ట్రెజరీ దాటని నిధులు
భరోసానిచ్చే మహిళా కమిషన్‌ లేదు
అవగాహన కల్పించాలన్నా పైసల్లేని దుస్థితి
మహిళా, శిశు సంక్షేమశాఖలో పరిస్థితిదీ

దూరమవుతున్న భద్రత

సంక్షేమశాఖలో చిన్నారులు, మహిళల భద్రత, రక్షణకు నిధుల్లేకపోవడంతో లైంగిక వేధింపులు, అత్యాచారాల బాధితులకు పునరావాసం కరవైంది. గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థల్లో చిన్నారులు, మహిళలకు తమను తాము రక్షించుకునేందుకు కనీస అవగాహన కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. బడ్జెట్‌లో భారీగా నిధులు పేర్కొన్నా ఈ ఏడాదిలో ఒక్కరూపాయి ఇవ్వలేదు. నిధుల విడుదల ఉత్తర్వులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. చివరకు భరోసా కేంద్రాల్లోని సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలకు నిధుల్లేవు. న్యాయ సహాయం కోసం వచ్చిన బాధితులకు టీ, బిస్కెట్లు కూడా కరవయ్యాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో చిన్నారులు, మహిళలకు భరోసా కల్పించే చర్యలను మహిళా సంక్షేమశాఖ చేపట్టలేకపోతోంది.

దూరమవుతున్న భద్రత

ఇవీ సమస్యలు…
చిన్నారులు, మహిళల భద్రతకు 14 పథకాలు ఉన్నాయి. ఇందులో మహిళలు, చిన్నారుల భద్రత, పునరావాసం, భరోసా కేంద్రాలు, తెలంగాణ షీబాక్స్‌, చిన్నారుల స్నేహపూర్వక న్యాయస్థానాలు, ప్రజ్వల కేంద్రాలు, 181 సహాయ కేంద్రం తదితరాలు కీలకం. ఈ పథకాలను సమగ్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఏటా నిధులు సమకూర్చాల్సి ఉన్నప్పటికీ ఆ మేరకు చేయలేదు.

* వేధింపులు, దాడుల నుంచి బాధితులను రక్షించి న్యాయసహాయం చేస్తున్న భరోసా కేంద్రాలకు రూ.కోట్లు పేర్కొన్నా విడుదల చేయలేదు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా వేతనాల్లేకపోవడంతో సెలవులో వెళ్లాలని నిర్ణయించారు.

* పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపులను నిరోధించేందుకు 5 వేల ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలను ఒకేగొడుగు కిందకు తీసుకువచ్చేలా తెలంగాణ షీబాక్సు ఏర్పాటు చేయాలని ఏడాది క్రితం సంక్షేమశాఖ నిర్ణయించింది. నిధుల్లేక ప్రాజెక్టు పూర్తికాలేదు. పనిప్రదేశాల్లో యువతులు, మహిళలకు భద్రత దూరమవుతోంది.

* తెలంగాణ మహిళా కమిషన్‌ ఏర్పాటు కాలేదు. గతంలో పనిచేసిన ఛైర్‌పర్సన్‌ పదవీకాలం ముగిసి ఏడాదిన్నర అవుతోంది. కొత్త కమిషన్‌ నియామకంలో ఆలస్యం కావడంతో దిశ ఘటన విచారణ చేసేందుకు కేంద్ర మహిళా కమిషన్‌ నగరానికి రావాల్సి వచ్చింది. రాష్ట్ర కమిషన్‌ ఉంటే విచారణను వేగం చేసేలా సమన్లు జారీచేసేందుకు, బాధ్యులపై కఠినచర్యలకు సిఫార్సు చేసేందుకు అవకాశం ఉండేది.

* రాష్ట్రంలో చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఇటీవల ఏర్పాటైంది. ఈ కమిషన్‌కు ఛైర్మన్‌, సభ్యులను నియమించినా కార్యకలాపాలు ప్రారంభించేందుకు రూపాయి కూడా ఇవ్వలేదు.

* చిన్నారులు, మహిళల భద్రత, రక్షణ కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు నవంబరు 7న మహిళా శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ ఒక్కరూపాయి సంక్షేమశాఖ ఖాతాలో జమకాలేదు. ఈ నిధులన్నీ ట్రెజరీల్లోనే నిలిచిపోయాయి.

Courtesy Eenadu…