రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అంచనాలను రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ డా.సి రంగరాజన్‌ కొట్టిపారేసారు. ప్రస్తుత వృద్ధి రేటుతో 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకోవటం అసాధ్యమని ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలను చేపట్టిన మోడీ సర్కారు రానున్న ఐదేళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ ను 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లటమే లక్ష్యంగా పనిచేస్తామని పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కొనసాగు తున్న మాంద్య పరిస్థితుల్లో వృద్ధి రేటు కుంటుపడుతుండటంతో ఈ లక్ష్యసాధన ప్రశ్నార్థ కంగా మారింది. 2016-17లో 8.2 శాతం వృద్ధిరేటు సాధించిన మన దేశ ఆర్థిక వ్యవస్థ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వద్దే చతికిల పడిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి 5 శాతానికి పరిమితమైంది. రెండో త్రైమాసిక వృద్ధి రేటు అంచనాలు 4.3 శాతం వద్ద కొనసాగుతున్నాయి. ఆర్‌బిఐ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొదట అంచనా వేసిన 9 శాతం వృద్ధిరేటును అక్టోబర్‌లో జరిగిన విధాన సమీక్షలో 6.1 శాతానికి కుదించింది. ఈ నేపథ్యంలో రంగరాజన్‌ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు జవాబిస్తూ ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్త 2.7 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిలో వుందని, రానున్న ఐదేళ్ల కాలంలో రెట్టింపు వృద్ధి రేటు సాధన గురించి మనం మాట్లాడుకుంటున్నామని అన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మనం ఏటా 9 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించాల్సి వుంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమే అవుతుందని పునరుద్ఘాటించారు. ఇప్పటికే రెండేళ్ల కాలం గడిచిపోయిందని, ఈ ఏడాది 6 శాతం లోపు వున్న వృద్ధి రేటు వచ్చే ఏడాది 7 శాతానికి చేరితే ఆర్థిక వ్యవస్థ కొంత వేగం పుంజు కుంటుందని ఆయన అన్నారు. ఒక వేళ మన జిడిపి 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుంటే మన తలసరి ఆదాయం ప్రస్తుతం వున్న 1,800 డాలర్ల స్థాయి నుండి 3,600 డాలర్ల స్థాయికి పెరగాల్సి వుంటుందని, ప్రస్తుతం దిగువ మధ్యతరగతి ఆదాయ శ్రేణిలో ఉన్న మనకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమే అవుతుందని ఆయన వివరించారు. తలసరి ఆదాయం 12 వేల డాలర్ల స్థాయిలో వుంటే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం అంటారన్న రంగరాజన్‌ మనం ఏటా 9 శాతం వార్షిక వృద్ధి రేటు సాధిస్తే ఆ స్థాయికి చేరుకునేందుకు 22 ఏళ్లు పడుతుందని స్పష్టం చేశారు.

Courtesy prajasakthi