గుజరాత్ లోని మొదాసాలో గత డిసెంబర్ 31 న కనిపించకుండా పోయిన 19 ఏళ్ల దళిత యువతి మృతదేహం జనవరి 5 న చెట్టుకి వేలాడుతూ లభ్యమైంది. యువతి కుటుంబసభ్యులు ఓ నలుగురు  వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసి చంపేసినట్టుగా ఆరోపిస్తున్నారు.

సంఘటన జరిగిన తర్వాత వేలాదిమంది దళితులు మొదాసా రూరల్ పోలీసు స్టేషన్ దగ్గర గుమిగూడి నిందితులని అరెస్టు చేయాలనీ,విధుల్లో ఉన్న పోలీసాఫీసరుని తప్పించాలని డిమాండ్ చేశారు.

బాధితురాలు,నిందితుల కులప్రస్తావన తెచ్చినందుకు గానూ మీడియా సంస్థలపై ప్రశ్నల వర్షం కురిసింది. ఐతే భారత సమాజంలో అగ్రకులాలు వెనుకబడిన కులాలు,వర్గాల వారిపై దౌర్జన్యం చేయడమనేది చాలా ముఖ్యమైన విషయమని మనం అర్థం చేసుకోవాలి. తరాల నుంచీ వస్తున్న పితృస్వామ్య వ్యవస్థ ప్రాబల్యం ఈ దేశంలో ఇంకా ఉంది కాబట్టి ప్రతీ నేరానికీ కులకోణం ఖచ్చితంగా ఉంటుంది.

కులవ్యవస్థ పునాదులే హింసపై  నిర్మించబడ్డాయి. ఇక దళిత మహిళలపై హింస ఐతే అన్నింటికంటే అత్యంత దారుణమైన రీతిలో ఉంటుంది.  ఐతే మెయిన్స్ట్రీమ్ చర్చల్లో మాత్రం దళిత మహిళలపై జరిగే అఘాయిత్యాలు ఎప్పుడూ చర్చకి రావు.

ఒక దళిత మహిళా లేదా వెనుకబడిన కులాలకి చెందిన మహిళపై అఘాయిత్యాలు జరిగిన ప్రతిసారీ వ్యవస్థలో ఉన్న కులం, పితృస్వామ్య వ్యవస్థ లో స్త్రీకి ఇవ్వబడుతున్న స్థాయి కూడా అందుకు కారణమనే విషయం స్పష్టమవుతోంది.

దళిత మహిళలపై జరిగే హింసకీ,వారి కులపరమైన అస్తిత్వాలకీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది‌. కులవ్యవస్థని ఎదిరించిన ప్రతిసారీ వారిపై హింస జరుగుతూనే ఉంటుంది.

ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లా కత్రా గ్రామంలో 2014 మే 27 న ఇద్దరు టీనేజ్ బాలికలు గ్యాంగ్ రేప్,హత్యకి గురయ్యారు. వీరిద్దరూ దళిత మౌర్య కమ్యూనిటీకి చెందినవారు. అపహరణకి,గ్యాంగ్ రేప్ కి గురై చివరకి చెట్టుకి ఉరితీయబడ్డారు.

ఆ బాలికల తప్పేంటి?. తమ జీతం ఓ మూడు రూపాయలు పెంచమని తమ అగ్రకుల యాజమానిని అడగడమే‌. అది కూడా జీర్ణించుకోలేకపోయాడు.

ఈ హింస కేవలం స్త్రీలని పరిధిలో ఉంచడం గురించి మాత్రమే జరగలేదు,కులవ్యవస్థ పునాదులని పటిష్టం చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది.

కుల,వర్గపరమైన విభేదాల్లో ఓ సాధనంగా రేప్ : మిగతా వర్గాలకి చెందిన మహిళలతో పోలిస్తే దళిత మహిళలు సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల వారిపై జరిగే అఘాయిత్యాలు ఎవరికీ పట్టవు. నిందితులు కూడా ఎలాంటి శిక్షలూ లేకుండా తప్పించుకోవచ్చనే ధైర్యంతో చెలరేగిపోతారు.

పురాతన కాలం నుంచీ కూడా మన సమాజంలో దళిత మహిళలపై హింస జరుగుతూనే ఉంది,ఆ హింసకి సంబంధించిన వ్యథలు ఇప్పటికీ ప్రతిచోటూ వినిపిస్తూ ఉంటాయి.

మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లా ఎస్పీ ఆఫీసుకి ఓ దళిత బాలిక ప్లాస్టిక్ బ్యాగులో ఆరు నెలల వయసున్న పిండాన్ని తీసుకొచ్చింది. తనపై గత కొన్ని నెలలుగా అగ్ర కులానికి చెందిన ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడుతున్నారని ఆరోపించింది.

ఇలాంటిదే ఇంకో సంఘటన ఛత్తీస్ ఘడ్ లో జరిగింది. అక్కడో పూజారి 22 ఏళ్ల వయసున్న యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. రేప్ అనేది అగ్రకులాల వ్యక్తులు వెనుకబడిన కులాలకి చెందిన వారిని అదుపులో ఉంచుకోవడానికి వాడుతున్న సాధనంగా మనం చెప్పుకోవచ్చు.

సోషల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రంజనా కుమారి చెప్పినట్టు ఇలాంటి సంఘటనలు రోజూ జరుగుతున్నా కూడా ఇండియాలో జరుగుతున్న  లైంగిక దాడుల్లో కులపరమైన సమాచారం మాత్రం ఎక్కడా లభించడం లేదు. ఐనప్పటికీ మనకది చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

హర్యానాలో 2016 ఫిబ్రవరి లో అగ్రవర్ణ వ్యవసాయ కమ్యూనిటీ ఐన జాట్లు ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం చేసిన నిరసనల్లో కూడా కొంతమంది వ్యక్తులు తొమ్మిది మంది దళిత మహిళల్ని ఇళ్లలో నుంచి ఈడ్చుకొచ్చి మరీ గ్యాంగ్ రేప్ చేసారు.  ఐతే ఇలాంటి సంఘటనలు కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమవ్వడం  లేదు.

2018 ఏప్రిల్ లో విడుదలైన హైదరాబాద్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం గత మూడేళ్లలో అగ్రకుల వ్యక్తులు సుమారు 37 మంది దళిత,ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకి ఒడిగట్టారు.

సోషియాలజిస్టు సంజయ్ శ్రీవాత్సవ చెప్పినట్టు రేప్ అనేది ఇక్కడ అగ్రకుల వ్యక్తులు తమ కంటే కింది కులం వారు తమ మహిళలని కాపాడుకోలేని అసమర్థులని నిరూపించడానికి ఉపయోగించే సాధనం అని అర్థమౌతుంది.

రోజుకి నలుగురు దళిత మహిళలు అత్యాచారాలకి గురౌతున్నారు : భూమి లేని కార్మికులు, పారిశుద్ధ్య పనులలో కూడా దళిత మహిళల శాతమే ఎక్కువ. వీరిలో చాలామంది పట్టణాలలోని వ్యభిచార గృహాలకి అమ్మబడుతున్నారు.

భారత సమాజంలో కుల,వర్గ,లింగ పరంగా కూడా అట్టడుగు స్థాయిలో ఉండే దళిత మహిళలు నిరక్షరాస్యులు,తమ పురుషులతో పోలిస్తే చాలా తక్కువ వేతనం పొందేవారే.

హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్టులో కూడా భూస్వాములు,పోలీసులు తమకి వ్యతిరేకంగా గళమెత్తిన దళిత మహిళలపై లైంగిక దాడుల ద్వారానే గుణపాఠం చెబుతారని పేర్కొనబడింది.

1997 లో బీహార్ లోని లక్ష్మణ్ పూర్-బాథే లో రణ్ వీర్ సేన దళిత మహిళలపై అత్యాచారాలూ,హత్యలకి తెగబడింది. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న పురుషుల భార్యలూ,కుటుంబ మహిళలపై కస్టడీలోనే అత్యాచారాలు జరిగాయి.

ఓ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం 2016 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం ఆధారంగా చూస్తే వెనుబడిన వర్గాల మహిళలందరిలోకీ దళిత మహిళలపైనే ఎక్కువ అఘాయిత్యాలు జరిగాయని తెలుస్తోంది‌. దాదాపు ప్రతిరోజూ నలుగురు దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. నేషనల్ క్యాంపైన్ ఆన్ దళిత్ రైట్స్ అనే ఎన్జీవో 23% మంది దళిత మహిళలు తమపై లైంగిక దాడి జరిగిందని రిపోర్ట్ చేసినట్టుగా తెలిపింది.

అగ్రకులాల వ్యక్తులకి తప్పు చేసినా శిక్షల నుంచి తప్పించుకునే భరోసా ఉండడం వల్ల దళిత మహిళలు సర్పంచులై రాజకీయ బలం పుంజుకున్నా వారికి రక్షణ మాత్రం కరువౌతోంది.

మైనారిటీ ఇష్యూలపై యూఎన్ ప్రతినిధి రీటా ఇజ్సాక్ తన రిపోర్టులో ఎక్కువ నేరాలు వెలుగులోకి రాకపోవడానికి కారణం సమాజం బాధితులని నిందించడమే అని పేర్కొన్నారు. దళిత బాలికల్లో అక్షరాస్యత చాలా తక్కువ,డ్రాపౌట్ రేట్ కూడా ఈ వివక్షల కారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది.

న్యాయవ్యవస్థ వైఫల్యం : యూఎన్ వుమన్ పాలసీ డివిజన్ డైరెక్టర్ సరస్వతి మీనన్ గారు ఇండియాలో కులవ్యవస్థ ప్రాబల్యం ఎంత బలంగా ఉందో తెలిసినప్పటికీ చట్టాలని పకడ్బందీగా అమలు పరచడంలో న్యాయ,పోలీసు వ్యవస్థలు మరింత విఫలమయ్యాయని అంటారు.

దళిత మహిళలపై రేప్ కేసుల్లో నిందితులకి శిక్షలు పడకపోవడం మరో పెద్ద సమస్య.  ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం దగ్గర్నుంచీ కోర్టులో కేసు వాదనలు మొదలై తీర్పు వచ్చేదాకా అడుగడుగునా ఇబ్బందులే. ఇందువల్ల న్యాయవ్యవస్థని ఆశ్రయించడంలో మరింత జాప్యం జరుగుతోంది.

ఒకవేళ ఎవరైనా తమపై జరిగిన లైంగిక దాడుల కేసులని చట్టపరంగా ఎదుర్కొనడానికి ముందుకొచ్చినా వారు వ్యవస్థలోని ప్రతీ ఒక్కరి నుంచీ ప్రతిఘటనని ఎదుర్కోవాల్సిన పరిస్థితులున్నాయి.

న్యాయవ్యవస్థలోని ఈ లోపాల కారణంగా కులపరమైన హింసలో పురుషులు కింది కులాల మహిళలపై లైంగిక దాడులు చేయడం మరింత సులభమౌతోంది.

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా గుర్తించబడుతోంది. ఆర్టికల్ 14-18 ల్లో సమానత్వ హక్కు ప్రతీ దేశ పౌరునికీ ఇవ్వబడింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనం పూర్తిగా నిషేధించబడింది అని తెలియజేస్తుంది. ఎవరైనా అంటరానితనాన్ని పాటిస్తే వారు శిక్షార్హులనీ తెలుపుతుంది. ఈ ఆర్టికల్ 17 ప్రత్యేకించి దళిత మహిళల్ని వివక్షకి గురవ్వకుండా రక్షిస్తూ వస్తోంది.

1978లో అన్ టచబిలిటీ యాక్ట్ 1955ని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా మార్చింది‌. ఎస్సీ,ఎస్టీలపై జరిగే అఘాయిత్యాలు పాత చట్టం పరిధిలోకి రాకపోవడం వల్ల 1989లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పార్లమెంటు తీసుకొచ్చింది.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా మన దేశంలో ఇంకా పితృస్వామ్య వ్యవస్థ ప్రాబల్యం అలాగే మిగిలుండడం నిజంగా తలొంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు కనీసం వ్యవస్థలైనా సరిగ్గా పనిచేసి బాధితులకి న్యాయం అందజేసే విధంగా వాటి పనితీరుని మెరుగుపర్చడమే మన కర్తవ్యం అవ్వాలి.