వారసత్వ నిరూపణ దస్త్రాలు చూపలేదంటూ తిరస్కరణ 
అసోంలో చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియ సాధారణ ప్రజలతోపాటు కొందరు ప్రముఖుల వారసులకూ ఆందోళన కలిగిస్తోంది. అసోం పౌరుల తుది జాబితా ప్రచురణకు సుప్రీంకోర్టు మరో నెలరోజుల గడువిచ్చిన విషయం తెలిసిందే. గతేడాది ప్రచురించిన జాబితాలో పేర్లు మిస్సయినవారిలో స్వయానా దేశ ఐదో రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీఅహ్మద్‌ తమ్ముని కుమారుని కుటుంబం ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

50 ఏండ్ల జియాఉద్దీన్‌ అలీఅహ్మద్‌ది రైతు కుటుంబం. అసోంలోని కామరూప్‌ గ్రామీణ జిల్లాలో ఆయన కుటుంబం నివాసముంటున్నది. జియాఉద్దీన్‌ తండ్రి ఏత్రాముద్దీన్‌ అలీఅహ్మద్‌ స్వయానా మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ తమ్ముడు. ఫక్రుద్దీన్‌ తండ్రి జల్నూర్‌ అలీఅహ్మద్‌ అసోం నుంచి డాక్టర్‌ డిగ్రీ పొందిన మొదటి వ్యక్తిగా ప్రసిద్ధి పొందారు. జల్నూర్‌ సైన్యంలో పని చేసి కల్నల్‌గా రిటైర్‌ అయ్యారు. ఈ వివరాలన్నీ చెప్పినా, ఇందుకు ఆధారాలు చూపాలన్నది అధికారుల ఆదేశం. గతేడాది తిరస్కరణకు గురైనవారు తిరిగి అవసరమైన దస్త్రాలతో దరఖాస్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, జియాఉద్దీన్‌ కుటుంబం తాజాగా ఎలాంటి అదనపు దస్త్రాలనూ సమర్పించ లేకపోయింది. దాంతో, ఈసారి ప్రకటించే ఎన్‌ఆర్‌సీలోనూ తమ పేర్లు ఉండక పోవచ్చని జియాఉద్దీన్‌ కుమారుడు సాజిద్‌ అలీఅహ్మద్‌ అంటున్నారు. అధికారులు కోరుతున్న పత్రాలు తమ వద్ద లేవని జియాఉద్దీన్‌ కుటుంబం చెబుతోంది.
ఏమిటా పత్రాలు..? 
అసోంలో మొదటి ఎన్‌ఆర్‌సీని 1951లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిపై పలు అభ్యంతరాలు రావడంతో నిబంధనల్లో సడలింపులు చేశారు. తాజా నిబంధనల ప్రకారం 1971, మార్చి 24 అర్ధరాత్రి వరకు దేశంలోకి ప్రవేశించినవారు, వారి వారసులందరికీ పౌరులుగా జాబితాలో చోటు కల్పిస్తున్నారు. అయితే, అందుకు ఎన్‌ఆర్‌సీ కోరిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. 1951లో ప్రచురించిన ఎన్‌ఆర్‌సీలో పేర్లు ఉండాలి లేదా 1971కి ముందు ప్రచురించిన ఓటర్‌ జాబితాల్లో పేర్లు ఉండాలి. ఆ తర్వాత జన్మించినవారు.. ఆ రెండు జాబితాల్లో పేర్లు ఉన్నవారికి నిజమైన వారసులమని నిరూపించే పత్రాలను జత చేయాలి. అప్పుడే వారికి అసోం పౌరులుగా గుర్తింపు ఇస్తారు. ఈ రెండు జాబితాల్లోనూ తమ తండ్రి పేరును జియాఉద్దీన్‌ కనుగొనలేకపోయారు. ఈ రెండు జాబితాలను ఎన్‌ఆర్‌సీ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు. వారసత్వాన్ని వెతకడంలో బాధితులకు సహకరి స్తున్నామని అధికారులు చెబుతుండగా, సేవా కేంద్రంలో తమకు అటువంటి దేమీ లభించలేదని జియాఉద్దీన్‌ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ రెండు జాబితాల్లో పేర్లు లేనివారు ఇతర అధికారిక రికార్డుల ద్వారా రుజువు చేసుకునే వెసులుబాట్లు కూడా ఉన్నాయి. తమ తండ్రి ఏత్రాముద్దీన్‌ పేరున ఉన్న భూమి పత్రాలు లభించినట్టు జియాఉద్దీన్‌ తెలిపారు. వాటిని సమర్పించేందుకు వెళ్లగా, అప్పటికే దరఖాస్తుల గడువు ముగిసిందని అధికారులు తిరస్కరించినట్టు ఆయన తెలిపారు. ఇప్పుడిక జియాఉద్దీన్‌ కుటుంబం చేయగలిగేదేమీ లేదు. ఎన్‌ఆర్‌సీ విడుదలైన వారం తర్వాత తమ వద్దకు రావాల్సిందిగా అధికారులు సూచించినట్టు సాజిద్‌అలీ తెలిపారు. ఏమి జరుగుతుందో చూద్దామని జియాఉద్దీన్‌ భార్య అకీమా బేగమ్‌ అన్నారు.

ఎన్‌ఆర్‌సీ కోసం మొత్తం 3 కోట్ల 29 లక్షల 91వేల 384మంది దరఖాస్తు చేసుకోగా, గతేడాది జులై 30న ప్రకటించిన జాబితాలో 2 కోట్ల 89 లక్షల 83వేల 677మందికి మాత్రమే చోటు కల్పించారు. 40 లక్షల 7 వేల 707మందిని జాబితాకు దూరంగా ఉంచారు. ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్‌ఆర్‌సీ తుది జాబితా ప్రచురణకు ఈ ఏడాది ఆగస్టు 31ని మరోసారి తుది గడువుగా సుప్రీంకోర్టు నిర్ణయించింది. 2018లో ప్రకటించిన ఎన్‌ఆర్‌సీపై పలు అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దాంతో, ఏడాది కాలంగా ఎన్‌ఆర్‌సీలో మార్పులు చేస్తున్నారు. 72 లక్షల మందిపై పున:పరిశీలన నిర్వహించి తొలగింపులు, చేర్పులు జరిపినట్టు ఎన్‌ఆర్‌సీ కో ఆర్డినే టర్‌ ప్రతీక్‌అజేలా ఇటీవలే సుప్రీంకోర్టుకు తెలిపారు. మరోసారి పున:పరిశీలన అవసరంలేదని కూడా ఆయన సుప్రీంకోర్టుకు సూచించారు. ఎన్‌ఆర్‌సీపై ఇంకా అభ్యంతరాలున్న భాగస్వామ్య పక్షాలకు ఆగస్టు 7న తమ ముందుకు రావాల్సిందిగా సుప్రీంకోర్టు తెలిపింది.

(Courtecy Nava Telangana)