-శాశ్వత పరిష్కార మార్గాలను వెతకాలి
-రోజువారి తిండికయ్యే ఖర్చు కంటే కార్మికుడి సంపాదన తక్కువ
– సామాజిక, ఆరోగ్య నిపుణుల ఆందోళన

న్యూఢిల్లీ : దేశంలో ఉచిత రేషన్‌ పంపిణీని జులై నుంచి నవంబర్‌ వరకు మరో ఐదు నెలల వరకు కేంద్రం పొడిగించింది. ఈ పథకం ద్వారా పేదలకు తిండి గింజలు లభించినంత మాత్రానా దేశంలో ఆకలి బాధ, పోషకాహార లోపం వంటి సమస్యలు తీరినట్టు కాదని ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఉచిత రేషన్‌ సర్వరోగనివారణి కాదని చెప్తున్నారు. కేంద్రం ఉచిత రేషన్‌ పథకాన్ని తక్కువ అంచనా వేయకపోతే.. దానిని అతిగా అంచనా వేయాల్సినవసరం లేదని అభిప్రాయ పడుతున్నారు.

ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తల వెల్లడిస్తున్న అంశాల ప్రకారం.. గతంలో ఆహార రాయితీ ప్రయోజనకర ప్రభావం తరచూ అతిగా అంచనా వేయబడింది. మార్కెట్‌ రేటు కిలోకు రూ. 30కి బదులుగా రూ.2 చొప్పున గోధుమలు లేదా బియ్యం అందించడంలో గణనీయమైన రాయితీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే నెలలో 12 రోజులు మాత్రమే సబ్సిడీ ధాన్యం అందిస్తే.. మిగిలిన 18 రోజులు రేషన్‌ను మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయాలి. అయితే వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. పేదోడికి అందాల్సిన రేషన్‌ కూడా సరిగ్గా అందడం లేదు. దీంతో లబ్దిదారుడు, వారి కుటుంబం ఆకలి బాధలను ఎదుర్కొంటున్నదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఇది పక్కన పెడితే.. పోషకాహారం, సమతుల్యతాహారం వారికి అందడం గగనమే అని వివరించారు.

ఎటువంటి సబ్సిడీ లేకుండా ఐదుగురు సభ్యుల సగటు శ్రామిక తరగతి శాఖాహార కుటుంబానికి ఒకరోజుకు అయ్యే ఆహార బడ్జెట్‌ అంచనా ప్రకారం దాదాపు రూ. 360గా(ఇంధన ఖర్చులు మినహాయించి) ఉంటుంది. ఇదే ప్రాతిపాదికన లెక్కిస్తే మాంసాహార ఇంటి రోజువారీ ఆహారబడ్జెట్‌ దీని కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది.

రేషన్‌లోనూ లొసుగులు..!
ఉచిత రేషన్‌ అనేది రేషన్‌ కార్డు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. కానీ, దేశంలో చాలా మంది పేదలకు వివిధ కారణాలతో రేషన్‌ కార్డును పొందలేకపోయారు. అలాంటి వారి పరిస్థితపై ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరం. అలాగే ఒక కుటుంబానికి రేషన్‌ కార్డు ఉన్నప్పటికీ.. లిస్టెడ్‌ చేయబడిన వారికి మాత్రమే సబ్సిడీ లభిస్తుంది.

అనేక రాష్ట్రాల్లో బయోమెట్రిక్‌ ప్రక్రియ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఫలితంగా అర్హులైన లబ్దిదారులెందరో రేషన్‌ పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని సార్లు రేషన్‌ సరఫరాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. రేషన్‌ డీలర్లు కాసులకు కక్కుర్తిపడి సరుకులను పక్కదారి పట్టించడంతో వ్యవస్థ అవినీతిమయంగా మారుతోంది. ఈ విషయంలో అధికారులు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ పరోక్షంగా పేదోడి నడ్డి విరుస్తున్నాయి.

శ్రామిక తరగతి ప్రజల తక్కువ, ఇటీవల తగ్గిన ఆదాయాలను, ప్రతికూల పరిస్థితులతో బాధపడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు పరిష్కార మార్గాలు వెతకాలని ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు. పేదల ఆకలి కష్టాలను ప్రచార, రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించాలనీ, ఈ సమస్యలను తగ్గించడానికి విస్తృత ప్రయత్నాలకు ఇంకా అధిక ప్రాధాన్యతనిస్తూనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారు సూచిస్తున్నారు. ఇందుకు శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొంటే శ్రేయస్కరమని అభిప్రాయపడుతున్నారు.

కార్మికుల సంపాదన అంతంతే…
వాస్తవానికి ఆహార బడ్జెట్‌.. మిగతా అవసరాలకు సంబంధించిన మొత్తం బడ్జెట్‌లో ఒక భాగం మాత్రమే. అయితే గ్రామాలు, మురికివాడలలో నివసించేవారిలో అధికశాతం మందికి వేతనం, ఆదాయం గురించి భరోసా లేదనే విషయాన్ని గమనించాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. ఒక ఉపాధి హామీ కార్మికుడు, వ్యవసాయ, భవన నిర్మాణ కార్మికుడు అనేక రాష్ట్రాలలో ఆహార బడ్జెట్‌ కంటే తక్కువగానే సంపాదిస్తాడు. కానీ, వారికి ఉపాధి మాత్రం నెలలో 15 రోజులు లేదా అంతకంటే తక్కువ మాత్రమే లభిస్తుంది. ఈ కారణంగా వారు తగిన తిండిని పొందలేక, పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ కలిసి ఉన్నప్పుడు గృహ ఆదాయం పెరిగినప్పటికీ.. మహిళా కార్మికుల వేతనాలకు సంబంధించి ఎలాంటి హేతుబద్దమైన ఆధారం లేకుండా తక్కువగా ఉంటాయి. దీనిలో శ్రమదోపిడీ కూడా ఉంటుంది.

Courtesy Nava Telangana