• కేంద్ర ఆరోగ్యశాఖ పేరిట 30 లక్షల మందికి సందేశాలు
  • వ్యక్తిగత సమాచారం తస్కరణ.. ఆ లింక్‌లను ఓపెన్‌ చేయొద్దు: సీఈఆర్టీ

హైదరాబాద్ : దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఉచిత కరోనా పరీక్షలంటూ వల వేస్తున్నారు. మెయిళ్లకు ఫిషింగ్‌ సందేశాలు పంపిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా తస్కరిస్తున్నారు. ‘‘దేశంలో విపరీతంగా కరోనా వ్యాపిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 40 ఏళ్ల వయసు దాటిన 20 లక్షల మందికి ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. మొదటగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాల్లోని పౌరులకు పరీక్షలు చేయనుంది. ఈ లింక్‌ను క్లిక్‌ చేసి.. పూర్తి వివరాలు నమోదు చేయండి. కేంద్ర ఆరోగ్యశాఖ సిబ్బంది స్వయంగా మీ ఇంటికి వచ్చి నమూనాలు తీసుకెళ్తారు. మరుసటి రోజే రిపోర్టును మెయిల్‌కు పంపిస్తాం’’ అంటూ సైబర్‌ నేరగాళ్లు సందేశాలు పంపుతున్నారు. పాన్‌కార్డు నంబరును తప్పనిసరిగా నమోదు చేయాలని షరతు పెడుతుండడం గమనార్హం. సులువుగా నమ్మేందుకు.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ఈ-మొయిల్‌ను స్నూపింగ్‌ చేసి సందేశాలు పంపిస్తున్నారు.

దేశం లో ఇప్పటికే దాదాపు 30 లక్షల మందికి ఫిషింగ్‌ సందేశాలు పంపినట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ‘కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం’ (సీఈఆర్టీ) గుర్తించింది. ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలంటూ ఈ-మెయిళ్లకు వచ్చే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయొద్దని హెచ్చరించింది. కరోనా ఫిషింగ్‌ సందేశాల విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై పౌరులకు అవగాహన కల్పించాలని తెలంగాణ పోలీస్‌ శాఖకు సీఈఆర్టీ ఆదివారం ఓ లేఖ రాసింది. సోషల్‌మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలకు డిమాండ్‌ పెరిగిందని, ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో పరీక్షలకు ఖర్చవుతుండడంతో ఉచిత పరీక్షలనగానే ప్రజలు సులువుగా నమ్ముతున్నారని సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ నేరగాళ్ల బారిన పడొద్దని  కోరారు.

Courtesy Andhrajyothi