నవంబర్‌లో అయోధ్య తీర్పు వెలువడనున్నది; జాతీయ పౌర జాబితా ప్రక్రియను దేశ వ్యాప్తంగా వర్తింపచేయనున్నారు; పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బహుముఖీనమైన విస్తృత పర్యవసానాలకు దారితీసే ఉమ్మడి పౌర స్మృతి, మత మార్పిడి నిరోధక చట్టం, పౌరసత్వ (సవరణ) బిల్లును ప్రవేశ పెట్టే లేదా ఆమోదించే అవకాశమున్నది. ఈ ఐదు పరిణామాలూ లౌకిక రాజకీయాలకు అగ్నిపరీక్ష కానున్నాయి.
భారతదేశం లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా మనగలుగుతుందా? ఈ నవంబర్‌లో సంభవించనున్న ఐదు పరిణామాల నేపథ్యంలో ఈ ప్రశ్న అనివార్యమయింది. దేశ రాజకీయాలను, సామాజిక జీవనాన్ని అల్లకల్లోల పరిచిన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించనున్నది, ప్రస్తుతం అస్సోంను మాత్రమే కలవరపరుస్తోన్న జాతీయ పౌర జాబితా (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్–-ఎన్నార్సీ) ప్రక్రియను యావద్భారతానికీ విస్తరింప చేయడమనేది ఖాయం. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఉమ్మడి పౌర స్మృతిని ప్రతిపాదించనున్నారు. మత మార్పిడి నిరోధక చట్టాన్ని ప్రవేశపెడతారు. పౌరసత్వ (సవరణ) బిల్లును ఆమోదించవచ్చు. ఈ ఐదు పరిణామాలూ బహుముఖీనమైన పర్యవసానాలకు దారితీస్తాయని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రస్తావిత ఐదు విషయాలలోనూ ప్రభుత్వం తన మనోరథాన్ని నెరవేర్చుకోగలదా? పాలకులు ఆశిస్తున్న ఫలితాలు సమకూరితే అది హిందుత్వకు గొప్ప విజయం అవుతుంది. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఎలా వున్నప్పటికీ అది హిందువులకే పూర్తిగా సానుకూలమనే భాష్యాన్ని పాలకులు తప్పక చెబుతారు. ముస్లిం వలసదారుల సమస్యకు తుది పరిష్కారంగా దేశవ్యాప్త ఎన్నార్సీ, పౌరసత్వ చట్టం -1955 సవరణ బిల్లు గురించి ప్రచారం చేస్తారు. స్వతంత్ర భారత శాసనాలలోని హిందూ వ్యతిరేక వైఖరులను సరిదిద్దేందుకు దేశవ్యాప్త ఎన్పార్సీ, పౌరసత్వ చట్ట సవరణ అత్యవసరమని ప్రజలకు స్పష్టం చేస్తారు. మొత్తం మీద హిందువుల ప్రయోజనాలను కాపాడగలిగేది తాము మాత్రమేనని పాలక పక్షం ఢంకా భజాయిస్తుంది.
సరే, ఈ పరిణామాలకు లౌకికవాదులు ఎలా ప్రతిస్పందించనున్నారు? ఊహించడం కష్టమేమీ కాదు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అధిక సంఖ్యాక మత వర్గం వారికి అనుకూలంగా వుందని విమర్శలు వెలువడుతాయి. మైనారిటీ మతస్థుల మనో భావాలను ఉమ్మడి మత న్యాయ చట్టం విస్మరించిందని, తమ మత విశ్వాసాలను ప్రచారం చేసుకునేందుకు మైనారిటీ మత వర్గాలవారికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కును మత మార్పిడి నిరోధక చట్టం రద్దుచేసిందనే ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యే అవకాశం వున్నది. ముస్లిం లను నానా వేధింపులకు గురిచేయడమే లక్ష్యమైనందున జాతీయ పౌర జాబితా, పౌరసత్వ చట్ట సవరణను తిరస్కరించడం ఖాయం. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ ఐదు పరిణామాలూ మైనారిటీ మతస్థులకు వ్యతిరేకమైనవని, భారత్‌ను హిందూ మత రాజ్యంగా రూపొందించేందుకు దోహదం చేసేవని లౌకిక రాజకీయవేత్తలూ, మేధావులూ తప్పక దుయ్యబడతారు.
బీజేపీ, ఆరెస్సెస్‌లకు ఇంతకంటే ఏమి కావాలి? అవి, లౌకికవాదుల నుంచి సరిగ్గా ఇటువంటి ప్రతిస్పందననే కోరుకుంటున్నాయి మరి. సంఘ్ పరివార్ తరచూ లౌకిక రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక ఉచ్చును పన్నుతున్నది. లౌకిక రాజకీయాలు అనుద్దేశపూర్వకంగానే ఆ ఉచ్చులో చిక్కుకొంటున్నాయి. ట్రిపుల్ తలాక్ వివాదమే ఈ అనాలోచిత లౌకిక వాదానికి ఒక నిదర్శనం. సంఘ్ పన్నాగంలో చిక్కుకున్న లౌకికవాదులు మైనారీటీ మతస్థులకు అనుకూల శక్తులుగా ప్రజల ముందుకు వస్తున్నారు. ఇది వారికి తప్పనిసరి. తమ ఓటు బ్యాంకులను కాపాడుకోవడానికి వారి కది అనివార్యమవుతున్నది. ఇటీవల ఎన్నికల రాజకీయాల ఒత్తిళ్ళను తట్టుకునేందుకు కాంగ్రెస్ మొదలైన కొన్ని ‘లౌకిక’ పార్టీలు హిందుత్వ మనోభావాలను ఆదరిస్తున్నాయి. ఆ పార్టీల నేతలు తమను తాము హిందూ మత ఆచార పరాయణులుగా ప్రజలకు కన్పించేందుకు పలు విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు మృదు హిందూత్వగా సుప్రసిద్ధమయ్యాయి. ఇవి చిత్తశుద్ధిలేని లౌకిక రాజకీయాలు. రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక ధర్మాన్ని ఇవి పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి.
లౌకిక రాజకీయాలు ఇందుకు భిన్న రీతిలో ప్రతిస్పందించలేవా? అనాలోచిత మైనారిటీ మతస్థుల అనుకూలవాదం లేదా మృదు హిందూత్వను విడనాడి నియమబద్ధ, సైద్ధాంతిక ప్రతిస్పందన గురించి లౌకికవాదులు ఆలోచించలేరా? నవంబర్‌లో చోటుచేసుకోనున్న పరిణామాలకు కచ్చితమైన సూత్ర బద్ధ ప్రతిస్పందన సుసాధ్యమేనని నేను భావిస్తున్నాను. అటువంటి ప్రతిస్పందనే లౌకిక రాజకీయాలకు ఏడుగడ అవుతుందని కూడా నేను విశ్వసిస్తున్నాను. ప్రస్తావిత ఐదు పరిణామాలకు లౌకికవాదులు ఎలా ప్రతిస్పందించాలనే విషయమై నేనొక పద్ధతి లేదా మార్గం లేదా కార్యసాధన విధానాన్ని ప్రతిపాదిస్తున్నాను. నవంబర్‌లో వెలువడనున్న న్యాయవ్యవస్థ నిర్ణయాలు, కార్యనిర్వాహక వ్యవస్థ చేపట్టనున్న చర్యలు, శాసన వ్యవస్థ నిర్ణయాలను పూర్తిగా తిరస్కరించడం కాకుండా, వాటిలో ప్రతి ఒక్కదాని విషయంలో ప్రత్యేక ప్రతిస్పందనలను రూపొందించుకోవల్సిన అవసరం వుంది.
ఉమ్మడి పౌర స్మృతిని ఎటువంటి సందిగ్ధత లేకుండా ఆమోదించి, స్వాగతించాలి. వివాహం, విడాకులు, వారసత్వం మొదలైన వ్యవహారాలకు మార్గదర్శకంగా వున్న కుటుంబ చట్టాలన్నీ భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక వాద నియమాలకు అనుగుణంగా వుండేలా రూపొందించి తీరాలి. ఉమ్మడి పౌర స్మృతి రెండు విధాలుగా ఉండవచ్చు. ఒకటి- వివిధ మత వర్గాల వారికి వర్తిస్తున్న వేర్వేరు కుటుంబ చట్టాలన్నిటినీ రద్దుచేసి వాటి స్థానంలో ఒక ఏకైక చట్టాన్ని తీసుకురావడం. అయితే, ఇది ఒక ప్రతిబంధకమైన పద్ధతి. దీన్ని అనుసరించకుండా వుండడమే మంచిది. మెరుగైన రెండో మార్గం ఏమిటంటే మహిళా వ్యతిరేక, న్యాయవిరుద్ధ నిబంధనలన్నిటినీ తొలగించి వేర్వేరు మతాలకు చెందిన కుటుంబ చట్టాలను కొనసాగించడం. ఒక మతానికి చెందిన కుటుంబ చట్టాలను ఇతర మతాల వారిపై రుద్దనంతవరకు ఈ రెండు విధాల ఉమ్మడి పౌర స్మృతి లౌకికవాద సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది.
మత మార్పిడి నిరోధక చట్టానికి షరతులతో కూడిన ఆమోదాన్ని ఇవ్వాలి. నా యీ సూచన వివాదాస్పదమవుతుందని నాకు తెలుసు. రాజ్యాంగ నిర్మాణ సభ ఇటువంటి సూచనను అంగీకరించని మాట నిజమే. ఒక పౌరుడు తాను విశ్వసించే మతాన్ని ప్రచారం చేసుకునేందుకు అతనికి రాజ్యాంగం కల్పించిన హక్కును తిరస్కరించేదిగా నా సూచనను భావించే అవకాశమున్నది. అయితే మత మార్పిడులు లేదా ఒకసారి మతం మారినవారిని మళ్ళీ పూర్వపు మతంలోకి బలవంతంగా, మోసంతో, ఆర్థిక ప్రలోభాలతో తీసుకురావడాన్ని నిషేధించే చట్టం విషయంలో అటువంటి ఆక్షేపణ ఉపయుక్తం కాదని నేను భావిస్తున్నాను. హిందూమతం, పలు ఆదివాసీ మతాల నుంచి మత మార్పిడిలను ప్రోత్సహించడం సులభసాధ్యంగా వున్నది. అటువంటి మత మార్పిడిలను నిరోధించే చట్టాలు ఇప్పటికే పది రాష్ట్రాలలో అమల్లో వున్నాయి. కొత్త మత మార్పిడి నిరోధక చట్టాన్ని కేవలం మత మార్పిడికే కాకుండా పునః మతమార్పిడిలకు వ్యతిరేకంగా రూపొందించి దేశవ్యాప్తంగా ఆ చట్టాన్ని అమలు పరచాలనే షరతు విషయమై లౌకికవాదులు తప్పక పట్టుబట్టాలి. అంతేకాదు, ఆ కొత్త చట్టం కేవలం హిందువులనే కాకుండా, భారత జనాభా గణనలో పేర్కొన్న అన్ని మతాలను, మత మార్పిడిల నుంచి కాపాడే విధంగా వుండితీరాలి.
జాతీయ పౌర జాబితాకు సహేతుకమైన అభ్యంతరం తెలపాలి. దేశ పౌరుల జాబితాను ఆధునీకరించేందుకు, ప్రామాణీకరించేందుకు ప్రభుత్వం పూనుకోవడం సూత్రప్రాయంగా తప్పుకాదనే వాస్తవాన్ని లౌకిక రాజకీయవేత్తలు గుర్తించాలి. ఎన్నార్సీ అనేది ముస్లింలకు వ్యతిరేకంగా కుట్ర అని తప్పు పట్టడం సరికాదు. పౌరసత్వ నమోదు ప్రకియ నియమ నిబంధనలు వివక్షాపూరితంగా ఉంటే జాతీయ పౌర జాబితాను దేశ మంతటికీ విస్తరించడమనేది సాధ్యం కాదు. ఒక పౌరుడు తన పౌరసత్వాన్ని నిరూపించుకునే భారాన్ని అతనిపైనే పెట్టడం ఎంతవరకు సబబు? అస్సోంలో ఇదే విధానాన్ని అనుసరించడం వల్లే అక్కడ చాలా మంది తమ భారతీయ పౌరసత్వం విషయమై అంతులేని ఆవేదనకు గురవుతున్నారు. అటువంటి విధానం కేవలం మైనారిటీ మతస్థులనే కాదు, పేదలు, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించలేని దుర్బల పౌరులను అంతులేని కష్టనష్టాలకు గురిచేస్తుంది. ఈ వాస్తవాల దృష్ట్యా లౌకికవాదులు ఎన్నార్సీకి ఆక్షేపణ తెలపాలి.
అన్నిటి కంటే అత్యంత సమస్యాత్మకమైనది అయోధ్య వివాదం. సుహృద్భావ స్పూర్తితో ఒక గౌరవనీయమైన రాజీ కుదుర్చుకోవడమే ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం. బాబ్రీ మసీదు ఉన్న స్థల యాజమాన్యానికి సంబంధించిన వ్యాజ్యంగా అయోధ్య కేసును పరిగణిస్తే వక్ఫ్ బోర్డ్‌కు ఆ స్థలంపై న్యాయబద్ధమైన హక్కు ఉంటుంది. అయితే లౌకికవాదులు ఈ సంకుచిత న్యాయ దృక్పథాన్ని అనుసరించకూడదు. అలాగే ఆ వివాదాస్పద స్థలంలో మసీదుకు ముందు ఏముందనే విషయాన్ని నిర్ధారించేందుకు న్యాయస్థానాలు పూనుకోకూడదు. సుప్రీం కోర్టు తీర్పులోని చిన్నచిన్నతప్పులను వెదికే వైఖరిని లౌకిక వాదులు విడనాడాలి. సర్వోన్నత న్యాయస్థానం ప్రతిపాదించిన రాజీని, అటువంటి వివాదాలన్నిటికీ అది ఉత్తమ పరిష్కారంగా ఉన్నట్టయితే, లౌకికవాదులు తప్పకుండా అంగీకరించాలి.
దేశ పౌరసత్వ చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును దృఢవైఖరితో ప్రతిఘటించి తీరాలి. వలసవచ్చిన వారు ముస్లింలు అయివుండకూడదని ఈ బిల్లు చెప్పకనే చెప్పుతుంది. ఇది రాజ్యాంగంలో పొందు పరిచిన సమానత్వ హక్కును త్యజించడమే. అంతేగాక లౌకికవాద సూత్రాలను రద్దుచేయడమే అవుతుంది. కనుక ఈ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించాలి. భారత గణతంత్రరాజ్యంలో పౌరసత్వానికి మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం ద్వి-జాతి సిద్ధాంతాన్ని అంగీకరించడమే అవుతుంది. ఇది భారత్ భావనకు పూర్తిగా వ్యతిరేకం. గాంధీజీ గనుక సజీవుడుగా ఉన్నట్టయితే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్షకు పూనుకునేవారనడంలో సందేహం లేదు. లౌకికవాదులు ఈ పౌరసత్వ చట్ట సవరణ బిల్లును దృఢవైఖరితో వ్యతిరేకించాలి. భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకికవాద సూత్రాలను కాపాడుకున్నప్పుడు మాత్రమే భారతీయ ఆత్మ స్ఫూర్తిదాయకంగా వర్ధిల్లగలదు.
యోగేంద్ర యాదవ్(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)