2020 తొలి రోజు జననాలపై యునిసెఫ్ అంచనా

దిల్లీ: కొత్త సంవత్సరం, దశాబ్ది తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 3,92,078 మంది చిన్నారులు జన్మించారని ఐరాస బాలల నిధి (యునిసెఫ్) అంచనా వేసింది. ఇందులో సగం జననాలు 8 దేశాల్లోనే ఉంటాయని తెలిపింది. అత్యధికంగా 17% మంది భారత్ లోనే పుట్టారని వెల్లడించింది. నూతన సంవత్సరం రోజు జన్మించిన చిన్నారులను ఉద్దేశించి ఏటా జనవరిలో యూనిసెఫ్ ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఈ అంచనాలను విడుదల చేసింది. భారత్ తరువాత స్థానాల్లో చైనా (46,299జననాలు), నైజీరియా (26,099), పాకిస్థాన్ (16,787), ఇండోనేసియా (18,020), అమెరికా (10,152), కాంగో (10,247), ఇథియోపియా (8,498) ఉంటాయని పేర్కొంది.

తొలి చిన్నారి దక్షిణ పసిఫిక్ లోని ఫిజిలో జన్మించే అవకాశం ఉందని చెప్పింది. భారత్ కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ 1894లో, ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ 1979లో జనవరి 1న జన్మించారు.2018లో 25 లక్షల మంది చిన్నారులు పుట్టిన నెల రోజుల్లోనే మరణించారని యునిసెఫ్ తెలిపింది. అందులో మూడో వంతు తొలి రోజే మృతి చెందారని పేర్కొంది. వీరు కాకుండా ఏటా 25 లక్షల మంది శిశువులు తల్లి గర్భంలోనే మృత్యువాత పడుతున్నారని వెల్లడించింది. అయితే గత 3 దశాబ్దాల్లో 5 ఏళ్ల లోపు చిన్నారుల మరణాల నివారణలో గొప్ప పురోగతి సాధించినట్లు తెలిపింది. నెలలోపు శిశువుల మరణాల నివారణ ఆశించినస్థాయిలో లేదని స్పష్టం చేసింది.

Courtesy eenadu