– ఐదెకరాల్లోపు వారికే వర్తింపు
– అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం
– భారీగా తగ్గనున్న లబ్దిదారుల సంఖ్య

హైదరాబాద్‌: రైతు బంధు పథకానికి సీలింగ్‌ పెడతారా? అంటే అవుననే సమాధానం అధికారుల నుంచి వినిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. ఐదెకరాల్లోపు భూమున్నవారికి మాత్రమే ఇవ్వాలనే అంశంపై రాబోయే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధానపర నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్కార్‌ మౌఖిక అదేశాల మేరకు ఇప్పటికే రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెడుతున్నారు. గడిచిన ఖరీఫ్‌కు సంబంధించి ఇంకా 16 వందల కోట్ల బకాయిలు పేరుకు పోవడం, మరింత మంది రైతులు అర్హుల జాబితాలోకి చేరడంతో వీరందరికి ఈ పథకం అందించడం ప్రభుత్వానికి భారంగా మారినట్టు అధికారిక సమాచారం. భూస్వాములకు కాకుండా చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అందించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీలింగ్‌ వైపు మొగ్గుచూపడం ఖాయమని తెలుస్తున్నది.

2018 ఖరీఫ్‌లో రైతుబంధు పథకం ప్రారంభ సమయంలో రాష్ట్రంలోని 50లక్షల 80 వేల మందికి ఎకరానికి నాలుగు వేల చొప్పున రైతులకు నేరుగా చెక్కులను అందించారు. ఎన్నెకరాల భూముంది? సాగులో ఉందా? లేదా ?అనే విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే చెల్లించారు. ఆ తర్వాత రబీలో చెక్కులకు బదులుగా నేరుగా రైతుల బ్యాంక్‌ అకౌంట్లకు సొమ్ము మొత్తాన్ని ప్రభుత్వం బదిలీ చేసింది. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగానే రైతుబంధు పథకం సొమ్మును ఎకరానికి నాలుగు వేల నుంచి ఐదు వేలకు పెంచారు. ప్రతి ఏటా ఈ పథకానికి రూ. 12 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇందుకు తగ్గట్టుగా బడ్జెట్‌లో నిధులను సైతం ప్రభుత్వం కేటాయించింది. 2019 ఖరీఫ్‌ నుంచి పెంచిన మొత్తాన్ని అందించడానికి ఆపసోపాలు పడుతున్నది. ఈ సీజన్‌లో 12 లక్షల మందికి రూ. 16 వందల కోట్లను ఇంకా చెల్లించలేదు. ఇందులో చిన్న, సన్నకారు రైతులు సైతం ఉన్నారు. ఐదెకరాల పైన ఉన్న వారు, బీడు భూముల వారే ఎక్కువగా ఉన్నారు. అలాగే 2019 రబీ సీజన్‌ ప్రారంభంలో రైతు బంధు పంపిణీ చేయలేదు. మున్సిపల్‌, సహకార ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలు ఆలస్యంగా పంపిణీ ప్రారంభించినా అరదరికీ అందలేదు. మొదట్లో అరెకరం, ఎకరం, ఎకరంన్నర ఇలా ఐదెకరాల వరకు రైతుల బ్యాంక్‌ ఖాతాలో వేస్తుండటంతో పథకంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత ఖరీఫ్‌ నుంచి మొదలైన ఈ కోతలు పథకం పున: సమీక్షకేననే తెలుస్తున్నది. ఐదేకరాల్లోపు వారికే పథకం వర్తింపు అనే ఆదేశం అధికారికంగా రానప్పటికీ ఆ దిశగానే ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు, రైతుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వమే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిస్థితులకనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు సమాయాత్తమవుతున్నదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. స్వయంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రితో పాటు పలువురు అమాత్యులు ఎలాంటి సీలింగ్‌ లేదంటున్నప్పటికీ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు సీలింగ్‌ వైపు సర్కార్‌ మొగ్గు చూపే అవకాశం ఉన్నదని అధికారులు అంటున్నారు.

సీలింగ్‌ విధిస్తే..
రాష్ట్రంలో 57,88,664 మంది రైతుల వద్ద కోటి 42 లక్షల ఎకారాల భూమి ఉంది. ఇందులో ఐదెకరాల లోపు ఉన్న 51,76,872 మంది రైతుల వద్ద 95 లక్షల ఎకరాల భూమి ఉంటే ఐదెకరాలకు పైబడి ఉన్న 5,47,241 మంది రైతుల వద్ద 47 లక్షల ఎకరాల భూమి ఉంది. గడిచిన 2018 రబీ లెక్కల ప్రకారం ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి చెల్లించాల్సిన మొత్తం సీజన్‌కు 18 వందల కోట్ల చొప్పున 36 వందల కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. రాబోయే ఖరీఫ్‌ నుంచి ఈ తగ్గింపు అమలు చేయాలని సర్కార్‌ భావిస్తున్నట్టు సమాచారం.

Courtesy Nava teangana