గంగపుత్రుల గ్రామబహిష్కరణ

– లిఫ్ట్‌ ద్వారా చెరువును నింపడంపై వీడీసీ జులుం
ఎఫ్‌డీవోకు ఫిర్యాదు చేసినందుకు వేటు
మహిళలను బీడీలు సైతం చుట్టనివ్వని వైనం

విలేజ్‌ డెవలెప్‌మెంట్‌ కమిటీ (వీడీసీ) మరోమారు రెచ్చిపోయింది. పెత్తందారులు వీడీసీ పేరుతో బడుగులపై పెత్తనం కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌లోని ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్‌లో గంగపుత్రులను గ్రామ బహిష్కరణ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మిర్యాల్‌లోని మూడు చెరువులను ఇటీవల లిఫ్ట్‌ ద్వారా గంగపుత్రులు నీళ్లు నింపారు. దీంతో ఒక్కో చెరువుకు రూ.50 వేల చొప్పున మూడు చెరువులకు రూ.1.50 లక్షలు చెల్లించాలని వీడీసీ సభ్యులు హుకుం జారీ చేశారు. ఇది తమ వృత్తి అని, తామేందుకు కట్టాలని గంగపుత్రులు తిరస్కరించారు. వీడీసీపై మత్స్యశాఖ ఎఫ్‌డీవోకు ఫిర్యాదు చేశారు. కాగా, కమిటీలో 16 మంది ఉండగా, గంగపుత్ర సంఘం నుంచి పెద్దమనిషిగా ఉన్న చిన్నసాయన్న పేరు రాయకుండా మిగతా 15 మందిపై ఫిర్యాదు చేశారు. ఆ 15 మందిపై ఎఫ్‌డీవో సూచన మేరకు సీఐ కేసు నమోదు చేశారు. దాంతో కక్ష కట్టిన వీడీసీ..
వారం రోజుల కిందట గంగపుత్ర సంఘం పెద్దమనిషికి రూ.20 వేలు జరిమానా విధించి, గంగపుత్రులపై గ్రామబహిష్కరణ విధించింది. అప్పటి నుంచి గంగపుత్ర కులస్తుల పశువులను మందలోకి రానివ్వడం లేదు. మహిళలు బీడీలు చుట్టకుండా ఆంక్షలు విధించారు. కిరాణా సామాను, హోటళ్లలో టీ కూడా పోయడం లేదు. కూలీకి పిలవడం లేదు. ఇతరులను బాధితుల పొలంలో పనికి రానివ్వడం లేదని వారు ఏర్గట్ల తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

 

(Courtacy Nava Telangana)

Leave a Reply