– 4.5 లక్షల మంది ఉపాధ్యాయులు సమ్మెలోనే…!
– ‘సమాన పనికి సమానవేతనంకల్పించాలని డిమాండ్‌

పాట్నా : ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా తమకూ ‘సమాన పనికి సమాన వేతనం’ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బీహార్‌లో కాంట్రాక్టు టీచర్లు సమ్మె బాట పట్టారు. సమ్మెకు వెళ్తే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా బెదరకుండా ఉద్యోగులు నిరసన కార్యక్రమాలకు దిగారు. బీహార్‌ రాజ్య శిక్షక్‌ సంఘర్ష్‌ సమన్వయ సమితి ఆధ్వర్యంలో సుమారు 4.5 లక్షల మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్నట్టు తెలుస్తున్నది. దీనికి 26 ఉపాధ్యాయ సంఘాలు మద్దతునిచ్చాయి. మరోవైపు బీహార్‌లో పదోతరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సరిపడా పర్యవేక్షకులు (ఇన్విజిలేటర్లు) కరువయ్యారు. సుమారు 15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారికి 65 వేల మంది ఇన్విజిలేటర్ల అవసరం ఉండగా.. 36 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతోనే పరీక్షలు నిర్వహిస్తుండటం గమనార్హం.

తమకు సమాన వేతనం కల్పించాలని ఎన్నో ఏండ్లుగా డిమాండ్‌ చేస్తున్నా నితీశ్‌ సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు కొద్దిరోజుల క్రితం సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే సమ్మెకు వెళ్తే క్రమశిక్షణా చర్యలుంటాయని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. ‘ప్రభుత్వ ఆదేశాలకు భయపడేది లేదు. మా డిమాండ్లు నెరవేరేదాకా వెనకడుగేసే ప్రసక్తే లేదు’ అని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి ప్రేమ్‌కుమార్‌ చంద్ర అన్నారు. ఉపాధ్యాయుల సమ్మెపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కృష్ణానందన్‌ ప్రసాద్‌ వర్మ స్పందిస్తూ.. కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెను విరమించాలని కోరారు. అంతేగాక ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి సమ్మె చేస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Courtesy Nava Telangana