• మల్లారెడ్డి, కామినేని, మమత ఎంపిక
  • 98 ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతి
  • ‘ప్రైవేటు’పై ఫిర్యాదులకు వాట్సాప్‌ నెంబరు
  • పడకల వివరాలు తెలిసేలా డ్యాష్‌బోర్డు
  • ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు
  • హోంఐసోలేషన్‌కు 1800-599-4455
  • కొవిడ్‌ రోగుల ఆహార చార్జీల పెంపు
  • హైదరాబాద్‌లో రూ. .. జిల్లాల్లో 200
  • ‘గాంధీ’లో నాలుగో తరగతి సిబ్బంది సమ్మె
  • పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులూ
  • 5వ రోజూ ఔట్‌సోర్సింగ్‌ నర్సుల ఆందోళన

హైదరాబాద్‌ : ప్రైవేటు వైద్య కళాశాలల్లో కరోనాకు ఉచిత చికిత్స అందజేస్తామని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలసి మాట్లాడారు. ఉచిత చికిత్సకు తొలుత మల్లారెడ్డి, కామినేని, మమత మెడికల్‌ కాలేజీలను ఎంపిక చేశామన్నారు. ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బెడ్ల వివరాలు తెలిసేలా ఒక డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 65.48 శాతంగా ఉందని ఆయన వివరించారు. దేశంలో కరోనా మరణాలు రేటు 2.7ు కాగా.. రాష్ట్రంలో ఒక్కశాతంగా ఉందన్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల వల్ల  కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 10 రోజులుగా కరోనా పరీక్షలను పెంచామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 25వేల రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించామన్నారు.

గ్రేటర్‌లో 98 ఆస్పత్రులకు అనుమతి
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 98 ప్రైవేట్‌ ఆస్పత్రులకు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చామని, అందులో 54 ఆస్పత్రులు ఇప్పటికే చికిత్సను అందిస్తున్నాయని గడల శ్రీనివాసరావు 1తెలిపారు. వాటిల్లో 8,834 పడకలు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం 1,800 మంది కరోనా రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. కరోనా రోగులను ఆస్పత్రులకు తరలించేందుకు 90 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని, అందులో 60 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయన్నారు.

హోం ఐసోలేషన్‌లో 9,786 మంది
రాష్ట్రంలో ప్రస్తుతం 9,786 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారని, వారికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నామని శ్రీనివాసరావు తెలిపారు. వాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి టెలిమెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, టోల్‌ఫ్రీ నంబర్‌ 180059912345కు కాల్‌ చేయాలని సూచించారు.

నాన్‌-కొవిడ్‌ రోగులకు భయం వద్దు: రమేశ్‌రెడ్డి
కరోనా నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురికావొద్దని వైద్యవిద్యా సంచాలకులు రమేశ్‌రెడ్డి అన్నారు. కరోనా రోగులకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో ఇతర రోగులు చికిత్స రావాలంటే జంకుతున్నారని తెలిపారు. నాన్‌కోవిడ్‌ రోగులు నిర్భయంగా చికిత్స పొందవచ్చని, ఎలాంటి భయం అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు.

‘ప్రైవేటు’పై ఫిర్యాదుకు వాట్సాప్‌ నంబర్‌
ప్రైవేటు ఆస్పత్రులపై ఫిర్యాదులకు రెండు మూడు రోజుల్లో వాట్సప్‌ నంబరును అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రజారోగ్య విభాగం సంచాలకుడు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగుల నుంచి అధిక ఫీజులు వసూళ్లను నియంత్రిస్తామన్నారు. వాట్సాప్‌ నంబర్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను డీఎంహెచ్‌వోలకు పంపిస్తామని వివరించారు. అధిక ఫీజులు వసూలు చేయడంపై ఇప్పటికే కొన్ని ఫిర్యాదులను వచ్చాయని, వాటిని పరిశీలించి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు.

హోం ఐసోలేషన్‌కు టోల్‌ఫ్రీ: ఈటల
హోం ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌-19 రోగులకు టెలీమెడిసిన్‌ సేవలను అందజేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు వైద్య సేవల కోసం, ఇతర సలహాలకు 1800-599-4455 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు.

Courtesy Andhrajyothi