• ఆకలి చావుల నివారణకు సుప్రీంకోర్టులో పిటిషన్‌
  • విచారణకు సుప్రీం సమ్మతి
  • కేంద్రానికి నోటీసులు

ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయే దుర్భిక్ష పరిస్థితుల నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఆకలి, పోషకాహారలేమి, దుర్భిక్షం కారణంగా చోటుచేసుకునే చావులను నివారించేందుకు దేశవ్యాప్తంగా సామూహిక వంటశాలలు (కమ్యూనిటీ కిచెన్లు) ఏర్పాటు చేయడంపై తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఆకలి చావులు జీవించే హక్కును హరిస్తున్నాయని, సామాజిక వ్యవస్థను ఛిద్రం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక కార్యకర్తలు అనున్‌ ధావన్‌, ఇషాన్‌ ధావన్‌, కుంజన సింగ్‌ తరపున న్యాయవాది ఫజెయిల్‌ అహ్మద్‌ అయ్యుబి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్‌ ఎన్‌వి రమణ, జస్టిస్‌ అజరు రస్తోగితో కూడిన ధర్మాసనానికి కేటాయించింది.
ఏటా 25 లక్షల మంది ..
దేశంలో పోషకాహారలేమి, ఆకలి మూలాన చోటుచేసుకుంటున్న చావులు అత్యంత ఆందోళనకర స్థితికి చేరాయని పేర్కొంటూ పిటిషనర్లు వివిధ గణాంకాలను ఉదహరించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కింద పేర్కొన్న ఆహార హక్కును, జీవించే హక్కును హరించివేయడమేనని పేర్కొన్నాను. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ), ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) తదితర సంస్థల నివేదికల ప్రకారం దేశంలో ప్రతి రోజూ 7000 మంది (చిన్నారులతో సహా) చొప్పున తిండి లేక తనువు చాలిస్తున్నారని, సంవత్సరానికి 25 లక్షల మంది ఆకలితో చనిపోతున్నారని పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆకలి తీర్చేలా కమ్యూనిటీ కిచెన్లు

ప్రజల ఆకలి తీర్చాలంటే తక్షణమే దేశవ్యాప్తంగా సామూహిక భోజన శాలలు (కమ్యూనిటీ కిచెన్లు) ఏర్పాటు చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఆదేశించాలని, అలాగే ప్రజా పంపిణీ పథకాలకు దూరంగా ఉన్నవారికీ, ఇళ్లు లేనివారికీ, ప్రభుత్వం చేపట్టే వివిధ ఆహార పథకాలు పొందలేనివారికీ ఆకలి తీర్చేలా ‘నేషనల్‌ ఫుడ్‌ గ్రిడ్‌’ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఫుడ్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) పరిధిని మించి ఇది ఉండాలని పిటిషన్‌ తెలిపింది. ”ఆకలి, పోషకాహార లేమి, క్షుద్భాధలతో మరణించే వారి సంఖ్యను తగ్గించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఎ నిబంధనలను మరింతగా అమలు చేసేందుకు ఒక పథకాన్ని రూపొందించాలని నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధార్టిని ఆదేశించాలి’ అని సామాజిక కార్యకర్తలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతో సామూహిక కిచెన్లు ఏర్పాటు చేయడం కొత్త భావనేమీ కాదని, తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘అమ్మ ఉనవగమ్‌’ విజయవంతమైన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసింది. వీటి నిర్వహణలో స్వయం సహాయక గ్రూపులకు ప్రాధాన్యతనివ్వడం, పేదలకు ఉపాధి కల్పించడం ద్వారా పరిశుభ్రమైన ఆహారాన్ని అందచేస్తూ ఆకలి సమస్యను తీరుస్తున్నాయని ఆ పిటిషన్‌లో సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని అన్నపూర్ణ రసోరు, కర్ణాటకలో ఇందిరా క్యాంటిన్‌, ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ క్యాంటిన్‌, జార్ఖండ్‌లోని ముఖ్యమంత్రి దల్‌ భట్‌, ఒడిషాలోని ఆహార్‌సెంటర్‌ తదితరాలు ఈ కోవకు చెందినవేనని తెలిపింది. ఇవన్నీ పోషకాహారాన్ని అందిస్తూ, ఆకలిని తీరుస్తున్నాయని తెలిపింది. ఇక మీదట దేశంలో ఖాళీ కడుపుతో ఎవరూ నిద్రించకూడదని పేర్కొంది.

‘2018 నాటి ఆహార వ్యవసాయ నివేదిక మేరకు ప్రపంచ వ్యాప్తంగా 821 మిలియన్ల మంది పోషకాహార లేమి వలన బాధపడుతుంటే వారిలో 195.9 మిలియన్ల మంది భారత్‌లోనే ఉన్నారు. అంటే ప్రపంచంలో ఆకలిగొన్న వారిలో 24 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు. అంటే దేశంలో పోషకాహార లేమితో బాధపడుతున్న వారు 14.8 శాతం ఉన్నారు. ఇది అంతర్జాతీయంగాను, ఆసియా పరంగాను సగటు కన్నా అధికమే” అని పిటిషన్‌ వివరించింది. ఆకలి, క్షుద్బాధ, పోషకాహర లేమితో మరణిస్తున్న వారి సంఖ్య తగ్గించేందుకు ప్రస్తుతం అనేక పథకాలు అమలులో ఉన్నప్పటికీ, దేశంలో సమస్య తీవ్రంగానే ఉంది. అందువల్ల ఈ సమస్యకు సమూల పరిష్కారాలు కనుగొనాల్సి ఉంది అని పిటిషన్‌ కోరింది.

(COURTECY PRAJA SHAKTHI)