– సీఏఏ మద్దతుకు బీజేపీ అడ్డదారులు
– 88662 88662తో అనుచిత ప్రచారం
– ఉత్తుత్తి ఉచిత, డేటింగ్‌ ఆఫర్లతో సమ్మతికి ఎర
– ట్విట్టర్‌ వేదికగా అంతర్జాల పోకిరీల ఆగడాలు

న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఈ చట్టానికి ప్రజల మద్దతు సమీకరించేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతోంది. మిస్డ్‌కాల్‌ మోసాలతో, అనుచిత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సీఏఏను సమర్ధించే వారు మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వాలంటూ ఒక నంబర్‌ 88662-88662ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవలే ఆవిష్కరించారు. ఇదే నెంబరును బీజేపీ గురువారం అధికారిక ట్విట్టర్‌ ఖాతా ‘బీజేపీ 4 ఇండియా’ ద్వారా ప్రకటించింది. ఇప్పుడు ఈ నంబరును ప్రజల్లోకి తీసుకెళ్లి సమ్మతి కూడగట్టేం దుకు నానా పాట్లు పడుతున్నారు. తనకంటూ ప్రత్యేకంగా నియమించుకున్న అంతర్జాల పోకిరీలతో ఆగ డాలకు తెరలేపారు. 88662-88662కు నంబర్‌కు పోన్‌ చేస్తే ‘నెట్‌ఫ్లిక్స్‌’ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా వస్తుందనీ, ఒంటరి మహిళలు, బాలీవుడ్‌ తారలతో చాటింగ్‌, సమయం దొరికితే డేటింగ్‌ చేసే అవకాశం లభిస్తుందంటూ అనుచిత ఆఫర్లతో ‘మిస్డ్‌కాల్స్‌’ కోసం ట్విట్టర్‌ వేదికగా ఎరలు వేస్తున్నారు. గత మూడు రోజులుగా ట్విట్టర్‌ ఖాతాల్లో ఈ నంబరుపై విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఆఖరుకు ఈ నంబర్‌ బాలీవుడ్‌ నటి అలియాభట్‌కు చెందినదనీ, ఎవరైనా ఖాళీగా ఉంటే ఫోన్‌ చేసి అమెతో మాట్లాడవచ్చని ప్రచారం చేస్తూ ట్వీట్లతో ముంచెత్తుతున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌ ఖండన
బీజేపీ ట్విట్టర్‌ సైన్యం ప్రచారం చేస్తున్న ఆఫర్లతో అంతర్జాతీయ సంస్థలు సైతం విస్తుపోతున్నాయి. సీఏఏ నంబరుకు ఫోన్‌ చేస్తే ఉచిత సబ్‌ స్క్రిబ్షన్‌ లభిస్తుందనే ప్రచారంపై అమెరికా కేంద్రంగా పనిచేసే ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ప్రొవైడర్‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’ తీవ్రంగా స్పందించింది. ఈ పోస్టులు పూర్తిగా నకిలీవని అని శనివారం ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేసింది. ఉచిత సేవలు కావాలనుకుంటే వేరే చోట చూసుకోవాలనీ, తమ దగ్గర అలాంటి సర్వీసులు లేవని పేర్కొంది. మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు మద్దతు ఇచ్చినట్టే అనే విధానమే అవివేకమైనది కాగా, అలా మిస్డ్‌కాల్‌ సంఖ్యను పెంచుకొనేందుకు తప్పుడు మార్గాలు తొక్కడం బీజేపీకే చెల్లుబాటు అవుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ చేస్తున్న తప్పుడు ఆఫర్లపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి తరుణ్‌చుగ్‌ను వివరణ కోరగా, ఈ విషయాన్ని తమ పార్టీ ఐటీ సెల్‌ చూసుకుంటుందన్నారు.

బీజేపీ నైజమే అది : ఏచూరి
సీఏఏకు మద్దతు కూడ గట్టేందుకు బీజేపీ పన్నిన మిస్డ్‌కాల్‌ వ్యవహారంపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి తీవ్రంగా స్పందించారు. బీజేపీ నైజమే నకిలీ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ మోస పూరిత కుట్ర ‘బీజేపీ వాస్తవ ముఖాన్ని, చరిత్రను, వ్యూహాన్ని, సిద్ధాంతాన్ని తెలియ జేస్తుంద’ని ఏచూరి ట్వీట్‌ చేశారు.

Courtesy Nava telangana