Image result for CAA nrc"– మహమ్మద్ ఖదీర్‌బాబు

(ఈ దేశంలో నా పౌరసత్వ నిరూపణకు నేను చూపగలిగే పత్రాలు)

సాయంత్రం ఇంటికొచ్చి మా అమ్మకు ప్రయాస లేకుండా పురుడుబోసిన నర్సు అన్నమ్మ. ఆవిడ మెడలో క్రాస్ ఉంటుంది. మొట్టమొదట ఆ పత్రాన్ని. 18 ఏళ్ల వయసులో రెండో సంతానంగా నన్ను కని, మొదటి బిడ్డతో, కోపధారి అయిన మా నాన్నతో, సంప్రదాయవాది అయిన మా నానమ్మతో సతమతమవుతూ నన్ను పట్టించుకునేందుకు మా అమ్మకు వీలు లేనప్పుడు ఒడిలో పెట్టుకుని నన్ను సాకిన టీ హోటల్ అంజి భార్య, పెద్ద ముక్కావిడ. ఆ పత్రాన్ని. నా పేరుకు ‘బాబు’ జత చేసి నన్ను ఖదీర్‌బాబును చేసిన మా విద్యానికేతన్ కరెస్పాండెంట్ మీసాల సుబ్బారాయివోరు. ఆ పత్రాన్ని. చిన్నప్పుడు బక్కగా ఒంటూపిరిగా పోయే ప్రాణంగా ఉన్న ప్రతిసారీ ఎక్కువ డబ్బులు ఖర్చుకాని మాత్రల చీటి రాసి, ఛాతీ మీద స్టెతస్కోపు పెట్టి నన్ను కాపాడుతూ వచ్చిన అపర ధన్వంతరి డాక్టర్ జనార్దన్. ఆ పత్రాన్ని. కావలి కసాబ్ గల్లీకి ఆనుకొని ఉన్న మాలపాలెం నుంచి వచ్చి తంబలగుంటలో చేపలు పట్టడం నేర్పి ఈ దేశవనరులకు అందరూ హక్కుదారులే అని చెప్పిన నల్లచిగుళ్ల పిల్లలు. ఆ ప్రతాల్ని. అందరూ రెడ్లు నివసించే పాతవూరులో మొదటి ముస్లిం కుటుంబాన్ని ప్రవేశపెడుతూ మాకు ఇంటి స్థలం కొనుక్కోజూపిన పలావు వెంకారెడ్డి. ఆ సురుచి పత్రాన్ని.

మా నాన్నకు పని నేర్పి, మా షాపును ‘మదినా ఎలక్ట్రికల్స్’ అని కాకుండా ‘రవి ఎలక్ట్రికల్స్’ అని తన పేరు పెట్టుకునేంతగా, మాకు తండ్రి అయి చేరదీసిన పెండెం రవి. ఆ గురుపత్రాన్ని. కావలిలో సకల రైస్‌మిళ్ల, సినిమా హాళ్ల వైరింగును మా నాన్నకే ఇచ్చి మాకు ఉపాధి చూపిన పంటరెడ్లు… ఆ తెల్లవస్త్రాల పత్రాల్ని. కావలిలో జవహర్‌భారతి కాలేజీ కట్టి పేద పిల్లలు అతి సలీసుగా చదువుకునేలా చేసి ఇవాళ ఈ నాలుగుముక్కలు రాయగలిగే శక్తినిచ్చిన దొడ్ల రామచంద్రారెడ్డి. ఆయన స్మృతిపత్రాన్ని.

చిన్నప్పటి నుంచి నాకు వేరే స్నేహితులు లేకుండా తామే అన్నీ అయ్యి తోడు ఉండిన కాండూరి మురళి, కేతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కందుల మాలకుండరావు. ఆ స్నేహపత్రాల్ని. నేను కథలు రాస్తానంటే స్టాంపులకు డబ్బులిచ్చి వాటి ఊసే ఎప్పటికీ ఎత్తని కాలేజీ మేటు తాళ్లూరి ఎస్.ఎస్. అయ్యపరాజ్. ఆ ఆత్మీయ పత్రాన్ని.

రెండు జతల బట్టలతో హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు నా మతం అడక్కుండా నా మూలం అడక్కుండా నీడనిచ్చి అన్నం పెట్టి నా అత్యంత ఒంటరితనం రోజులని చేతులతో చెదరగొట్టిన స్నేహితులు వేమన వసంతలక్ష్మి, సత్య శ్రీనివాస్, అనంత్, మృదుల, మోహన్, కోడూరి విజయకుమార్, కాత్యాయని… ఆ అద్భుత సహృదయ పత్రాలని.

శిష్యుడి మతం ఎన్నడూ అడగని నామిని సుబ్రహ్మణ్యంనాయుడు అనే మిట్టూరు పత్రాన్ని, బాలుడి మతం చూడక ఆశీర్వదించ వచ్చిన ముళ్లపూడి వెంకటరమణ అనే తాత పత్రాన్ని, ఈ కలం మతం ఏమిటి అని ఒక్కనాడూ చూడక నేను రాసిన కూర్చిన పుస్తకాలను జేబుల నుంచి డబ్బు తీసి కొని, హృదయం నుంచి అభిమానం తీసి పంచి, నన్ను ఇంతవాణ్ణి చేసిన అనేకానేక అపురూప పాఠక పత్రాలని…

వీరిని కాక ఇంకే పత్రాలను నేను చూపలేను.
వీరిని కాక ఇంకే పత్రాలూ నా దగ్గర లేవు.
ఇంకా అడిగితే ఇంకాఇంకా అడిగితే నేను చూపగలిగే ఒకే ఒక పత్రం- భారతదేశం.
నాకు తెలిసిన గొప్ప సాంస్కృతిక పత్రం.
నాకు తెలిసిన సహజీవన పత్రం.
నాకు తెలిసిన సమోన్నతమైన తిరుగులేని పత్రం.
ఇది- నా తల్లివంటి మట్టిపత్రం. నేను అంతిమంగా నుదురు తాకించాల్సిన ధరిత్రిపత్రం.