లక్ష్యం నెరవేరడం అసాధ్యం
ఏడాదికి 12.4 % వృద్ధి కావాలి
నీతి ఆయోగ్‌ అంతర్గత విశ్లేషణ
న్యూఢిల్లీ : 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలన్న కేంద్రంలోని మోడీ సర్కార్‌ లక్ష్యం సాధ్యమయ్యేది కాదని నీతి ఆయోగ్‌ తన అంతర్గత విశ్లేషణలో అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న మాంద్యం దెబ్బకు వృద్ధి రేటు ఆరు శాతానికి చేరడమే పెద్ద సవాల్‌గా ఉన్న నేపథ్యంలో మరో ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరాలంటే అందుకు ఉన్న అనేక అడ్డంకులను ప్రభుత్వం ఎదుర్కొవాల్సి ఉందని నీతి ఆయోగ్‌ హెచ్చరింది. ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా ప్రతీ ఏడాది సగటున 12.4 శాతం వృద్ధి రేటు సాధిస్తే తప్ప సర్కార్‌ తన లక్ష్యాన్ని చేరలేదని స్పష్టం చేసింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 6 శాతాన్ని దాటేందుకు కావాల్సిన పరిస్థితులు కనిపించడం లేదు. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో జిడిపి ఏకంగా 5 శాతానికి పడిపోయింది. సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ఏకంగా 4.2 శాతానికి పడిపోవచ్చని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) అంచనా వేసింది. ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా అధ్యక్షతన జరిగిన ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటీ ముందు నీతి ఆయోగ్‌ సిఇఒ అమితాబ్‌ కాంత్‌ ఆర్థిక వ్యవస్థపై ఒక నివేదికను ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఆర్ధిక వ్యవస్థపై పలు విశ్లేషణలు చేసినట్లు హిందూ ఓ కథనం వెలువరించింది. జులై 5న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చుతామని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు అనాలోచితంగా విమర్శలు చేస్తున్నాయన్నారు.
పెట్టుబడుల్లో ప్రతికూలత..
అమితాబ్‌ నివేదిక ప్రకారం.. సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దేశీయ పెట్టుబడులు, వినిమయం అత్యంత కీలకమైనవి. ముఖ్యంగా గృహ రంగంలో పెట్టుబడులు ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయి. 2011-12లో జిడిపిలో ఈ రంగం 12.8 శాతం వాటా కలిగి ఉంటే.. 2017-18లో 6.9 శాతానికి పడిపోయింది. రుణ ఎగవేతలతో బ్యాంకుల వద్ద నగదు లభ్యత పరిమితమ వడంతో దేశీయ మార్కెట్‌లో స్తబ్దత నెలకొంది. మరోవైపు మౌలిక వసతుల రంగంలో నిరర్ధక ఆస్తులు పెరిగిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. విద్యుత్‌ వినియోగం కూడా భారత్‌లో గతం కంటే తగ్గిపోయింది.
అత్యున్నత టెక్నాలజీపై దృష్టి సారించాలి..
అత్యున్నత టెక్నాలజీ కలిగిన ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి సారించాలని అమితాబ్‌ తన నివేదికలో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం తయారీ, ప్రాథమిక ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేస్తున్నాం.
ఉదాహరణకు భారత్‌ నుంచి మధ్య ఈశాన్య, ఆఫ్రికా దేశాలకు జరిగే ఫోన్‌ ఎగుమతుల్లో 98 శాతం తక్కువ విలువ కలిగిన కేటగిరీవే. 2017 నుంచి కూడా క్రమంగా టెక్స్‌టైల్‌ ఎగుమతులు తగ్గుతున్నాయి’ అని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్‌ రంగరాజన్‌ ఇప్పటికే అభిప్రాయపడ్డారు. 2025 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత దేశ జిడిపి 2.7 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమే ఉందని, ఇటువంటి సమయంలో దాదాపు రెట్టింపు జిడిపి సాధించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Courtesy Prajasakthi..