మార్లే డయాస్‌… 14 ఏండ్ల ఆఫ్రో అమెరికన్‌ బాలిక. పదేండ్లంటే.. ఆడిపాడే వయసు. ఆ సమయంలోనే తన రంగుపట్ల ఉన్న వివక్షను గుర్తించగలిగింది. ఆమె చదివే పాఠ్యపుస్తకాలన్నింటిలో తెలుపు రంగులో ఉండే అబ్బాయిలు, వాళ్లు పెంచుకునే కుక్కల బొమ్మలే. దాంతో వాటిని ఎప్పుడూ ఓన్‌ చేసుకోలేకపోయింది. అదే విషయాన్ని తల్లికి ఫిర్యాదు చేసింది. అంతేకాదు… బ్లాక్‌గాళ్స్‌ గురించి, వాళ్ల చిత్రాలతో వచ్చిన పుస్తకాలనే చదవాలనుకుంది. స్లాష్‌1000బ్లాక్‌గాళ్‌బుక్స్‌ పేరుతో క్యాంపెయిన్‌ ప్రారంభించింది. బ్లాక్‌గాళ్స్‌ ప్రధాన పాత్రధారులుగా ఉన్న వెయ్యి పుస్తకాలను సేకరించింది. వాటిని తిరిగి ఇతరులకు ఇచ్చి చదివించింది. అంతేకాదు… న్యూజెర్సీలో చట్టసభల ప్రతినిధులను, విద్యావేత్తలను కలిసింది. తమ జీవితాలే నిండి ఉన్న బ్లాక్‌గాళ్‌ పుస్తకాలను ఇస్తూ సమస్యను వివరించింది. ఆ పుస్తకాల సంఖ్యను మరింత పెంచడం, వాటిని అందరికీ పంచడం గురించి కూడా చర్చించింది. 2016లో క్యాంపెయిన్‌ మొదలుపెట్టిన మార్లే.. 12వేల పుస్తకాలను సేకరించింది. వైట్‌హౌజ్‌లో ఓ రీడింగ్‌ పార్టీని ఏర్పాటు చేసి, ఓఫ్రా విన్‌ఫ్రేతో వేదికను పంచుకుంది. కేవలం పుస్తకాలను సేకరించడం, ఇతరులకు అందించడమే కాదు… పదేండ్ల వయసులో తానే ఓ పుస్తకాన్ని రాసింది. ఆత్మకథ లాంటి ఆ పుస్తకం పేరు ‘మార్లే డయాస్‌ గెట్స్‌ ఇట్‌ డన్‌-అండ్‌ సో కెన్‌ యూ!’. 2017లో వచ్చిన ఈ పుస్తకం సామాజికన్యాయం, అన్ని వర్గాలను కలుపుకొనిపోవడం, సామాజిక మాధ్యమాలను మంచి కోసం ఉపయోగించడం వంటి ఎన్నో అంశాలను చర్చించింది. అలాగే పుస్తక అధ్యయనం ప్రాముఖ్యతను కూడా యువతకు వివరిస్తుంది.
మార్లే తల్లి జాన్సన్‌ డయాస్‌ గ్రాస్‌రూట్స్‌ అనే కమ్యూనిటీ ఫౌండేషన్‌ను స్థాపించింది. ఇది ముఖ్యంగా మహిళల ఆరోగ్యం గురించి పనిచేస్తుంది. ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడిన ఇళ్లలోని మహిళల ఆరోగ్యం మీద దృష్టి సారించి పనిచేస్తుంది. పిల్లల మనసుల్లోని ఆలోచనలు కార్యరూపం దాల్చేలా చేయడమే తల్లిదండ్రుల బాధ్యతని చెప్పే జాన్సన్‌.. కూతురికి అంతే సహకారమందిస్తుంది. తల్లి ప్రోత్సాహంతో తాను అనుకున్న మార్గంలో ప్రయాణిస్తున్న మార్లే.. ‘మనం అన్యాయమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. కాబట్టి కచ్చితంగా పోరాడాల్సిందే’ నంటుంది.11 ఏండ్లకే 30 అండర్‌ 30 ఫోర్బ్స్‌ జాబితాలో నిలిచింది మార్లే.

Courtesy Navatelangana….