం ప్రపంచంలో గానీ లేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగల దేశాల గ్రూపులో గానీ సమిష్టి డిమాండ్‌ను అన్ని దేశాల వనరులన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగం లోకి వచ్చే దాకా పెంచగలిగితే నిరుద్యోగం వుండదు. కనిష్ట స్థాయిలో శ్రామిక నిరుద్యోగ సైన్యాన్ని ఉంచగలిగే అధికార యంత్రాంగం ఉన్నట్టయితే అప్పుడు నిరుద్యోగం కనిష్ట స్థాయికి మించి ఉండదు. కానీ డిమాండ్‌ కొరత లేకుండా చేసే అధికార యంత్రాంగం ఏదీ లేదు. కాబట్టి శ్రామిక రిజర్వ్‌ సైన్యంతో పాటు ఎల్లవేళలా నిరుద్యోగం ఉంటుంది. ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ నిరుద్యోగాన్ని కొన్ని దేశాల నుంచి మరికొన్ని దేశాలకు బదిలీ చేస్తుంది. మనం కాసేపు వివిధ దేశాల మధ్య ఉండే ధరల సంబంధమైన పోటీతత్వం డంపింగ్‌ లేక సబ్సిడీలతో ప్రమేయం లేకుండా అమలులో వున్న మారకపు రేట్లు, నగదు వేతనాల రూపంలో శ్రామిక ఉత్పాదకత ఉందనుకున్నాం. అయినా సరే…తక్కువ ఉత్పాదకతగల దేశాల లోని చాలా మంది కార్మికులను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిరుద్యోగులుగా మారుస్తుంది.

ఇక్కడ తక్షణమే రెండు ప్రశ్నలు ఉదయిస్తాయి. మొదటిది-తక్కువ ఉత్పాదకతగల దేశం పోటీలో నిలిచే సామర్థ్యం పెరిగే దాకా, దానితో నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకునే దాకా తన మారకపు రేటును ఎందుకు తగ్గించుకోలేకపోతోంది? మారకపు రేటు తగ్గించుకోవటంతో నిజ వేతనం రేటు తగ్గుతుంది కాబట్టి ఇలా సూచించటం అంటే తక్కువ ఉత్పాదకతగల దేశాన్ని నిజ వేతనాలను తనకు అనుకూలమైన రీతిలో తగ్గించుకుని, ‘పోటీలో నిలిచి’ సామూహిక నిరుద్యోగిత ఏర్పడకుండా చూసుకోమని చెప్పటమే అవుతుంది. అయితే ఇది సరైన ఆలోచన కాదు. దేశంలో నిజ వేతనాలను తగ్గించటం జరిగితే దేశాలన్నింటినీ కలిపి చూచినప్పుడు సమిష్టి డిమాండ్‌ పెరగదు. కాబట్టి మారకపు రేటును తగ్గించటం వల్ల ఒక దేశ సరిహద్దు లోపల నిరుద్యోగం తరిగి మరో చోట పెరుగుతుంది. అంటే ఇది నిరుద్యోగితను ‘ఎగుమతి’ చేస్తుంది. అయితే అటువంటి ‘ఎగుమతి’ కారణంగా మిగిలిన దేశాల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. అంటే అన్ని దేశాలూ ఒక మారకపు రేటు యుద్ధంలో పాల్గొంటాయి. పర్యవసానంగా నిజ వేతనాలు బాగా కుదింపబడతాయి. కాబట్టి ఏ దేశంలోనైనా స్వేచ్ఛా వాణిజ్యంతో ఉద్భవించే నిరుద్యోగ సమస్యకు ఇది పరిష్కారం కాజాలదు. అంతేకాకుండా ఫైనాన్స్‌ పెట్టుబడి ఆధిపత్యం వల్ల…మారకపు రేటు కుదింపు, అలా కుదించాలనే ఆకాంక్ష ద్రవ్య పెట్టుబడి దేశాన్ని వీడేలా చేస్తుంది. అది తీవ్ర స్థాయి అస్థిరతకు దారితీస్తుంది. కాబట్టి మారకపు రేటును కుదించటం స్వేచ్ఛా వాణిజ్యంతో ఉద్భవించే నిరుద్యోగితను పరిష్కరించటానికి మార్గం కాదు.

కానీ ఇక్కడ రెండవ ప్రశ్న ఉదయిస్తుంది. అధిక వ్యయంతో ఉత్పత్తి చేసేవారిని స్వేచ్ఛా వాణిజ్యంతో తొలగించాలనుకోవటంలో తప్పేముంది? అని అడగవచ్చు. ఎందుకంటే ఉత్పత్తి వ్యయం అధికం కాబట్టి వారికి ఉత్పత్తిలో కొనసాగే అర్హత లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభం. ఒకవేళ కొన్ని కార్యకలాపాలను ఆపటం వల్ల వారిని వేరే చోట ఇతర కార్యకలాపాలలో భాగం చేస్తే అటువంటి తొలగింపు పట్ల ఆందోళన చెందనవసరం లేదు. కానీ ఇది జరగబోదు కాబట్టి నిరుద్యోగితను సృష్టించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలి అనటానికి అవసరమైన వాదన ఏదీ అందుబాటులో ఉండదు. వేరేమాటల్లో చెప్పాలంటే ఉద్యోగితకు కావలసిన విధంగా ఏ దేశమైనా అటువంటి వాణిజ్య నిబంధనలను అనివార్యంగా విధించవలసిందే. ఉత్పత్తిదారులు అటువంటి నిర్బంధాలను విధించమని కోరటం పూర్తిగా న్యాయమే.

చూచీ చూడగానే ఇది…అత్యంత సమర్థవంతంగా ఉత్పత్తి చేయగలిగితేనే అనుమతించాలనే వాదనకు వ్యతిరేకమైనదిగా అనిపిస్తుంది. కానీ ‘సామర్థ్యం’ వాదన కేవలం ఈ అర్థంలో మాత్రమే చెల్లుతుంది. ఒకవేళ ఒక దేశం అందుబాటులో వున్న అన్ని వనరులనూ ఉపయోగించుకుంటూ కొన్ని వస్తువుల తయారీలో మాత్రమే ప్రావీణ్యతను సంపాదించి, మరికొన్ని వస్తువుల ఉత్పత్తిని నిలిపివేసి దిగుమతి చేసుకోవటం ద్వారా అనేక వస్తువులను అందుబాటులోకి తెచ్చుకోవాలనుకుంటే అలా చేయవచ్చు. వేరేమాటల్లో చెప్పాలంటే ‘సామర్థ్యం’ వాదన అన్ని వనరులనూ పూర్తిగా వాడుకుంటారని భావిస్తుంది. ఇది జరగకపోతే అనేక ఉత్పత్తి కార్యకలాపాలను ‘సామర్థ్యం’ ప్రాతిపదికన నిలిపివేయటం మతి లేని పని అవుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అధిక వ్యయంతో ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించే ఒక గ్రూపును మనగలిగేలా చేయటం కోసం దిగుమతులను నిలిపివేసి వినియోగదారు లను ఎక్కువ నగదును చెల్లించమని ఎందుకు అడగాలి? అయితే చూడగా సరియైనదే అనిపించే ఈ వాదన ఉత్పత్తిదారులు, వినియోగదారులు అనే కృత్రిమ విభజనపై ఆధారపడి వుంది. చౌక దిగుమతుల కారణంగా కార్మికుల, కర్షకుల గ్రూపు ఒకటి తమ ఆదాయాన్ని కోల్పోయినప్పుడు కూడా ఈ చౌక దిగుమతుల కారణంగా కొందరు వినియోగదారులు లాభపడతారని ఈ వాదన చెబుతుంది. వేరేవిధంగా చెప్పాలంటే స్వేచ్ఛా వాణిజ్యం వల్ల ఉత్పత్తిదారుల ఆదాయం పడిపోతే వినిమయదారులు ప్రభావితం కారని ఈ వాదన భావిస్తుంది.

అయితే ఇది తప్పు. ఆదాయం తగ్గిన ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఒకటి కానప్పటికీ ఉత్పత్తిదారుల ఆదాయం తగ్గితే వినియోగదారుల ఆదాయం కూడా తగ్గుతుంది. కొంతమంది ఉత్పత్తిదారుల తొలగింపు కారణంగా ఏర్పడే స్థూల ఆర్థిక పర్యవసానాల వల్ల ఇలా జరుగుతుంది. వలస పాలన లోని భారతదేశ ఉదాహరణతో ఇది స్పష్టమౌతుంది. బ్రిటన్‌ నుంచి యంత్రాలపై తయారైన చౌక వస్తువుల దిగుమతితో చేతివృత్తులు నాశనం అయ్యాయి. చేతివృత్తుల వారి తొలగింపుతో ప్రభావితం కాని రైతులకు వస్తువులు చౌకగా లభిస్తున్నాయనిపించింది. ఇది నిరుద్యోగాన్ని, సామూహిక దారిద్య్రాన్ని సృష్టించింది. కానీ కొద్ది కాలంలోనే తొలగించబడిన చేతివృత్తుల పనివారు గ్రామీణ మార్కెట్‌ను ముంచెత్తటంతో నిజ వేతనాలు పడిపోయాయి. కౌలు పెరిగింది. అప్పటిదాకా దిగుమతులతో లాభం జరిగిందను కుంటున్న రైతుల ఆదాయం కూడా దెబ్బ తింది. కాబట్టి పారిశ్రామిక విధ్వంసం ప్రభావంతో కష్టజీవులందరూ దెబ్బ తిన్నారు. వలస పాలనలో జరిగిన పారిశ్రామిక విధ్వంసం వల్ల బ్రిటిష్‌ పాలనకు వత్తాసు పలికిన ఒక చిన్న భూస్వామ్య వర్గం మాత్రమే లాభపడింది. కాబట్టి నిరుద్యోగాన్ని సృష్టించే, రైతాంగ ఆదాయాన్ని కుదించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మద్దతు ఇవ్వటం ఎటువంటి పరిస్థితుల లోనూ సమర్థనీయం కాదు. ఆర్‌సిఇపి నుంచి బయటకు రావాలని ప్రజలు డిమాండ్‌ చేయటం న్యాయమే. పూర్ణ ఉద్యోగిత అనేది ఒక దుస్సాధ్యమైన స్వప్నం అనేటంతగా దేశం లోని వర్తమాన మేధో ప్రవచనంపై పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధిపత్యం ఉంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలో పూర్ణ ఉద్యోగిత ఉండేది. అంతే కాకుండా ఆ ఆర్థిక వ్యవస్థలలో శ్రామికుల కొరత కూడా ఉండేదన్న విషయాన్ని మరచిపోతున్నారు.

వాస్తవంలో కొందరు వ్యక్తుల సమూహం ఒకవేళ తమ పెట్టుబడితో తాము ఉత్పత్తి చేసింది తామే వినిమయం చేసుకుంటే నిరుద్యోగిత ఉండదు. అదే సమూహం లోని కొందరు ఉత్పత్తి చేసినదానిని మరికొందరు కొనకుండా, ఆ సమూహానికి బయట వారు సదరు సమూహం ఉత్పత్తి చేసింది కొనటానికి ఇష్టపడనప్పటికీ, ఆ సమూహానికి బయట వారు ఉత్పత్తి చేసింది కొనదలచినప్పుడు నిరుద్యోగం ఏర్పడుతుంది. ఆర్‌సిఇపి ఒప్పందంలో భాగమై వుంటే ఏ నిరుద్యోగమైతే ఉత్పన్నం అయ్యేదో ఆ నిరుద్యోగాన్ని అడ్డుకుని తీరాలి.

(Courtesy Prajashakti)