తీవ్ర ఆకలి మంటల్లో 5 కోట్ల మంది అమెరికన్లు1.5 కోట్ల కుటుంబాలకు
ఆహార భద్రతే కరువు
చిన్నారుల్లో 25 శాతం మందికి ఒక్క పూటే ఆహారం
అనధికారికంగా నమోదవుతున్న ఆకలి చావులు
– 8 రాష్ట్రాల్లో తారస్థాయికి ఆహార అభద్రత..!

అమెరికా అంటే భూతల స్వర్గమని.. అక్కడ పెద్దపెద్ద వాణిజ్య సంస్థలు.. ఆకాశాన్నంటే భవనాలు.. అబ్బురపరిచే కట్టడాలు ఉంటాయని.. ఇక్కడ నివసించే ప్రజలు సకల సుఖసంతోషాలతో ఆనందగా జీవిస్తుంటారని.. ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న వివిధ దేశాల వారు భావిస్తూ ఉంటారు. మన భారతీయులతో సహా చాలా దేశాల్లోని వారికి అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడాలన్నది చిరకాల కోరికగా కూడా ఉంటుంది. కానీ అమెరికా అంటే భూతల స్వర్గం అన్న భావన సరైంది కాదని.. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే అమెరికాలో కూడా పేదరికం పెరుగుతూ వస్తోందని. అక్కడ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని వివిధ నివేదికలు చెబుతున్నాయి.

అమెరికాలో అబ్బురపరిచే అభివృద్ధి నాణేనికి ఒకవైపు మాత్రమేనని.. ఆ దేశంలో ప్రజలందరూ బయట ప్రపంచం అనుకుంటున్నంత సుఖంగా ఏమీ లేరని నివేదికలు చెబుతున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో (యూఎస్‌ఏ) నివసించే ప్రజలు పేదరికంతో ఆకలి మంటల్లో విలవిలలాడుతున్నారని.. అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా అక్కడ పరిస్థితి ఎంతగా దిగజారిందంటే అమెరికాలో ఉన్న చిన్నారుల్లో దాదాపు 25 శాతం మంది ప్రతి రాత్రీ సరైన ఆహారం దొరక్క ఆకలితో పూటను వెల్లదీస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో దాదాపు 5 కోట్లమంది ప్రజలు ఏదో
ఒక రూపంలో పూటపూటకూ ఆకలి బాధలను అనుభవిస్తున్నారు.

అనిశ్చితిలో జీవన ప్రయాణం..
అమెరికాలో దాదాపు 15 శాతం మందికి ఆహార భద్రతే లేదని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆహార భద్రత లేకపోవడం అంటే ఆరోగ్యంగా.. చురుకుగా ఉండేందుకు గాను ప్రజలకు అన్ని వేళలా చాలినంత ఆహారం అందుబాటులో లేకపోవడం అని అర్థం. అమెరికాలో మొత్తం జనాభాలో 8.9 శాతం మంది తక్కు వ ఫుడ్‌ సెక్యూరిటీని కలిగి ఉండగా.. 5.7 శాతం మంది కనిష్ట ఆహార భద్రతను కూడా కలిగిలేరని గణాంకాల ద్వారా తెలుస్తోంది. దాదాపు అయిదు కోట్ల మంది అమెరికాన్లు ఆహార భద్రతలేక పూర్తి అనిశ్చిత పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నట్టుగా నివేదికలు చెబుతున్నాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఆహారం ఉంది.. డబ్బే లేదు..
అత్యాధునిక టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న అమెరికా.. వ్యవసాయ రంగంలో మేటి దిగుమతులను సాధించే విషయంతో తన సత్తా చాటుతోంది. తమ దేశ అవసరాలకు మించి యూఎస్‌ఏ ఆహారోత్పత్తులను పండిస్తోంది. అయితే ఇక్కడ పండుతున్న పంటలను కొనుగోలు చేసి తినే స్థోమత అమెరికాలోని చాలా రాష్ట్రాలల్లోని అమెరికన్లకు లేకపోవడం విశేషం. దీనికి కారణం అక్కడ నెలకొన్న పేదరికం. పేదరికం కారణంగా ఆహారాన్ని కొనుగోలు చేసే ఆర్థిక పరిస్థితి లేక ప్రజలు ఆకలి బాధలను అనుభవిస్తున్నారు. దీని తోడు ఆదేశంలో సరైన వ్యవసాయ విధనం లేకపోవడం కూడా ప్రజల కడుపు మాడ్చుతోంది. దీంతో ప్రజలు తమ ఆహార అవసరాల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫుడ్‌ బ్యాంకులపై ఆధారపడిల్సిన పరిస్థితి నెలకొంది. పేదరికం నేపథ్యంలో అల్పాదాయ పేదల కోసం దేశంలోని నర్వహిస్తున్న ఫుడ్‌ బ్యాంక్‌ల సంఖ్య తాజాగా 40,000లకు చేరింది. ఈ సంఖ్య రోనాల్డ్‌ రిగన్‌ అధ్యక్షుడిగా ఉన్న 1980లో కేవలం 200ల లోపే ఉండేది. రిగన్‌ కాలంలో సర్కారు అందించే ఫుడ్‌ స్టాంప్స్‌పై (సబ్సిడీ రేషన్‌) ఆధారపడే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేంది. ప్రతి 50 మంది అమెరికన్లలో ఒక్కరు ఈ స్టాంప్స్‌పై ఆధారపడేవారు. కాగా తాజాగా ఈ పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుతం ప్రతి నలుగురు అమెరికన్లలో ఒక్కరు ఫుడ్‌ స్టాంప్స్‌పై ఆధారపడుతున్నారు. ఇక్కడ ప్రజా పంపిణి వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండడంతో చాలా మారుమూల ప్రాంతాలలో ఆకలి చావులు సంభవిస్తున్నట్టుగా రిపోర్టు అందుతున్నాయి. అయితే ఈ రిపోర్టులు వెలుగులోకి రాకుండా అక్కడి స్థానిక పాలనా యంత్రాంగం తొక్కిపెడుతున్నట్టు ప్రయివేటు ఎజెన్సీలు జరుపుతున్న పరిశోధనల ద్వారా తెలుస్తోంది. నెక్ట్స్‌ జనరేషన్‌ ఫుడ్‌ (ఎన్‌జీఎఫ్‌)సంస్థ నివేదిక ప్రకారం అమెరికాలో దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న కుంటుంబాలలో దాదాపు 42 శాతం తీవ్రమైన ఆహార అభద్రతలో జీవిస్తున్నారు. చిన్నారులు ఉన్న 21 శాతం కుటుంబాల వారు ఏపూటకాపూట తమకు ఆహారం ఎలా లభిస్తుందో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ప్రధాన నగరాలలో జీవిస్తున్న వారిలో దాదాపు 17.7 శాతం మంది ప్రజలు ఆహార అభద్రతను అనుభవిస్తున్నారు.

ఎన్‌జీఎఫ్‌ నివేదిక ప్రకారం అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాలలో ప్రజలు ఎక్కువగా ఆకలి బాధలను అనుభవిస్తున్నారు. మిస్సిస్సిపీ (18.7%), లూసియానా (18.3%), అల్బమా (18.1%), న్యూ మెక్సికో (17.6%), అర్‌కన్సాస్‌ (17.5%), కెంటకీ (17.3%), మైనీ (16.4%), ఓక్లహామా (15.2%) రాష్ట్రాలలో అత్యధికంగా ప్రజలు ఆహర అభద్రత కారణంగా ఆకలితో అలుమటిస్తున్నారు. ఈ రాష్ట్రాలలోని కొన్ని మారుమూల ప్రాంతాలలో ఆకలి చావులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వీటికి తోడు నార్త్‌ డకోటా (6.9%), మస్సాచుసెట్స్‌ (8.3%), వర్జీనియా రాష్ట్రాలలో ఫుడ్‌ ఇన్‌సెక్యూరిటీ ఎక్కువగా నమోదు అవుతూ వస్తోంది. అమెరికాలో ఆకలి కేకలను నియంత్రించేందుకు గాను ప్రభుత్వంతో పాటు ప్రయివేటు సంస్థలు కూడా పలు స్వచ్ఛంద కార్యక్రమాలను చేపడుతున్నాయి. అల్పాదాయ ప్రజల నిమిత్తం సూపర్‌మార్కెట్లు, కమ్యూనిటీ పంటలు, ఉద్యాన వనాలు, ప్రజలు తమ పంటలను తామే పండించుకొనేలా తోడ్పాటు చర్యలు, వ్యవసాయ విధానాలలో మార్పులతో పాటు ఫుడ్‌ బ్యాంక్స్‌, ఫుడ్‌ స్టాంప్స్‌ వంటి సౌకర్యాలను కలిపిస్తుండగా.. మరోవైపు ప్రయివేటు రంగంలోని స్వచ్ఛంద సంస్థల వారు కూడా పేదలు నివసించే ప్రాంతాలలో ఫుడ్‌ ప్యాంట్రీలు, గంజి కేంద్రాలు, ఫుడ్‌ బ్యాంక్స్‌ల నిర్వహణ వంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి.

 అమెరికాలో ఆకలి బాధలు ఇంతంత కాదు
– అమెరికాలో దాదాపు 1.5 కోట్ల కుటుంబాల వారు ఆహార భద్రత లేక ఆకలితో అలమటిస్తున్నారు.- దాదాపు 4.5 కోట్ల మేర అమెరికన్లు నెలవారీగా ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు గాను ”సప్లమెంటల్‌ న్యూట్రిషన్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌” (ఎస్‌ఎన్‌ఏపీ) కింద అందించే స్టైఫండ్లపై ఆధారపడి భారంగా జీవనం సాగిస్తున్నారు.

ఈ పథకం కింది లబ్ధి పొందుతున్న వారిలో మూడింట రెండో వంతు కుటుంబాలు చిన్నారులను కలిగి ఉన్నవే కావడం విశేషం.

  • ప్రతి ఆరుగురు అమెరికన్‌ చిన్నారుల్లో ఒకరికి ఈ పూట ఆహరం తీసుకుంటే తదుపరి పూట ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుందో.. అసలు లభిస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో బతుకుతున్నారు.

  • అమెరికాలో 2.2 కోట్ల మంది చిన్నారులు తమ కడుపు నింపుకొనేందుకు గాను పాఠశాలల్లో అందిస్తున్న సబ్సిడీ లేదా ఉచిత భోజనంపై ఆధారపడుతున్నారు.

  • సర్కారు అందిస్తున్న ఆహారం రుచించక.. కడుపు నిండా తిండి లభించక చాలా మంది అమెరికన్‌ చిన్నారులు వివిధ రకాల ఆరోగ్య సమస్యలభారిన పడుతున్నారు.

  • సరైన పౌష్టికాహారం లేకపోవడంతో చిన్నారులు రక్తహీనత, వివిధ రకాల జబ్బులు, ఆస్తమాతో పాటు తీవ్ర ఆందోళన నిరాశావాదంలోకి ముగినిపోతున్నారు. ఫలితంగా చదువుల్లోనూ పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్నట్టు ఆరోగ్య నివేదికల ద్వారా తెలుస్తోంది.

  • గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న కుటుంబాలలో 15 శాతం ఆహార అభద్రతను అనుభవిస్తుండగా, మెట్రోపాలిటన్‌ నగరాలలో 11.8 శాతం కుటుంబాలు ఆకలి బాధలను అనుభవిస్తున్నారు.

(Courtesy Nava Telangana)